నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి.. అమెరికాతో పోటీ పడుతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్ రంగాన్ని డామినేట్ చేస్తోంది. త్వరలోనే ఏఐని ఓవర్ టేక్ చేయడానికి క్వాంటమ్ టెక్నాలజీ వేగంగా దూసుకొస్తోంది. భవిష్యత్ సాంకేతికత ప్రధాన్యతను ముందుగానే గుర్తించిన ఏపీ సీఎం చంద్రబాబు.. అమరావతిని క్వాంటమ్ కంప్యూటర్ హబ్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఆలోచన దగ్గరే ఆగిపోకుండా.. మైక్రోసాఫ్ట్, ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎండ్టీ వంటి టెక్ దిగ్గజాలతో కలిసి అమరావతి క్వాంటమ్ వ్యాలీని డెవలప్ చేస్తున్నారు.
ఇప్పటికే అమరావతిలో అధునాతన క్వాంటమ్ కంప్యూటర్ల నిర్మాణం ప్రారంభమైంది. 2026 డిసెంబర్ నాటికి తొలి క్వాంటమ్ కంప్యూటర్ అందుబాటులోకి వస్తుంది. ఫ్యూచర్ టెక్నాలజీ డెవలప్మెంట్లో ఇది ఎంత పెద్ద ముందడుగో తెలియాలంటే.. ఇదే అంశంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను ప్రస్తావించాల్సి ఉంటుంది.
సైన్స్ అండ్ టెక్నాలజీలో అమెరికా అధిపత్యాన్ని కొనసాగించేందుకు.. క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీని అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తామని డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సైంటిఫిక్ పరిశోధనల కోసం కోసం 2028 నాటికి క్వాంటమ్ కంప్యూటర్ని సిద్ధం చేస్తామని చెప్పారు. సంప్రదాయ కంప్యూటర్ల దగ్గర నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు అన్ని టెక్నాలజీల్లో ముందున్న అమెరికాలో 2028 నాటికి గానీ క్వాంటమ్ కంప్యూటర్ అందుబాటులోకి రాదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 2026 డిసెంబర్ నుంచే క్వాంటమ్ కంప్యూటర్ పని చేస్తుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలు.. కేవలం క్వాంటమ్ కంప్యూటర్ నిర్మాణం దగ్గరే ఆగిపోలేదు. అమరావతిని క్వాంటమ్ హార్డ్‌వేర్ హబ్‌గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2028 నాటికి అమరావతిలో తయారు చేసే క్వాంటమ్ కంప్యూటర్ హార్డ్‌వేర్ విడి భాగాలను ప్రపంచం మొత్తం ఎగుమతి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. క్వాంటమ్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ విషయంలో ఏపీ సీఎం ప్లాన్లు తెలిస్తే అమెరికా అధ్యక్షుడు కూడా షాక్ అవుతారేమో.











