వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ప్రతిపక్షాలను దునుమాడడంలో అపారమైన అనుభవం కలిగి ఉన్న అంబటి రాంబాబుకు కొవిడ్ పాజిటివ్ గా నిర్ధరణ అయింది. అసెంబ్లీ వద్ద చేయించిన పరీక్షల్లో తనకు పాజిటివ్ అని తేలినట్లు అంబటి రాంబాబు స్వయంగా వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన ట్వీట్ ద్వారా తెలియజేశారు. అంబటికి కొవిడ్ రావడం ఇది రెండోసారి. జులైలో ఒకసారి పాజిటివ్ రావడంతో.. ఆస్పత్రిలో చికిత్స పొంది రికవర్ అయ్యారు.
‘‘జులైలో నాకు కోవిద్ వచ్చి తగ్గిన సంగతి మీ అందరికీ విధితమే. నిన్న అసెంబ్లీలో కోవిద్ టెస్ట్ చేయించాను, రిపోర్ట్స్ పాజిటివ్ వచ్చాయి .రీ ఇన్ఫెక్షన్ కి గురికావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అవసరమైతే ఆస్పత్రి లో చేరతాను. మీ ఆశీస్సులతో కోవిద్ ని మరోసారి జయించి మీ ముందుకి వస్తాను’’ అని అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. యాంటీజెన్ టెస్టులో నెగటివ్ వచ్చింది. పీసీఆర్ఐ టెస్టులో పాజిటివ్ గా నిర్ధరణ అయింది.
సూపర్ స్ప్రెడర్ అవుతారా?
సాధారణంగా.. ఒకే వ్యక్తి వల్ల అనేక మందికి కొవిడ్ వ్యాపించే అవకాశం ఏర్పడినప్పుడు.. సూపర్ స్ప్రెడర్ అంటారు. రెండోసారి కొవిడ్ వచ్చిన ప్రతివాళ్లూ ఖచ్చితంగా సూపర్ స్ప్రెడర్ అవుతారని అనడానికి వీల్లేదు కానీ.. అలా అయ్యే అవకాశం లేదని చెప్పడానికి కూడా లేదు. వారివలన అనేక మందికి సోకే ప్రమాదం లేదనడానికి కూడా వీల్లేదు.
ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఒకసారి కొవిడ్ వచ్చిన వారికి మళ్లీ రాదనే ప్రచారం ఒకటి ఉంది. రెండోసారి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని మాత్రమే గుర్తుంచుకోవాలి. ‘‘అయితే రెండోసారి కూడా కొవిడ్ కు గురికావడం ఆశ్చర్యం కలిగించింది’’ అని అంబటి రాంబాబు విస్మయం వ్యక్తం చేస్తున్నారు గానీ.. అమిత్ షా లాంటి ఎంతో మంది ప్రముఖులకు రెండోసారి వచ్చిందనే పాయింట్ ఆయనకు గుర్తున్నట్టు లేదు.
కొవిడ్ అంటే నిర్లక్ష్యం జాస్తి
సాధారణంగా వైఎస్సార్సీపీ నాయకులకు కొవిడ్ జాగ్రత్తల పట్ల నిర్లక్ష్యం ఉన్నదనే ప్రచారం బాగా ఉంది. ఆ విషయం నిజమనిపించేలా వారు చాలా సందర్భాల్లో వ్యవహరించారు. ఇతర పార్టీలకు చెందిన వారి కార్యక్రమాల్లో కొవిడ్ నిబంధనల్ని కాస్త అతిక్రమించినట్టుగా జనం చేరినా సరే.. కేసులు పెట్టేస్తుంటారు. అదే అధికార పార్టీ వారి విషయంలో మాత్రం.. కొవిడ్ విషయంలో అత్యంత నిర్లక్ష్యంగా భారీ జన సందోహంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ.. వార్తల్లోకెక్కారు. కనీసం మాస్క్ వాడకం కూడా పట్టించుకోరనే పేరు తెచ్చుకున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి జగన్- తనను కలవడానికి వచ్చిన వారిని మాస్క్ తీసేసి ఫోటోలకు పోజులివ్వాలంటూ ప్రోత్సహించడం కూడా కొన్ని సందర్భాల్లో విమర్శల పాలైంది. ఇలాంటి నేపథ్యంలోనే… అనేక మంది పార్టీ నాయకుల మాదిరిగానే.. అంబటి రాంబాబు కూడా.. కొవిడ్ జాగ్రత్తల పట్ల నిర్లక్ష్యం వహించారేమో.. రెండోసారి పాజిటివ్ గా తేలారని ఆయన అభిమానులే బాధపడుతున్నారు. ఇప్పటికైనా తమ నాయకుడు ఆస్పత్రిలో చేరి మళ్లీ కొవిడ్ ను జయించడంతో పాటు, మరింత జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
జులైలో నాకు కోవిద్ వచ్చి
తగ్గిన సంగతి మీ అందరికీ విధితమే
నిన్న అసెంబ్లీలో కోవిద్ టెస్ట్ చేయించాను,
రిపోర్ట్స్ పాజిటివ్ వచ్చాయి .రీ ఇన్ఫెక్షన్ కి గురికావడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
అవసరమైతే ఆస్పత్రి లో చేరతాను.
మీ ఆశీస్సులతో కోవిద్ ని
మరోసారి జయించి మీ ముందుకి వస్తాను— Ambati Rambabu #StayHomeStaySafe (@AmbatiRambabu) December 5, 2020