కొద్ది రోజుల క్రితమే వైసీపీలో చేరిన ఇంటర్నేషనల్ క్రికెటర్ అంబటి రాయుడు ఆ పార్టీ నుంచి బయటికి వచ్చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో ఓ పోస్టు ద్వారా ప్రకటించారు. కొన్నాళ్లు అసలు రాజకీయాలే దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా చెప్పారు. దీంతో అటు వైసీపీ కార్యకర్తలతో పాటుగా, ఇటు అంబటి రాయుడు ఫ్యాన్స్ విస్మయానికి గురవుతున్నారు. సడన్ గా ఏమైంది బ్రో అని వైసీపీ కార్యకర్తలు, ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
అంబటి రాయుడు ఉన్నట్టుండి కనీసం ఎవరూ ఊహించని రీతిలో వైసీపీ నుంచి బయటికి వచ్చేయడం ఆ పార్టీకి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది జగన్ సన్నిహిత నేతలు, కీలక నేతలు, సీనియర్ నేతలు జగన్ కు ఝలక్ ఇచ్చి పార్టీని వీడారు. టీడీపీలో చేరారు. ఇంకా ఎంతో మంది పార్టీని వీడడానికి రెడీ అవుతున్నారు. జగన్ నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జుల లిస్టు ప్రకటించే కొద్దీ ఆ అసమ్మతి నేతల లిస్టు పెరుగుతూనే ఉంటుంది. అదంతా ఒక ఎత్తయితే.. ఇప్పుడు క్రికెటర్ అంబటి రాయుడు పార్టీలో చేరిన కొద్ది రోజులకే బయటికి వచ్చేయడం విస్మయం గొలుపుతోంది.
నిజానికి అంబటి రాయుడును ఎవరూ వైసీపీలోకి ఆహ్వానించలేదు. ఆయనే తనంతతానుగా.. తనకు రాజకీయాలపై ఆసక్తి ఉందంటూ వైసీపీలోకి వచ్చారు. అప్పట్లో తాడేపల్లికి వచ్చి వైఎస్ జగన్ ను మొదటి సారి కలిసిన నాటి నుంచి కొద్ది నెలల పాటు గుంటూరు జిల్లా వ్యాప్తంగా బాగా పర్యటనలు చేశారు. స్కూళ్లు, కాలేజీలు, పల్లెటూర్లు తిరిగారు. దీంతో ఆయన గుంటూరు ఎంపీ టికెట్ లేదా అక్కడ ఏదైనా ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారని అంతా అనుకున్నారు. ఏమైందో కానీ, ఆయన తన మకాంను విశాఖపట్నానికి మార్చారు. గుంటూరు రాజధాని ప్రాంతం కావడం.. వైసీపీకి తీవ్రమైన వ్యతిరేకత ఉండడంతో ఆయన తన మకాం ఉత్తరాంధ్రకు మార్చారని అనుకున్నారు. ఉత్తరాంధ్రలో కనుక తనకు టికెట్ ఇస్తే అక్కడ గెలుపు సునాయం అవుతుందని అక్కడ కూడా ప్రజల్లో అంబటి రాయుడు బాగా తిరిగారు.
ఈ క్రమంలోనే ఇటీవల వైసీపీ కండువా కప్పుకున్నారు. వైఎస్ జగన్ ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు. ఇలా పార్టీలో చేరిన రోజుల వ్యవధిలోనే బయటికి వచ్చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామంతో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. ఇక ఆపార్టీని విశ్వసించేవారు మరింతగా తగ్గిపోయారు. మరికొంత మంది అంబటి రాయుడు డకౌట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.