వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి విలాసాలతో గడుపుతారన్న దానిపై తెలుగు వారందరికీ ఓ అవగాహన ఉంది. అయితే ఎక్కడో ఉత్తర భారతానికి చెందిన…అది కూడా అంతగా ఆర్భాటాలను పట్టించుకోని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా లాంటి వాళ్లకు ఈ విషయాలు పెద్దగా తెలియవు కదా. ఒకవేళ… జగన్ విలాసాల గురించి తెలిస్తే… అమిత్ షా పరిస్థితి ఏమిటి?. ఇంకేముంది… నోరెళ్లబెట్టడమే. ఇప్పుడు అదే జరిగింది. ఇటీవల ఏపీ పర్యటనకు వచ్చిన అమిత్ షా… వచ్చీరావడంతోనే ఉండవల్లిలోని సీఎం నారా చంద్రబాబునాయుడు అధికార నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఏర్పాటు చేసిన స్పెషల్ డిన్నర్ ను ఎంజాయ్ చేసిన అమిత్ షా… ఆ తర్వాత తీరుబడిగా కూర్చుని చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. కేంద్ర మంత్రులు బండి సంజయ్, శ్రీనివాస రాజులతో కలిసి కాసేపు పిచ్చాపాటిగా సంభాషించారట.
బెజవాడలోని దుర్గ గుడి కళాకాంతులతో వెలిగిపోతున్న దృశ్యాలను చూసిన అమిత్ షా…మీ ఇల్లు సరిగ్గా గుడికి ఎదురుగా… అది కూడా నదీ ఉపరితలాన్నిఆనుకుని భలే ఉంది అంటూ చంద్రబాబును ప్రశంసించారట. అదే సమయంలో జగన్ అంశాన్ని కూడా ప్రస్తావించిన షా… జగన్ ఇల్లు ఎక్కడ అంటూ ఆరా తీశారు. దీంతో… ఒకింత అసౌకర్యానికి గురైన చంద్రబాబు అండ్ కో ‘జగన్ కు ఒకే ఇల్లు అయితే చెప్పొచ్చు. ఆయనకు ఏకంగా నాలుగు ఇళ్లు ఉన్నాయి. వాటిని ఇల్లు అనే కంటే ప్యాలెస్ అంటే సరిపోతుందేమో’ అంటూ బదులిచ్చారట. ఈ మాట విన్నంతనే… ఆశ్చర్యపోయిన షా.. జగన్ కు ఎన్ని ప్యాలెస్ లు ఉన్నాయి? ఎక్కడెక్కడ ఉన్నాయి? అంటూ ఆరా తీశారని సమాచారం.
జగన్ కు హైదరాబాద్ లో లోటస్ పాండ్ పేరిట అత్యంత భారీ ప్యాలెస్ ఉందని చంద్రబాబు అండ్ కో తెలిపింది. ఈ భవంతిలో అధునాతన వసతులతో పాటుగా ఏకంగా 100 గదులు ఉన్న విషయాన్ని వివరించింది. ఇక కర్ణాటక రాజధాని బెంగళూరులో ఏకంగా 36 ఎకరాల్లో జగన్ ఓ భారీ భవంతిని… రాజ మహల్ ను తలపించేలా నిర్మించుకున్నారని తెలిపింది. ఈ భవంతిలో వందల సంఖ్యలో గదులు ఉండగా… కాపలా కోసం వందల మంది సెక్యూరిటీ గార్డులు ఉన్నారని వివరించింది. ఇక వైఎస్ ఎస్టేట్ గా పేరున్న పులివెందుల సమీపంలోని ఇడుపులపాయలో జగన్ అత్యంత ఆధునిక వసతులతో మరో ప్యాలెస్ నిర్మించుకున్నారని తెలిపింది. ఈ భవనాలకు అదనంగా తాడేపల్లిలో జగన్ ప్యాలెస్ లాంటి ఇంటిని నిర్మించుకున్నారని,దీని కోసం వందల కోట్లు ఖర్చు పెట్టారని కూడా తెలిపారట. ఈ భవనాల గురించి చంద్రబాబు అండ్ కో చెబుతూ ఉంటే… అమిత్ షా అలా నోరెళ్లబెట్టారని తెలుస్తోంది..
ఈ విలాసవంతమైన భవంతుల్లో నివాసం ఉండే జగన్… 2024లో కూడా తానే గెలుస్తానని భావించి… తాను నివాసం ఉండేందుకు విశాఖలో ప్రజా ధనంతో భారీ భవంతిని నిర్మించిన విషయాన్ని కూడా అమిత్ షా ముందు పెట్టింది. విశాఖ పరిధిలోని రుషికొండ బీచ్ కు అభిముఖంగా రూ.500 కోట్ల ప్రజా ధనంతో జగన్ ఓ విలాసవంతమైన భవంతిని నిర్మించారని, అందులోని ఏర్పాటు చేసిన సౌకర్యాలను చూసి తామే ఆశ్చర్యపోయామని కూడా ఆ బృందం వివరించింది. ప్రస్తుతం జగన్ ఓడిపోయి… అధికారం కోల్పోయి టూర్ల మీద టూర్లు వేస్తున్నారని, ఆయన విశాఖలో నిర్మించిన భవనాన్ని ఏం చేయాలో కూడా తమకు పాలుపోవడం లేదని తెలిపింది. ఇలా చంద్రబాబు అండ్ కో నోట జగన్ విలాసాలను, ప్యాలెస్ లను విన్న అమిత్ షా అమితాశ్చర్యానికి గురయ్యారు..