ఏపీ రాజధాని అమరావతికి మరో ప్రముఖ ఇన్‌స్టిట్యూట్ రానుంది. ఇది ఎంతో ప్రాధాన్యం ఉన్న ఒక అంతర్జాతీయ స్థాయి న్యాయ కళాశాల. అంతటి గొప్ప సంస్థను అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నారు. ఇది అమరావతిలో దాదాపు 100 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఏర్పాటు కానుంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ద్వారా ఇంటర్నేషనల్ లా స్కూల్ ఏర్పాటు చేసే విషయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఈ ప్రక్రియను వెంటనే వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, గోవాలోని ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలలాగానే అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యుత్తమమైన లా కాలేజీని అమరావతిలో ఏర్పాటు చేస్తామని చంద్రబాబు చెప్పారు.
సోమవారం సెక్రటేరియట్లో న్యాయశాఖపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇదే సమీక్షలో ఎన్నికల సమయంలో టీడీపీ ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసే విషయాన్ని కూడా చంద్రబాబు ప్రస్తావించారు. ఈ ప్రతిపాదనను తాము కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని.. దీనిపై కేబినెట్ మీటింగ్ లో తీర్మానం చేస్తామని చంద్రబాబు చెప్పారు. జూనియర్ అడ్వకేట్‌లు తమ వృత్తిలో నిలదొక్కుకునేందుకు వారికి నెలకు గౌరవ వేతనం కింద రూ.10 వేలు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఇదే విషయాన్ని ఎన్నికల ప్రణాళికలో తాము ప్రకటించామని చంద్రబాబు చెప్పారు. అలాగే జూనియర్ అడ్వకేట్ల ట్రైనింగ్ కోసం అకాడమీ ఏర్పాటుకు కసరత్తు చేయాలని కూడా అధికారులను చంద్రబాబు ఆదేశించారు.
ఇదే కార్యక్రమంలో ప్రాసిక్యూషన్ విభాగం అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా చంద్రబాబుకు ఇచ్చారు. సీఎం చంద్రబాబు వారితో మాట్లాడుతూ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని నిర్దేశించారు. పెండింగ్ లో ఉన్న కేసుల దర్యాప్తులను వేగవంతం చేయడం.. శిక్షల శాతాన్ని పెంచేందుకు అధునాతన పద్ధతులను పాటించాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. నేరానికి పాల్పడ్డవారికి శిక్ష తప్పదనే నమ్మకాన్ని ప్రాసిక్యూషన్ ప్రజలకు కల్పించాలని అన్నారు. ప్రభుత్వ ఆస్తులను రక్షించేందుకు కోర్టులను ఆశ్రయించాలి తప్ప.. అనవసరంగా వివాదాలను క్రియేట్ చేసేలా అధికారులు వ్యవహరించవద్దని చంద్రబాబు కోరారు. న్యాయశాఖపై మరింత లోతుగా సమీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉందని.. మరిన్ని వివరాలతో రావాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.











