సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఒక్క సినిమా అయినా చేయాలని నటీనటులు ఆశపడుతుంటారు. ఆ బ్యానర్ కి గల పేరు ప్రతిష్ఠలు అలాంటివి. ఎంతోమంది అగ్రకథానాయకులు .. నాయికలు ఆ బ్యానర్లో నటించారు. ఎన్నో విజయవంతమైన సినిమాలు ఆ బ్యానర్ నుంచి వచ్చాయి. అన్నేసి విజయాలను అందుకోవడానికి కారణం, కథ విషయంలో అక్కడ ఓ యజ్ఞం జరుగుతుంది. యజ్ఞ ఫలంగా పూర్తి కథ నిర్మాణానికి ముందే దృశ్యరూపంలో కనిపిస్తే తప్ప సురేశ్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వరు. కథ విషయంలో ఆయనను ఒప్పించడం చాలా కష్టం . ఒప్పుకున్నారూ అంటే విజయం తథ్యం అని చెప్పుకుంటూ ఉంటారు.
అలాంటి సురేశ్ ప్రొడక్షన్స్ లో నటించే అవకాశాన్ని ఆనంద్ దేవరకొండ కొట్టేశాడనేది తాజా సమాచారం. ప్రముఖ సినిమాటోగ్రఫర్ కేవీ గుహన్, ఈ మధ్య దర్శకత్వం పై ఎక్కువగా దృష్టి పెట్టాడనే విషయం తెలిసిందే. కల్యాణ్ రామ్ హీరోగా ఆ మధ్య ఆయన తెరకెక్కించిన ‘118’ సినిమా హిట్ కొట్టేసింది. వైవిధ్యభరితమైన చిత్రంగా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. రీసెంట్ గా ఆయన సురేశ్ బాబును కలిసి ఒక విభిన్నమైన కథను వినిపించాడట. కథ కొత్తగా ఉండటంతో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా, ఆనంద్ దేవరకొండతో ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పారని అంటున్నారు.
విజయ్ దేవరకొండ ఎంత రఫ్ గా కనిపిస్తాడో, ఆనంద్ దేవరకొండ అంత సాఫ్ట్ గా అనిపిస్తాడు. తొలి సినిమా అయిన ‘దొరసాని’తోనే మంచి మార్కులు కొట్టేశాడు. ప్రేమించడం మాత్రమే తెలిసిన ఓ విలేజ్ కుర్రాడిగా ఆ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఇక ఈ మధ్య వచ్చిన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’లో కూడా సహజత్వాన్ని చూపించాడు. ఇప్పుడు మూడో సినిమాను సురేశ్ ప్రొడక్షన్స్ లో చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుంది. అప్పుడే పూర్తివివరాలు తెలియనున్నాయి.
Must Read ;- ‘నారప్ప, ఎఫ్ 3’.. రెండింటిలో ఏది ముందు రిలీజ్ కానుంది.?











