(అనంతపురం నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
అనంతపురం జిల్లా కరవుకు నిలయం.. పండ్ల తోటల సాగు అనుకూలం. ప్రపంచ దేశాల్లోనూ మన పండ్లకు గిరాకీ కూడా ఉంది. రైతులు సాగు ఖర్చు, కష్టానికి వెనుకాడకుండా నాణ్యమైన ఉద్యాన ఉత్పత్తులను పండిస్తున్నారు. సాగుదారుడి దక్కనిదల్లా గిట్టుబాటు ధరే. అందుకు తగిన విధంగా మార్కెటింగ్ లేకపోవటమే రైతుల పాలిట దురదృష్టంగా మారింది.
అయితే తక్కువ సమయంలో పంట దిగుబడికి డిమాండ్ ఉన్న ప్రాంతంలో మార్కెటింగ్ కు ప్రభుత్వం రవాణా సదుపాయం కల్పిస్తూ అనంతపురం నుంచి ఢిల్లీకి కిసాన్ రైలు ఏర్పాటు చేయటం అనంత రైతుల పాలిట వరంగా భావించాలి. అయితే కొన్ని అనుకూల అంశాలు ఉన్నా, ప్రతికూలతలు కూడా అంతకు మించి ఉన్నాయి.
దళారీలకు అడ్డుకట్ట లక్ష్యం
ఉద్యాన రైతు ఉత్పత్తులను ఢిల్లీకి చేరవేసి మార్కెటింగ్‌కు ఏర్పాటు చేసిన రవాణా సదుపాయం దేశంలోనే రెండో కిసాన్ రైలు. తద్వారా రైతులు దేశరాజధాని మార్కెట్‌లో నేరుగా రైతులే, ట్రేడర్ కు విక్రయాలు చేసుకోవచ్చు. తద్వారా దళారీ వ్యవస్థను అడ్డుకోవచ్చు. అంతేగాకుండా సుదూర రవాణాను, వారం రోజులు పట్టే ప్రయాణానికి బదులు, 36గంటల సమయంలో సరకు చేర్చుకోవచ్చు. నాణ్యతగా సరకు తీసుకెళ్ల వచ్చంటున్నారు.
దీంతో తొలిసారి ప్రయోగాత్మకంగా 14బోగీల్లో ఒక్కో బోగీలో 23టన్నుల చొప్పున ఐదారు రకాల పండ్లను తీసుకెళ్తున్నారు. నాణ్యత కలిగిన అనంతపురం జిల్లాకు చెందిన పండ్లకు డిమాండ్ ఉంటుందని భావిస్తున్నారు. అయితే వీటన్నింటినీ మించిన ప్రతికూల తలు కూడా ఉన్నాయి.
రవాణా ఖర్చు మారదు.. హమాలీ ఖర్చు తడిసి మోపెడు
ఉద్యాన పంటలను నేరుగా, తక్కువ సమయంలో తీసుకెళ్లినా అదనపు భారాన్ని మోయాల్సి ఉంది. లారీ లోడుతో తీసుకెళ్లేందుకు రు.1.10 నుంచి రు.1.50లక్ష వరకు చెల్లించే రవాణా ఖర్చును కిసాన్ రైలులోనూ ఒక బోగీలో నింపిన 23 టన్నుల భర్తీకి, టన్నుకు రు.5132 చొప్పున రవాణా ఖర్చు వస్తోంది. దీంతో రవాణా ఖర్చులో తేడా కనిపించ లేదు. అంతేగాకుండా లారీతో వెళ్తే సరకు ఓసారి ఎత్తి, దింపితే సరిపోయేది. ఇప్పుడేమో పొలంలో ఓసారి లోడు చేసి, రైల్వేస్టేషన్ దింపాలి. అక్కడ మళ్లీ రైల్ బోగీలోకి ఎక్కించాలి. అదే తంతు ఢిల్లీకి వెళ్లిన తర్వాత కూడా చేయాలి. దీంతో నాలుగు రెట్లు అదనంగా హమాలీ ఖర్చు భరించాల్సి వస్తోంది. తీరా అక్కడికెళ్లిన తర్వాత అంచనాకు మించి సరకు వస్తే అమ్మకాలు ఆలస్యమైతే గిట్టుబాటు దొరక్కపోగా, వేచిచూసేందుకు సరకు నిల్వ రుసుం చెల్లించాల్సించే సంగతేమిటి అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చిన్న కమతాల రైతుల పండ్ల రవాణా విషయంలో కూడా సందేహాలు లేకపోలేదు అన్నింటినీ మించి భాష తెలియని రైతులకు హిందీ సమస్య కానుందని ఆందోళన కూడా ఉంది. అన్నింటినీ అధిగమించి గిట్టుబాటుతో ఉద్యానం పండితే రైతులకు పండుగే మరి.
జగన్ సంకల్పం మంచిదే కానీ…
సీఎం జగన్మోహన్ రెడ్డి అనంతపురం కరవురైతుల మీద ప్రేమతోనే ఈ కిసాన్ రైలు తీసుకువచ్చినట్లు ఆ పార్టీనాయకులు, ప్రభుత్వంలోని పెద్దలు చెబుతున్నారు. అయితే.. దీనికి రైతుల్లో వాస్తవమైన హర్షం వ్యక్తం అవుతోందా? అనేది ప్రశ్న. తొలిసారిగా ఢిల్లీకి ప్రయాణమైన కిసాన్ గాడీ కోసం 20 బోగీలను సిద్ధం చేశారు. ఒక్కో బోగీలో 23 టన్నుల దిగుబడి నింపవచ్చు. అయితే కేవలం 14 బోగీలు మాత్రమే నిండాయి. అనంతపురం జిల్లాలో 460 టన్నుల ఉద్యాన దిగుబడి లేకపోయిందా? అంచనా ప్రకారం.. కేవలం 325 టన్నుల దిగుబడిని మాత్రమే తీసుకువెళ్లే పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ప్రశ్నార్థకం. రైతులు దీనికంటె తమకు అలవాటు అయిన సాంప్రదాయ మార్కెటింగ్ పద్ధతులే మేలని భావిస్తున్నారేమో అనే సందేహం కలుగుతోంది. ప్రభుత్వాలు క్షేత్రస్థాయి వాస్తవాలను కూడా పరిగణనలోకి తీసుకుని.. రైతులకు న్యాయం చేయాలనే ఆలోచనలకు మరింత పదును పెట్టుకోవాలి.