రష్మీ గౌతమ్ .. ఈ పేరు తెలియని కుర్రాళ్లు ఉండరు .. ఆమె రూపాన్ని తలవని కుర్రాళ్లూ ఉండరు. వాళ్లంతా ఆమెను బుల్లితెర చందమామగా పిలుచుకుంటారు .. ఆమె కొంటె చూపులతో తమ గుండె గుడిలో దీపాలను వెలిగించుకుంటారు. ఆమె నవ్వులను దోసిళ్లలో పట్టాలనుకుంటారు .. మనసును మూటగట్టి ఆమెకి ముట్టజెప్పాలనుకుంటారు. చామంతికి చమ్కీలు అద్దినట్టు కనిపించే రష్మీకి అభిమానులు ఎక్కువ .. ఆరాధకులూ ఎక్కువే. వచ్చీరానట్టుగా అనిపించే తెలుగు .. అందులో కనిపించే యాస .. ఆమె యాంకరింగుకి ప్రత్యేక ఆకర్షణగా వాళ్లంతా భావిస్తారు. ఆమె కలువపూల కళ్లు చేసే విన్యాసాలు చూడటానికే వాళ్లంతా టీవీ సెట్ల ముందు తుమ్మెదల్లా వాలిపోతారు.
అందం .. అల్లరి కలగలిసినట్టుగా, వెండిపాత్రలో వెన్నెలను ఆరబోసినట్టుగా రష్మీ కనిపిస్తుంది. అజంతా శిల్పం ఉత్సాహమనే ఊపిరి పోసుకుని స్టేజ్ పైకి వచ్చినట్టుగా అనిపిస్తుంది. అలిగినప్పుడు .. సిగ్గుపడినప్పుడు .. తనపై ఎవరైనా పంచ్ వేసినప్పుడు బిత్తరపోతున్నట్టుగా ఆమె ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ కుర్రాళ్లకి కునుకు లేకుండా చేస్తాయనడంలో అతిశయోక్తి లేదు. అప్పుడే విరిసిన తెల్ల మందారంలా బుల్లితెరపై కనిపించే రష్మీ, డాన్సులు అదరగొట్టేస్తుంది. రష్మీకి ఈ స్థాయి క్రేజ్ రావడంలో ఆమె డాన్సులు కూడా ప్రధానపాత్ర వహించాయనేది అందరికీ తెలిసిన నిజం.
అయితే బుల్లితెరపై సంతోషంగా కనిపిస్తూ సందడి చేసే రష్మీ వెనుక కష్టాలు ఉన్నాయి .. కన్నీళ్లు ఉన్నాయి. అవకాశాల కోసం అదేపనిగా తిరిగిన సందర్భాలు ఉన్నాయి. కెరియర్ తొలినాళ్లలో తను ఒంటరిపోరాటం చేసినట్టుగా కొన్ని ఇంటర్వ్యూల్లో ఆమెనే స్వయంగా చెప్పింది. తొలి పారితోషికంగా ‘చెక్’ అందుకున్నప్పుడు ఆమెకి బ్యాక్ అకౌంట్ కూడా లేదట. ఆ సమయంలో ఒక స్నేహితురాలి సాయంతో ఎకౌంట్ ఓపెన్ చేశానని అంది. అప్పట్లో తనకి ఈ మాత్రం కూడా తెలుగు రాదు. అయినా కొద్దికొద్దిగా నేర్చుకుంటూ, తనపై తనకి గల నమ్మకంతో ప్రయాణాన్ని సాగించింది. ఇలా రష్మీ గురించి తెలుసుకుంటూ వెళితే, ఆమెలో అందం మాత్రమే కాదు అంతకుమించిన అంకితభావం .. ఆత్మస్థైర్యం కనిపిస్తాయి.
అందం .. చురుకుదనం .. చలాకీదనంతో రష్మీ కుర్రాళ్ల హృదయాలను కొల్లగొడుతూ వెళ్లింది. దాంతో ప్రతి కుర్రాడి కలల గోడపై రష్మీ పోస్టర్ పడిపోయింది. ఈ క్రేజ్ కారణంగానే రష్మీకి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. తొలినాళ్లలో చిన్నచిన్న పాత్రలను వేస్తూ వచ్చిన రష్మీ, పెరుగుతున్న తన క్రేజ్ కి తగిన విధంగా తన పాత్రల పరిధిని పెంచుకుంటూ వెళ్లింది. అలా ఆమె చేసిన సినిమాల జాబితాలో ‘గుంటూరు టాకీస్’ .. ‘తను వచ్చెనంట’ .. ‘అంతకు మించి’ .. ‘శివరంజని’ కనిపిస్తాయి. ఈ సినిమాల కథాకథనాలను పరిశీలిస్తే, కథానాయిక పాత్రలను .. నాయిక ప్రధానంగా సాగే పాత్రలను ఆమె చేసిందనే విషయం అర్థమవుతుంది.
రష్మీ నుంచి ప్రేక్షకులు కోరుకునేది గ్లామర్ .. అందువల్లనే ఆమె గ్లామరస్ గా కనిపించే పాత్రలపైనే దృష్టి పెట్టింది. రొమాన్స్ పాళ్లు ఎక్కువగా ఉండే హారర్ .. థ్రిల్లర్ సినిమాలను చేసింది. ఈ సినిమాల జయాపజయాల సంగతి అటుంచితే, రష్మీ పోషించిన పాత్రలు ప్రధానమైన ఆకర్షణగా నిలిచాయి. సినిమాల్లో ఆమె గ్లామర్ డోస్ పెంచడంతో ఆమె ఫాలోయింగ్ మరింతగా పెరిగిపోయింది. ఇలా ఒకవైపున తెలుగు సినిమాలు చేస్తూనే, తమిళ .. కన్నడ .. హిందీ ప్రేక్షకుల హృదయాలను సైతం ఆమె టచ్ చేసి రావడం విశేషం. ఒకవైపున వరుసగా టీవీ షోలు చేస్తూనే మరోవైపున వివిధ భాషల్లోని సినిమాల అవకాశాలను కూడా చుట్టబెట్టేస్తూ వస్తుందంటే, రష్మీ ఎంత చురుకైనదో స్పష్టమవుతోంది.
అలా రష్మీ నాలుగు గోడల మధ్య నుంచి తన పరిధిని పెంచుకుంటూ .. హద్దులు చెరిపేసుకుంటూ కథానాయికగా మారిపోయింది. అయినా తనకి ఇంతటి క్రేజ్ ను తెచ్చిపెట్టిన బుల్లితెరను ఆమె వదిలిపెట్టకపోవడం విశేషం. రష్మీ యాంకర్ గా వ్యవహరించే షోలు కొన్నేళ్లుగా నాన్ స్టాప్ గా కొనసాగుతుండటానికి కారణం ఆమె గ్లామర్ అని చెప్పకతప్పదు. బుల్లితెరపై గ్లామర్ పరంగా శ్రీముఖి .. అనసూయ వంటి యాంకర్స్ నుంచి పోటీని ఎదుర్కుంటూ, వెండితెరపైకి కొత్తగా దూసుకొస్తున్న చిన్న సినిమాల కథానాయికల నుంచి కూడా గట్టి పోటీని తట్టుకుంటూ రష్మీ దూసుకువెళుతోంది. రష్మీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఆమె కుర్రకారును ఊహల ప్రపంచంలో విహరింపజేసే తీపిమాత్ర! .. తెరపై అందంగా కనిపిస్తూ ఊరించే తేనెపాత్ర!!
— పెద్దింటి గోపీకృష్ణ