మాట మకరందం .. పాట సుకుమారం .. మనిషి బంగారం అనే పోలిక సింగర్ సునీతకు కరెక్టుగా సరిపోతుంది. ఒక్క మాటలో చెప్పుకోవాలనుకుంటే ఆమె ఓ అందాల కోయిలమ్మ. సునీత రూపం మాదిరిగానే ఆమె స్వరం కూడా సుకుమారమే. కాస్త కఠినమైన పదాలు తాకితే కంఠం కందిపోతుందేమోననే సున్నితత్వం ఆమె తత్వం. ఆమె నోటివెంట కూడా పదాలు పట్టుకుచ్చులా జారుతూ ఉంటాయి. అక్షరాలు నొచ్చుకుంటాయేమోనన్నట్టుగా ఆమె మాట్లాడతారు. అందువల్లనే ఆమె తన స్వరానికి .. స్వభావానికి తగిన పాటలనే పాడుతూ వెళ్లారు. ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటూ వచ్చారు.
చాలాకాలం క్రితమే సునీతకు వివాహమైంది. ఒక బాబు .. పాప పుట్టాక, ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో విడిపోయారు. అప్పటి నుంచి ఇద్దరి పిల్లల ఆలనా పాలన ఆమెనే చూస్తూ వచ్చారు. వైవాహిక జీవితం విఫలమైనా, సున్నితమైన హృదయంపై పెద్ద గాయమే అయినా ఆమె పట్టుదలతో ముందుకు నడిచారు. ఒక వైపున పాటలు పాడుతూ .. మరో వైపున హోస్ట్ గా వ్యవహరిస్తూ .. ఇంకో వైపున డబ్బింగ్ చెబుతూ తన పిల్లలకు అండగా నిలిచారు. తను ఏ పని చేసినా తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ చేయడం ఆమె గొప్పతనం.
సునీత ఇద్దరు పిల్లలు పెద్ద వాళ్లు అయ్యారు. తమ తల్లికి ఒక తోడు కావాలని వాళ్లు వత్తిడి చేస్తూ రావడంతో ఆమె వివాహానికి అంగీకరించారు. మీడియాతో మంచి సంబంధాలు కలిగిన ‘రామ్ వీరపనేని‘తో ఈ నెల 9వ తేదీన ఆమె వివాహం జరిగింది. ఈ వేడుకలో సునీత స్నేహితులైన సుమ .. ఝాన్సీ .. అనిత చౌదరి సందడి చేశారు. మొదటి నుంచి కూడా వీళ్లంతా మంచి స్నేహితులు. ఎవరి ప్రత్యేకతను వారు చాటుకుంటూ కలిసి తమ కెరియర్ ను పరుగులుతీయిస్తూ వచ్చినవారే. అందుకే వాళ్లంతా కలిసి కొత్త జీవితాన్ని ఆరంభించబోతున్న సునీతకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా సుమ చాలా ఖరీదైన ‘వజ్రాల నెక్లెస్’ ను సునీతకు కానుకగా ఇవ్వడం విశేషం.
Must Read ;- ఘనంగా సింగర్ సునీత పెళ్లి.. వీడియో రిలీజ్ చేసిన రేణుదేశాయ్











