ఆంధ్రప్రదేశ్‌కి పరిశ్రమలు వరుస కడుతున్నాయి. రాష్ట్రంలో మరో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. తిరుపతి జిల్లా శ్రీ సిటీలో.. జపాన్‌కి చెందిన ప్రొటీరియల్ మెట్ గ్లాస్ సంస్థ ఎలక్ట్రికల్ స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ముందుకొచ్చింది. ఈ పరిశ్రమ కోసం ప్రొటీరియల్ కంపెనీ 800 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయనుంది. రెండో దశలో పెట్టుబడులను 1500 కోట్ల స్థాయికి తీసుకెళ్తారు. ఈ ప్లాంట్‌లో మెట్‌గ్లాస్ అని పిలిచే అడ్వాన్స్‌డ్ ఎమార్ఫస్ మెటల్ ఎలక్ట్రికల్ స్టీల్‌ను ఉత్పత్తి చేస్తారు. ట్రాన్స్‌ఫార్మలలో సాధారణ స్టీల్ ఉపయోగించడం వల్ల విద్యుత్ నష్టం భరీగా ఉంటుంది. ఎలక్ట్రికల్ స్టీల్ వినియోగంతో విద్యుత్ వాహక నష్టం 20 నుంచి 30 శాతం వరకు తగ్గుతుంది. తొలి దశలో ఏడాదికి 30 వేల టన్నుల ఎలక్ట్రికల్ స్టీల్‌ను ఉత్పత్తి చేసే సామర్ధ్యంతో కర్మాగారాన్ని నిర్మిస్తారు.
విద్యుత్ వాహనాలు, ట్రాన్స్‌ఫార్మర్లలో ఎలక్ట్రికల్ స్టీల్‌ని ఎక్కువగా వినియోగిస్తారు. ప్రస్తుతం మన దేశం ప్రతి సంవత్సరం 22 నుంచి 26 వేల మెట్రిక్ టన్నుల ఎలక్ట్రికల్ స్టీల్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకొంటోంది. శ్రీ సిటీలో ప్రోటీరియల్ సంస్థ ఏర్పాటు చేస్తున్న ఉక్కు కర్మాగారంలో 30 వేల టన్నులు ఉత్పత్తి చేయనున్నారు. అంటే ఈ విభాగంలో దిగుమతులు గణనీయంగా తగ్గుతాయి. దేశీయ పారిశ్రామిక అవసరాలన్నీ శ్రీసిటీ ప్లాంట్ తీర్చనుంది.
భవిష్యత్తులో ఉత్పత్తి సామర్ధ్యాన్ని రెట్టింపు చేయాలని ప్రోటీరియల్ సంస్థ భావిస్తోంది. శ్రీసిటీలో నిర్మించే ప్లాంట్ ద్వారా సుమారు 500 మంది స్థానికులకు ఉద్యోగాలు లభిస్తాయి. ఈ స్టీల్ ప్లాంట్‌లో ఉత్పత్తి కోసం బొగ్గుని వినియోగించరు. ఎలక్ట్రిక్ ఫర్నేస్ ద్వారా స్టీల్ ప్రొడక్షన్ చేస్తారు. స్థానికంగా ఇనుప ఖనిజం కూడా అందుబాటులో ఉండటంతో.. విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే సరుకు కంటే.. స్థానికంగా తయారు చేసిన ఎలక్ట్రికల్ స్టీల్ తక్కువ ధరకే లభిస్తుంది.











