ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాగజైన్..ఫార్చ్యూన్ ఇండియా తన ఆగస్టు 2026 ప్రత్యేక సంచిక కవర్‌పేజీపై ఏపీ మంత్రి, యువ నాయకుడు నారా లోకేష్‌కు స్థానం కల్పించింది. రాష్ట్ర రాజకీయాల్లో, పాలనలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్న ఆయనను జాతీయ స్థాయిలో గుర్తిస్తూ కవర్ పేజీపై ప్రచురించడం పట్ల ప్రస్తుతం రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఓ తెలుగు యువ నాయకుడు ఇలా అంతర్జాతీయ బిజినెస్ మ్యాగజైన్ ముఖచిత్రంపై మెరవడం లోకేష్ ఎదుగుదలకు నిదర్శనం.
ఫార్చ్యూన్ మ్యాగజైన్ కేవలం కవర్ పేజీకే పరిమితం కాకుండా, లోకేష్ పనితీరును విశ్లేషిస్తూ ప్రత్యేక కథనాన్ని కూడా అందించింది. దానికి ఆంధ్రస్ రైజింగ్ స్టార్: హౌ నారా లోకేష్ ఈజ్ పవరింగ్ ద స్టేట్స్ నెక్స్ట్ చాప్టర్ అనే ఆకర్షణీయమైన శీర్షికను పెట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దడంలో, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించడంలో ఆయన పోషిస్తున్న క్రియాశీలక పాత్రను ఈ కథనంలో ప్రధానంగా ప్రస్తావించింది. అలుపెరగని పోరాటం, యువతతో మమేకమయ్యే విధానం, పాలనలో వేగం ఆయన్ను భవిష్యత్ లీడర్‌గా మలిచాయని ప్రశంసించింది.
వ్యాపార, రాజకీయ, సామాజిక రంగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్న యువతకు ఇచ్చే ప్రతిష్టాత్మక 40 అండర్ 40 జాబితాలో లోకేష్‌కు ఫార్చ్యూన్ స్థానం కల్పించడమే కాకుండా, ఆయనను ఏపీకి కాబోయే కీలక నాయకుడిగా అభివర్ణించింది. పాలనలో ఆధునికతను తీసుకురావడం, టెక్నాలజీని ఉపయోగించి పారదర్శకతను పెంచడం వంటి అంశాలు ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టాయని విశ్లేషించింది. అలాగే, రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు ఆకర్షించడం, ఐటీ రంగ అభివృద్ధి, యువతకు నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు సృష్టించడానికి లోకేష్ చేస్తున్న కృషిని ఈ కథనం కొనియాడింది.
గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రాన్ని గ్లోబల్ మ్యాప్‌లో ఉంచేందుకు లోకేష్ వేస్తున్న బలమైన పునాదులే రాష్ట్ర ప్రగతిలో సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నాయని ఫార్చ్యూన్ పేర్కొంది. నారా లోకేష్ కేవలం రాజకీయ వారసుడిగా కాకుండా, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును, సుదీర్ఘ విజన్‌ను ఏర్పరచుకున్నారని ఈ కథనం స్పష్టం చేసింది. ఈ అంతర్జాతీయ గుర్తింపుతో నారా లోకేష్ నాయకత్వంపై, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ప్రగతిపై దేశవ్యాప్తంగా మరింత సానుకూల దృక్పథం ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.











