టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశారు. కరోనా కారణంగా షూటింగులకు బ్రేక్ ఇచ్చిన మహేష్ తన తదుపరి చిత్రాన్ని ‘గీతా గోవిందం’ సినిమా ఫేమ్ పరుశురాం దర్శకత్వంలో నటిస్తున్నారు. ‘సర్కార్ వారి పాట’ పేరిట తెరకెక్కుతున్న ఈ సినిమా పూజ కార్యక్రమాలు ఇప్పటికే జరుపుకుంది. సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు మే 31న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఫస్ట్ లుక్ లో మహేష్ బాబు స్టైలిష్ గా దర్శనమివ్వడంతో అభిమానుల సంతోషానికి హద్దే లేకుండా పోయింది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ని యూఎస్ లో ప్లాన్ చేశారు. కరోనా ఉదృతితో ఈ సినిమా షెడ్యులును నవంబర్ కి వాయిదా వేశారు. ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ నటిస్తున్నారని వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.
‘మిస్టర్ ఇండియా’ అనిల్ కపూర్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారని ఫిలిం వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇప్పటికే పరుశురాం ముంబైలో అనిల్ కపూర్ కు స్టోరీ చెప్పారని తెలుస్తోంది. కథ నచ్చడంతో అనిల్ కపూర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. బ్యాంక్ మోసాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, లలిత్ మోడీల కథ ఆధారంగా పరుశురాం ఈ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. హీరో తల్లి బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తుందనీ, ఆమె పనిచేసే బ్యాంకులో భారీ మోసం జరుగుతుందనీ, మోసం చేసిన వ్యక్తి విదేశాలకు పారిపోతే హీరో అతనిని పట్టుకుని, చివరికి తన తల్లిని నిర్దోషిగా ఎలా బయటకు తెస్తాడన్న పాయింటుతో ఈ చిత్రం నడుస్తుందట. క్యాస్టింగ్ వివరాలను త్వరలోనే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనుంది. థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాని 14 రీల్స్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.