ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారుకు ఏపీ హైకోర్టులో మరో మొట్టికాయ పడింది. ఇప్పటికే దాదాపుగా అన్ని విషయాల్లో దెబ్బలు తింటున్న జగన్ సర్కారు.. ఈ సారి తనదైన శైలి మాయాజాలంతో అడ్డంగా బుక్కైపోయింది. రాజధాని అమరావతికి వేలాది ఎకరాలు ఇచ్చిన రైతులకు ఏటా జమ చేస్తున్న కౌలు నిధుల విషయంలో జగన్ సర్కారు మాయ చేసింది. కౌలు నిధుల కింద మూడు రోజుల క్రితం రూ.195 కోట్లను విడుదల చేస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేసిన జగన్ సర్కారు… ఆ నిధులను ఇప్పటికీ రైతుల ఖాతాల్లో జమ చేయలేదట. అయితే తమ కౌలు నిధుల జమలో జరుగుతున్న జాప్యంపై రాజధాని రైతులు ఇదివరకే హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది.
హైకోర్టులో అడ్డంగా బుక్కై…
ఈ సందర్భంగా రాజధాని రైతులకు కౌలు నిధులు విడుదల చేశామని జగన్ సర్కారు తరఫు న్యాయవాది చెప్పగా… అక్కడే ఉన్న రాజధాని రైతుల తరఫు న్యాయవాది ఇంద్రనీల్ బాబు రైతుల ఖాతాల్లో ఇప్పటిదాకా ఆ నిధులే జమ కాలేదని చెప్పారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు… ఇదేమిటని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని నిలదీసింది. నిధులను కేటాయిస్తూ జీవో జారీ చేశామని త్వరలోనే నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. దీనికి ఎన్ని రోజుల సమయం పడుతుందని కోర్టు ప్రశ్నించగా… నాలుగు వారాల సమయం పడుతుందని ఆయన సమాధానమిచ్చారు.
మూడు వారాల్లో జమ చేయాల్సిందే
నిధులు కేటాయిస్తూ జీవో జారీ చేసిన తర్వాత రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయడానికి నాలుగు వారాల సమయం ఏమిటని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయగా… నీళ్లు నమిలిని ప్రభుత్వ న్యాయవాది… ఆ మాత్రం సమయం పడుతుందని బదులిచ్చారట. ఈ సమాధానంతో సంతృప్తి చెందని ధర్మాసనం మూడు వారాల్లోగా రాజధాని రైతుల ఖాతాల్లో కౌలు డబ్బులు జమ చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. స్వయంగా కోర్టు ఆదేశాలు జారీ చేయడం… విచారణ సందర్భంగా జగన్ సర్కారు మాయాజాలం బయటపడటంతో ప్రభుత్వ న్యాయవాది సరేనని తలూపారట. మొత్తంగా తనకు ఇష్టం లేని వర్గాలకు ఇచ్చే నిధుల విషయంలో జగన్ సర్కారు ఏ తరహా మస్కా కొడుతుందన్న అంశం హైకోర్టు సాక్షిగా బయటపడింది.
Must Read ;- గ్రూప్ వన్ ఇంటర్వ్యూలపై హైకోర్టు స్టే..