‘అష్టాచెమ్మా’ సినిమాతో టాలీవుడ్ లో నటుడిగా రంగ ప్రవేశం చేశాడు శ్రీనివాస్ అవసరాల. అందులోని అతడి పాత్ర అందరినీ భలేగా ఎంటర్ టైనర్ చేసింది. శ్రీని టాలెంట్ ఎలాంటిదో మొదటి సినిమాతోనే అర్ధమయింది ప్రేక్షకులకి. ఆ ఒక్క సినిమా తెచ్చిపెట్టిన క్రేజ్ తో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు సాగాడు. అయితే ఓ పక్క సినిమాల్లో నటిస్తుండగానే.. అవసరాల ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో దర్శకుడిగా కొత్త అవతారమెత్తాడు.
అతడిలో సహజంగానే ఉండే సెన్సాఫ్ హ్యూమర్ ఆ సినిమా మొత్తంగా కనిపించింది. దర్శకుడిగా మొదటి ప్రయత్నం కూడా సూపర్ సక్సెస్ అయింది. ఈ సినిమా విజయంతో నాగశౌర్య, రాశిఖన్నాలు కూడా టాలీవుడ్ లో స్థిరపడ్డారు. ఆ తర్వాత ‘జ్యో అచ్యుతానంద’ అనే మరో మూవీతో రెండోసారి దర్శకుడిగా ప్రేక్షకుల్ని అలరించాడు శ్రీనివాస్ అవసరాల. నాగశౌర్య, నారా రోహిత్ హీరోలు. ఈ రెండు సినిమాలతో వరుసగా విజయం సాధించి దర్శకుడిగా కూడా పేరు తెచ్చుకున్నాడు.
ఓ పక్క ముఖ్యపాత్రల్లోనూ, హీరోగానూ నటిస్తునే .. మరో పక్క దర్శకుడిగానూ ట్రావెల్ అవుతున్నాడు శ్రీనావాస్ . ప్రస్తుతం శ్రీని ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ అనే సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో కూడా నాగశౌర్యనే హీరో. అతడి సరసన ‘కళ్యాణ వైభోగమే’ సినిమాలో నటించిన మాళవికా నాయర్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా లాక్ డౌన్ కు ముందు ఫ్రెష్ షెడ్యూల్ మొదలు పెట్టింది. త్వరలోనే సినిమా తిరిగి చిత్రీకరణకు వెళ్ళబోతోంది. ఇధి కూడా ఒక సున్నితమైన కథాంశంతో తెరకెక్కుతోంది.
ఇదిలా ఉంటే.. శ్రీనివాస్ అవసరాల ప్రస్తుతం రెండు సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘నాయనా రారా ఇంటికి’ అనే వెరైటీ టైటిల్ తో ఒక సినిమా అనౌన్స్ అయింది. యన్.ఆర్.ఐ అనే అబ్రివేషన్ మెయిన్ టైటిల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీనివాస్ యన్.ఆర్.ఐ గా కనిపించబోతున్నాడు. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈసినిమాకి దర్శకుడు బాలా రాజశేఖరుని. మంచు లక్ష్మి ప్రధాన పాత్ర పోషిస్తోన్న ఈ సినిమాలో నాగబాబు ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. సినిమా అనౌన్స్ మెంట్ టైమ్ లో విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది.
ఇటీవల శ్రీనివాస్ అవసరాల హీరోగా ‘నూటొక్క జిల్లాల అందగాడు’ అనే మరో సినిమా అనౌన్స్ అయింది. ‘చలిచీమలు’ సినిమాలోని నూతన్ ప్రసాద్ ఫేమస్ డైలాగ్ ను టైటిల్ గా చేసుకున్నఈ సినిమా కి దర్శకుడు సాగర్ రాచకొండ. దిల్ రాజు, క్రిష్, రాజీవ్ రెడ్డి నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమాకి శ్రీనివాస్ అవసరాల కథా సహకారం కూడా అందించారు. కోవిడ్ 19 నిబంధనల్ని స్ట్రిక్ట్ గా ఫాలో అవుతూ.. నూటొక్క జిల్లాల అందగాడు సినిమా సెట్స్ మీదకు వెళ్లింది. ఇలా దర్శకుడిగానూ, హీరోగానూ రెండు పడవల ప్రయాణం చేస్తోన్న శ్రీనివాస్ ఈ సినిమాలతో ఏ స్థాయి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.