టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ ఎడిటర్ గౌతంరాజు మృతి చెందారు.గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న గౌతంరాజు ఆరోగ్యం విషమించడంతో గత అర్ధరాత్రి కన్నుమూశారు.అనారోగ్యంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన ఇటీవలే డిశ్చార్జ్ అయ్యారు.నిన్న రాత్రి ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఆయన మరణించారు.15 జనవరి 1954లో మద్రాసులో గౌతంరాజు జన్మించగా, 68 ఏళ్ళ వయస్సులో గౌతంరాజు తుదిశాస విడిచారు. కాగా, గౌతంరాజు మరణ వార్తతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
గౌతంరాజు తెలుగు తోపాటు హిందీ సినిమాలకు ఎడిటర్‌గా పనిచేశారు.ఆయన అందించిన ఎడిటింగ్ ఎన్నో చిత్రాలకు విజయాలను అందించాయి. ముఖ్యంగా అగ్ర హీరోల చిత్రాలకు గౌతంరాజే ఎడిటింగ్ అందించేవారు. చిరంజీవి, మాధవి హీరోహీరోయిన్లుగా నటించిన ‘చట్టానికి కళ్ళు లేవు’ చిత్రంతో ఎడిటర్‌గా సినీ ప్రస్థానం ప్రారంభించిన ఆయన తన కెరీర్ లో దాదాపు 800 పై చిలుకు చిత్రాలకు ఎడిటింగ్ అందించారు.
వాస్తవానికి గౌతంరాజు ఎడిటర్ గా పని చేస్తున్నారు అంటే దర్శకులకు ఓ భరోసా ఉండేది.ఎడిటర్ గా గౌతంరాజు అనేక అవార్డులు పొందారు. ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘ఆది’ చిత్రానికి గాను 2002లో గౌతంరాజు ఎడిటర్ గా నంది అవార్డు అందుకున్నారు. నాలుగు దశాబ్దాల కెరియర్ లో గౌతంరాజు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాలకూ ఎడిటర్‌గా చేశారు. ఇటీవల కాలంలో తెలుగులో ఠాగూర్, పొలిటికల్ రౌడీ, అశోక్, ఏక్ నిరంజన్, ఖైదీ నంబర్ 150, గబ్బర్ సింగ్, కాటమరాయుడు, కిక్, రేసుగుర్రం, గోపాల గోపాల, అదుర్స్, బలుపు, రచ్చ, ఊసరవెల్లి, మిరపకాయ్ వంటి హిట్ సినిమాలకు ఎడిటింగ్ బాధ్యలు నిర్వర్తించారు.
గౌతమ్ రాజు మృతితో సినీ తారలందరూ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నారు. గౌతమ్ రాజు తెలుగు సినిమాకి చేసిన సేవలు ఎప్పటికి గుర్తుంటాయని కొనియాడుతున్నారు.











