వైసీపీకి మరో బిగ్‌షాక్ తగలబోతుందా..మరో మాజీ మంత్రి చిక్కుల్లో పడబోతున్నారా! అంటే అవుననే సమాధానమే వస్తోంది. నెల్లూరు జిల్లాలో వైసీపీ హయాంలో కీలకంగా వ్యవహరించిన కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్న టైంలో కాకాణి అడ్డూ అదుపు లేకుండా రెచ్చిపోయారు. ఎప్పటికీ తమదే అధికారం అన్న ధీమాతో రెండు చేతులా దోపిడీకి పాల్పడ్డారు. ఐతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ సర్కార్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై చర్యలు మొదలుపెట్టింది. దీంతో వైసీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఆయన అనుచరులు ఇప్పుడు ఫోర్జరీ స్కామ్‌లో ఇరుక్కున్నారు.
జగన్ ఐదేళ్ల పాలనలో గ్రావెల్ మాఫియా రెచ్చిపోయింది. సర్వేపల్లి రిజర్వాయర్‌తో సహా చెరువుల్లో పెద్ద ఎత్తున గ్రావెల్ అక్రమ తవ్వకాలు చేపట్టి వందల కోట్ల రూపాయలు స్వాహా చేశారు. అలాగే ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సంతకం ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మాగుంట పేరుతోనూ అక్రమ అనుమతులు తీసుకోవడంతో అప్పట్లోనే కాకాణి అనుచరులపై కేసులు నమోదయ్యాయి. మాగుంట సంతకాల ఫోర్జరీ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం సీరియస్‌గా ఉంది.ఇప్పటికే 10 మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పర్యవేక్షణాధికారిగా బాపట్ల ఎస్పీ, పరిశోధనాధికారిగా బాపట్ల డీఎస్పీ రెండు రోజులుగా ముమ్మర విచారణ జరుపుతున్నారు. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గ్రావెల్ తవ్వకాలపై పెద్ద ఎత్తున పోరాటం చేశారు. దీంతో కాకాణి టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టించారనే ఆరోపణలు ఉన్నాయి.
పెద్ద ఎత్తున భూకబ్జాలు!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత జగన్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై ఫోకస్ పెట్టింది. బాధితులు కూడా పెద్దఎత్తున ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి భారీ భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కాకాణి అక్రమ భాగోతాలు బయటకు వస్తున్నాయి. దాదాపు రూ.230 కోట్ల విలువ చేసే పేదల భూములను తన అల్లుడు కంపెనీకి దోచిపెట్టినట్లు కాకాణిపై ఆరోపణలు వచ్చాయి. రామదాసుకండ్రిగ ప్రాంతంలో పోర్టు రోడ్డుకు ఆనుకుని ఉన్న భూములను కాకాణి కాజేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
అల్లుడి కంపెనీకి భూములు
రైతులను బెదిరించి, భయపెట్టి ఎకరా భూమి రూ.15 లక్షల 62 వేల 142 రూపాయలు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల నోటిఫికేషన్‌కు ఒక్కరోజు ముందు కాకణి అల్లుడి డొల్ల కంపెనీకి జగన్ ప్రభుత్వం భూములను అప్పగించింది. 2024 మార్చి నెల 16న ఎన్నికల నోటిఫికేషన్‌ను EC ఇచ్చిన విషయం తెలిసిందే. మార్చి నెల 15న భూములు అప్పగిస్తూ ప్రొవిజనల్ అలాట్మెంట్ను APIIC ఆర్డర్ మంజూరు చేసింది. భూముల అప్పగింతకు కాకాణి, వైసీపీ పెద్దలు, ఏపీఐఐసీ ఉన్నతాధికారులు చక్రం తిప్పారు. భూముల కోసం జీకేఎస్ ఇండస్ట్రీయల్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ప్రైవేటు లిమిటెడ్ పేరిట డొల్ల కంపెనీ ఏర్పాటు చేసింది. ఆ డొల్ల కంపెనీలో రాత్రికి రాత్రే కాకాణి అల్లుడు మన్నెం గోపాలకృష్ణారెడ్డికి సీఈఓ పదవి అప్పగించారు. కాకాణి భూ కుంభకోణాలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ విషయంపై విచారణ జరిపించి, న్యాయం చేయాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
గత జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులంతా ఏదో ఓ స్కామ్‌లో ఇరుక్కుంటున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములను కబ్జా చేశారని ఫిర్యాదులు రాగా, విచారణ జరుగుతోంది. ఇక లిక్కర్ స్కామ్‌లో పెద్దిరెడ్డి తనయుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి సైతం పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. PDS బియ్యం పక్క దారి పట్టించిన కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధ ఇరుక్కున్నారు. మాజీ మంత్రి విడుదల రజినీ సైతం అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని ఫిర్యాదులు అందాయి. దీంతో కేసు నమోదుకు రంగం సిద్ధమైంది. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలోనూ అవినీతి జరిగిందని, ఇందులో మాజీ మంత్రి రోజాకు పాత్ర ఉందని కేసు నమోదైంది.