ఒక సినిమా విడుదలకు 40 ఏళ్లా? పైగా అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ, తులసి జంటగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. కర్ణుడి చావుకు కారణాల లాగానే ఈ సినిమా విషయంలోనూ అన్ని కారణాలు ఉన్నాయి. ఎట్టకేలకు ఈ సినిమాకు మోక్షం లభించింది. దీన్ని డిజిటల్ వెర్షన్ లోకి మార్చి ఈ నెల 5వ తేదీన విడుదల చేస్తున్నారు. రాజేశ్వర్ రాచర్ల సమర్పణలో విష్ణు ప్రియ సినీ కంబైన్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాకు ముగ్గురు దర్శకులు పనిచేయడం విశేషం. మొదట కట్టా సుబ్బారావు దర్శకత్వంలో ప్రారంభం కాగా ఆయన హఠాత్తుగా గుండెపోటుతో మరణించడంతో ఆ బాధ్యతలను సింగీతం శ్రీనివాసరావు చేపట్టారు. ఆ తర్వాత అది కె.ఎస్. ప్రకాశరావు చేతుల్లోకి మారింది.
నిర్మాత జాగర్ల మూడి రాధాకృష్ణ మూర్తి ఈ చిత్రాన్ని మొదటిసారిగా 250 థియేటర్స్ లలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో జాగర్ల మూడి రాధాకృష్ణ మూర్తి మాట్లాడుతూ ఇంతకు ముందు తాను తీసిన సినిమాలన్నీ విజయం సాధించాయని, ఆ సినిమాలను చూసి అక్కినేని తనను పిలిచి సినిమా చెయ్యమని కాల్ షీట్స్ ఇచ్చారన్నారు.1982 లో ఈ సినిమా స్టార్ట్ చేసి ఏకధాటిగా షూట్ చేశాము. ఇందులో ద్విపాత్రాభినం చేశారన్నారు. ‘ఈ సినిమా షూటింగ్ కొంత ఉందనగా అక్కినేని హార్ట్ స్ట్రోక్ రావడంతో చికిత్స కోసం అమెరికా వెళ్ళారు.
రెండేళ్ల తర్వాత షూటింగ్ పెట్టుకోమన్నారు. అంతా సిద్ధమయ్యాక ప్రెగ్నెంట్ తో ఉన్న జయసుధ తాను డెలివరీ అయ్యే వరకు షూటింగ్ చెయ్యనన్నారు. ఇలా అనేక కారణాలతో సినిమా విడుదల ఆలస్యమైంది. ఈ సినిమా రిలీజ్ కోసం గత 40 సంవత్సరాల నుండి పడుతున్న ఆరాటం అంతా ఇంతా కాదు. చివరకు నా సినిమా రిలీజ్ చేయకుండా చనిపోతానేమో అనుకున్న టైమ్ లో రాచర్ల రాజేశ్వర్ రావు రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చారు. ఈ సినిమా ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుంది అన్నారు.
ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమా రిలీజ్ కాకుండా మిగిలిపోయిన చిత్రం ఈ రోజు రిలీజ్ అవ్వడం గొప్ప విషయం.ఒక ప్రేమ్ నగర్, ప్రేమాభిషేకం, భక్తతుకారం, ఇలా సుమారు 250 సినిమాలలో నటించిన గొప్ప వ్యక్తి ఏఎన్నార్. ప్రపంచంలో గొప్ప నటుల్లో అక్కినేని నాగేశ్వరావు, నందమూరి తారక రామారావు గార్లు, ఇద్దరు తెలుగు నటులు ప్రపంచ ప్రఖ్యాత గాంచి అందరి హృదయాల్లో నిలిచిపోయిన వీరిద్దరూ మన తెలుగు వారు కావడం మన అదృష్టం. ఈ నెల 5 న విడుదలవుతున్న ఈ సినిమాను తను పెట్టిన అమౌంట్ కంటే ఎక్కువ అమౌంట్ రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.