ఓటీటీ దిగ్గజాలతో బాలీవుడ్ నటి అనుష్కాశర్మ ఓ భారీ డీల్ కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ రూ. 400 కోట్లు అనుకోవచ్చు. అనుష్కా శర్మకు క్లీన్ స్లేట్ ఫిలింస్ పేరుతో ఓ నిర్మాణ సంస్థ ఉన్న సంగతి తెలిసిందే. ఆమె సోదరుడు కర్నేష్ శర్మ ఈ సంస్థ వ్యవహారాలను చూస్తుంటాడు. ఇప్పుడు ఈ సంస్థ ఓటీటీ దిగ్గజాలైన నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ తో పరస్పరం ప్రయోజనాలు ఉండేలా భారీ ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం.
ఇంతకుముందు నెట్ ఫ్లిక్స్ కు బుల్ బుల్, అమెజాన్ కు పాతాళ్ లోక్ లాంటి ప్రోగ్రామ్స్ ను ఈ సంస్థ చేపట్టింది. ఈ బంధం ఇలాగే కొనసాగాలి కాబట్టి కొత్త ఒప్పందం కూడా కుదిరింది. ఈ రెండు ఓటీటీ సంస్థలకు రాబోయే 18 నెలల్లో 8 షోలు చేయడానికి సంతకాలు చేసినట్టు సమాచారం. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ కు మూడు ప్రోగ్రామ్స్ కు క్లీన్ స్లేట్ రూపొందించింది. త్వరలోనే ఇవి విడుదలకు సిద్దంగా ఉన్నాయి.
సాక్షి తన్వర్ తో ‘మాయి’, బిబిల్ ఖాన్ ‘ఖాలా’ సినిమా, క్రైమ్ డ్రామా జులన్ గోస్వామి బయోపిక్ ‘చక్డా ఎక్స్ ప్రెస్’ స్ట్రిమింగ్ కు సిద్ధంగా ఉన్నాయి. మరి ఇవి పైన పేర్కొన్న రూ. 400 కోట్లలో ఉన్నాయా? ఇవి కాకుండా వేరే ఉన్నాయా అన్నది మాత్రం తెలియదు. నెట్ ఫ్లిక్స్ నుంచి లీకులు వస్తున్నాయి గానీ అమెజాన్ ప్రైమ్ నుంచి మాత్రం అలాంటి లీకులేవీ రావడం లేదు. ఆ సీక్రెట్ ను ప్రైమ్ వీడియోస్ మెయింటెయిన్ చేస్తోంది. త్వరలోనే అధికారిక సమాచారం రావచ్చు.