అమెజాన్ ప్రైమ్ లో ఆకట్టుకుంటోన్న మలయాళ థ్రిల్లర్ ‘అన్వేషణం’. ఒకే ఒక సంఘటన. అది పలువురికి సందేహాస్పదమవుతుంది. పోలీసుల్ని, డాక్టర్లని కంగారు పెట్టేస్తుంది. అసలు ఆ సంఘటన వెనుక దాగిన అసలు నిజమేంటి? అన్నదే సినిమా. పక్కా క్రైమ్ థ్రిల్లర్ లక్షణాలున్న ఈ సినిమా ఒక కుటుంబ కథ చిత్రం అవడమే దీని ప్రత్యేకత.
కథేంటి?: ఒక సాయంత్రం వేళ స్పృహ తప్పిన ఒక చిన్న కుర్రోణ్ని హాస్పిటల్ లో జాయిన్ చేస్తుంది అతడి తల్లి కవిత. ఆమె వెంట భర్త అరవింద్ స్నేహితులుంటారు. ఆ కుర్రోడు మేడమెట్ల మీద నుంచి పడిపోతే తలకు దెబ్బతగిలింది అని చెబుతారు. అయితే అతడి ఒంటిమీద దెబ్బలుండడాన్ని గుర్తించి అనుమానంతో పోలీసులకు కాల్ చేస్తుంది ఒక నర్స్. పోలీసులు రంగంలోకి దిగుతారు. ఆ కుర్రాడి తల్లితో సహా అందరూ జరిగిన దాన్ని ఎవరి వెర్షన్ ను వారు వినిపిస్తారు. కానీ అవి ఒకదానితో ఒకటి మ్యాచ్ అవ్వవు. పోలీసుల్లో అనుమానం మరింత బలపడుతుంది. ఆ అబ్బాయిని ఆమె కుటుంబ సభ్యులు ఏమైనా టార్చర్ పెట్టారేమో అనే కోణంలో పోలీసులు నిజాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేస్తారు.
ఆ క్రమంలో అబ్బాయి తండ్రి అరవింద్ ను పిలిపించి పోలీసులు ప్రశ్నిస్తారు. వాడు అంటే మా అందరికీ చాలా ఇష్టమని , మేమెందుకు హింసిస్తామని పోలీసులతో వాదిస్తాడు అరవింద్. నిజంగా ఆ కుర్రోడు మేడమీద నుంచి పడిపోతే .. తలకు మాత్రమే దెబ్బ కనిపించాలి. ఒంటిమీద ఎవరో హింసించినట్టు దెబ్బలు తగలడం అసంభవం అని డాకర్లు , పోలీసులు కూడా బలంగా వాదిస్తారు. ఇంతలో ఆ అబ్బాయి చనిపోతాడు. దాని వల్ల ఆ అబ్బాయి తల్లిని అరెస్ట్ చేయడానికి రెడీ అవుతారు. ఇంతకీ ఇందులో మిస్టరీ ఏంటి? ఆ కుర్రోడు ఎలా చనిపోయాడు? అనే ప్రశ్న క్లైమాక్స్ వరకూ అందరినీ వెంటాడుతుంది.
ఎలాతీశారు? : దాదాపు సినిమాలోని మూడొంతుల భాగాన్ని హాస్పిటల్ లోనే చిత్రీకరించాడు దర్శకుడు. అయినా ఎక్కడా బోర్ అనిపించదు. సినిమా ప్రారంభం నుంచీ అందరిలోనూ ఆసక్తిని, టెన్షన్ ను బిల్డ్ చేయడంలో కృతకృత్యుడయ్యాడు దర్శకుడు. అసలు ఆ కుర్రోడికి దెబ్బ ఎలా తగిలిందో అతడి తల్లి కూడా చూడలేదు కాబట్టి.. ఆమె శత్రువులెవరైనాఈ పని చేసుంటారా అనే ఆలోచనలు కలుగుతాయి. అలాగే.. ఆ అబ్బాయి తండ్రే కావాలని అలా చేశాడేమో అనిపిస్తుంది. అంతకు ముందు ఆ అబ్బాయి .. క్రికెట్ లో తన స్నేహితులతో గొడవ పడతాడు.
వాళ్ళేమైనా చేసుకుంటారా అని డౌట్ రైజ్ అవుతుంది. ఇలా పోలీసులు, డాక్టర్లు జుట్టు పీక్కుంటున్నట్టుగానే .. ప్రేక్షకులూ బుర్ర బద్దలు కొట్టుకుంటారు. అలా .. ఈ సినిమా అందరినీ టెన్షన్ లో పడేస్తుంది. అయితే క్లైమాక్స్ లో ఆ అబ్బాయి దెబ్బ తగలడానికి కారణమేంటో రివీలయ్యాకా.. ప్రేక్షకుడి మనసు ఉసూరుమంటుంది. అరవింద్ గా జయసూర్య , అతడి భార్య కవితగా… శ్రుతి రామచంద్రన్, నర్స్ గా లీనా, డాక్టర్స్ గా లాల్, విజయ్ బాబు నటించారు.
హైలైట్స్ : ఒక ఫ్లాట్ లో సంతోషంగా జీవనం సాగిస్తున్న అరవింద్ ఫ్యామిలీ.. ఆ సంఘటన తర్వాత క్రైమ్ ఫ్యామిలీగా ఎస్టాబ్లిష్ అవుతుంది. పోలీసులు ఎంట్రీ ఇచ్చాకా.. భార్య, భర్తలిద్దరి మీదా ఒకేసారి అందరికీ అనుమానం కలుగుతుంది. ఆ క్రమంలో వచ్చే సన్నివేశాలు సినిమాకి హైలైట్స్ గా నిలుస్తాయి. అయితే క్లైమాక్స్ చూస్తే.. ఒక చిన్నపొరపాటు… ఎంతటి దారుణానికి దారితీస్తుందో చూపించడానికి దర్శకుడు ఈ సినిమా తీశాడాఅనిపిస్తుంది. టోటల్ గా ఈ సినిమా పర్వాలేదనిపించే ఒక ఫ్యామిలీ థ్రిల్లర్.
నటీనటులు : జయసూర్య, శ్రుతి రామచంద్రన్, విజయ్ బాబు, లాల్, లీనా, లియోనా లిషోయ్, నందు, సాయి విష్ణు, సాజు, శ్రీకాంత్ మురళి తదితరులు
నిర్మాణం: ఏ.వి.అనూప్, ప్రేమ్ లాల్, ముఖేష్ మెహతా, సి.వి.సారధి
దర్వకత్వం : ప్రశోభ్ విజయన్
ఒక్కమాటలో : ఆకట్టుకొనే థ్రిల్లర్
ఎక్కడచూడాలి?: అమెజాన్ ప్రైమ్
భాష : మలయాళం
రేటింగ్ : 3 /5
-ఆర్కే