ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెండు రోజుల పాటు జరిగిన కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాలను ఆయన వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సూక్ష్మపోషకాలు అందచేయాలని నిర్ణయించారు. దీంతో పంటల దిగుబడి పెరుగుతుందన్నారు. ఇక ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.రూపాయి 50 పైసలకే ఇద్దామని అధికారులకు సూచించారు. నాన్ జోన్ అని లేకుండా ఎక్కడా ఆక్వా రైతు రిజిస్ట్రేషన్ చేసుకున్నా వారికి రాయితీపై విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించారు. ఇక రిజిస్ట్రేషన్ చేయకపోతే విద్యుత్ ఇవ్వకూడదన్నారు.
దీంతో పాటు విశాఖ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను ఒక హబ్‌గా, రాజమండ్రి – కొవ్వూరు సమీప ప్రాంతాలను గోదావరి హబ్‌గానూ, అమరావతి – విజయవాడ, కర్నూలు, సత్యసాయి, అనంతపురాలు మరో హబ్‌గా, తిరుపతి చుట్టుపక్కల పంచాయతీలు ఆ కార్పొరేషన్‌తో కలిపి మరొకటి..ఇలా మొత్తంగా రాష్ట్రంలో 5 హబ్‌లను అభివృద్ధి చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఇప్పటికే విశాఖ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి నీతి ఆయోగ్ ఒక నివేదిక సిద్ధం చేసిందని ముఖ్యమంత్రి చెప్పారు. రానున్న రోజుల్లో హిందూపూర్, అనంతపురం మధ్య మంచి అభివృద్ధి జరుగుతుందన్నారు. మరో రెండేళ్లలో గోదావరి పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో రాజమహేంద్రవరం, కొవ్వూరుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో అభివృద్ది పనులను ఇప్పటి నుంచే చేపడదామని ముఖ్యమంత్రి అన్నారు. ఈ ఏడాది నవంబరులో సత్యసాయి శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహిద్దామని, అందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పర్యాటక రంగం గేమ్ ఛేంజర్ అన్నారు చంద్రబాబు. ఈ రంగంలో 20శాతం వృద్ధి సాధించాలన్నారు. ప్రతి జిల్లాకు ప్రత్యేకత ఉంది. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా టూరిజం ఈవెంట్లు నిర్వహించాలని సూచించారు. పర్యాటక ప్యాకేజీలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కడియం నర్సరీల్లో అంతర్జాతీయ పుష్ప ప్రదర్శనతో పాటు ఇంకా ఏ ఈవెంట్లు చేసేందుకు అవకాశం ఉందో చూడాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 10 టూరిజం ఈవెంట్లు నిర్వహించాలన్నాలరు. అన్ని వయసుల వారినీ ఇందులో భాగస్వాములను చేయాలన్నారు. గోదావరి జిల్లాలు అభివృద్ధిలో పురోగమించేలా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని, సారవంతమైన భూములున్న కోనసీమ తలసరి ఆదాయం పెంచుకునే విషయంలో ఎందుకు వెనుకబడుతోందో పరిశీలించాలన్నారు.
కర్నూలు జిల్లా అభివృద్ధిపైనా ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఉందన్నారు చంద్రబాబు. ఈ జిల్లాలో ఆర్‌డీఎస్, వేదవతి ప్రాజెక్టులు చేపడతామని చెప్పారు. జిల్లాలో సాగునీటి సమస్యను పరిష్కరించాల్సి ఉందన్నారు. గుండ్రేవుల ప్రాజెక్టు విషయంలో అంతర్ రాష్ట్ర సమస్య ఇమిడి ఉందన్నారు. కర్నూలు పశ్చిమ ప్రాంతంలో నీటి కొరత ఎక్కువగా ఉందని. పశ్చిమ ప్రాంతం బాగా వెనకబడి ఉందని చెప్పారు. ఇక్కడ ఆర్థిక కార్యకలాపాలు పెంచాలన్నారు. కర్నూలు నీటి సమస్యను ఎలా పరిష్కరించాలో చూడటంతోపాటు ఆ జిల్లాకు ఏం చేయగలమో ప్రత్యేకంగా ఆలోచించాలని సూచించారు. పందికోన ప్రాజెక్టుకు రూ.210 కోట్లు అవసరమని, అది పూర్తి చేస్తే 40 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని ఆ జిల్లా కలెక్టర్ చెప్పగా… తక్షణమే ఆ నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు.
రాష్ట్రమంతటా అంతర్జాతీయ స్థాయి బ్యాండ్ విడ్త్ ఉండేలా చూడాలని కోరారు చంద్రబాబు. వర్క్ ఫ్రం హోమ్‌కు ఆరు లక్షల మంది సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మొత్తం 20 లక్షల మంది వర్క్ ఫ్రం హోం చేసేలా లక్ష్యం సాధించాలన్నారు. ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అవసరమైన చోట టవర్లకు అనుమతులు ఇవ్వాలని. ఈ విషయంలో ఎలాంటి సంకోచాలు వద్దని చెప్పారు. గతంలో ఇబ్బందులు ఏర్పడితే ప్రభుత్వ భవనాలపైనే టవర్లు ఏర్పాటు చేసుకునేందుకు వీలు కల్పించామని చెప్పారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్‌ను జిందాల్ సంస్థ ప్రారంభించి పూర్తి చేస్తుందని చెప్పారు చంద్రబాబు. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో అనుకున్న ప్లాన్ ప్రకారమే పనులు జరుగుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పరిశ్రమల శాఖ అధికారులు సమన్వయంతో ఈ ప్లాంటును రికార్డు సమయంలో పూర్తి చేయాలని సూచించారు. గండికోట నిర్వాసితులకు డబ్బులిస్తామన్నారు చంద్రబాబు. గాలేరు నగరి రెండో దశలో కోడూరు వరకు పనులు చేయాలన్నారు. ఇందులో భూసేకరణ సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అటవీశాఖ అధికారులు దీనిపై దృష్టి పెట్టి..పర్యావరణ అనుమతులు తీసుకురావాలని ఆదేశించారు.