దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఇంట నెలకొన్న విభేదాలు ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చేదాకా చెల్లి సాయాన్ని బాగానే స్వీకరించిన జగన్.. అధికారం చేజిక్కగానే ఆమెను మరిచిపోయారు. దీనిని జీర్ణించుకోలేని చెల్లి షర్మిల ఏకంగా తన మెట్టినిల్లు అంటూ తెలంగాణకు చేరి కొత్తగా వైఎస్సార్టీపీ పేరిట రాజకీయ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అన్నాచెల్లిల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయన్న వాదనలు వినిపించాయి. కనీసం తండ్రికి నివాళి అర్పించేందుకు కూడా వారిద్దరూ కలిసి రావడం లేదంటే.. వారి మధ్య విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇట్టే చెప్పేయొచ్చు.
ఇద్దరి బస ఇడుపులపాయలోనే..
తాజాగా గురువారం వైఎస్సార్ 12 వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని తండ్రి సమాధి వద్ద ఇటు జగన్ తో పాటు అటు షర్మిల కూడా నివాళి అర్పించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికే జగన్ అమరావతి నుంచి కడపకు ప్రత్యేక విమానంలో చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్ లో ఇడుపులపాయ చేరుకున్నారు. రాత్రి ఇడుపులపాయలోని గెస్ట్ హౌస్ లోనే ఆయన బస చేస్తారు. గురువారం ఉదయం 9.35 గంటలకు వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్‌కు ఆయన నివాళులర్పిస్తారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. తార్వత పార్టీ నాయకులతో మాట్లాడి.. తిరిగి అక్కడి నుంచి బయల్దేరి, మధ్యాహ్నం 12.45కు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. ఇదిలా ఉంటే., జగన్ ఇడుపులపాయ చేరుకున్న కాసేపటికే హైదరాబాద్ లో వైఎస్ షర్మిల కడపకు బయలుదేరారు. కడప నుంచి ఆమె నేరుగా ఇడుపులపాయ చేరుకుని జగన్ బస చేసిన గెస్ట్ హౌస్ లోనే బస చేయనున్నట్లుగా సమాచారం. గురువారం ఉదయం 7 గంటలకే తన తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి ఆమె తన తండ్రి వైఎస్సార్‌కు నివాళి అర్పిస్తారు. ఆ తర్వాత ఇడుపులపాయ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ చేరుకుంటారు. సాయంత్రం హైదరాబాద్‌లో విజయమ్మ నిర్వహించనున్న సంస్మరణ సభకు షర్మిల హాజరవుతారు.
భేటీ ఉంటుందా? ఉండదా?
అయితే ప్రస్తుతం అన్నాచెల్లి ఇద్దరూ విడిపోయినట్లుగా.. శత్రువులుగా మారిపోయినట్లుగా జనం అనుకునేలా జగన్, షర్మిల వ్యవహరిస్తున్నారన్న వాదనలు లేకపోలేదు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఒకే చోట బస చేసే వీరిద్దరూ కలిసి మాట్లాడుకోరని ఎలా అనుకునేది? అన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. రాత్రి ఇడుపులపాయలోనే బస చేసే అన్నాచెల్లెల్లు.. ఉదయం మాత్రం వేర్వేరుగా తండ్రికి నివాళి అర్పిస్తారట. అంటే.. తమ మధ్య విభేదాలు ఇంకా తొలగిపోలేదని చెప్పడమే వారి ఉద్దేశ్యమా? అన్న దిశగానూ ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. అయితే గురువారం ఉదయం తండ్రికి నివాళి అర్పించాక గానీ.. వారిద్దరి మధ్య భేటీ జరిగిందా? లేదా? అన్న దానిపై పూర్తిగా స్పష్టత రాకున్నా.. ఓ మోస్తరు అవగాహన అయితే వస్తుందని చెప్పాలి.