జగన్ హయాంలో వేళ్లూనుకున్న అవినీతి, అక్రమ వ్యవస్థలను కూటమి సర్కార్ ఒక్కొక్కటిగా పెకిలించేస్తోంది. తాజాగా ఏపీలో కొత్త రేషన్ విధానం ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. నిన్నా,మొన్నటి వరకు వాహనాల ద్వారా రేషన్ సరుకుల పంపీణి జరిగేది. ఐతే ఈ విధానాన్ని కూటమి సర్కార్ రద్దు చేసింది. పాత పద్ధతిలో రేషన్ డీలర్ల షాపుల దగ్గరే రేషన్ సరుకుల పంపిణీని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించారు. దీంతో జనం రేషన్ డీలర్ల షాపులకు ఉత్సాహంగా తరలివచ్చి తమ రేషన్ కార్డుల ద్వారా రేషన్ సరుకులను అందుకున్నారు.
వైసీపీ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా ఉ్న 29,761 రేషన్ షాపులు ఎక్కడికక్కడ మూతపడి పోయాయి. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి రేషన్ సరుకుల పంపిణీ కోసం వాహనాలను కొనుగోలు చేశారు. ఈ తరహా పద్ధతితో రేషన్ సరుకుల దోపిడీ బాగా పెరిగిపోయింది. జనం లేని సమయంలో వాహనాలు ఆయా కాలనీల్లోకి రావడం, కాసేపు వేచి చూసి వెళ్లిపోవడం, ఆ తర్వాత తాము వచ్చామని, మీరే లేరని లబ్ధిదారులపైకి ఎదురు తిరగడం, ఆపై మిగిలిన రేషన్ సరుకులను యథేచ్ఛగా ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ఈ రేషన్ సరుకులన్నీ కాకినాడ, విశాఖ పోర్టుల ద్వారా దేశం దాటి వెళ్లిపోయేవి. తద్వారా వేలకోట్ల రూపాయలు వైసీపీ నేతలు జేబుల్లో వేసుకున్నారు.
కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దందాను గమనించి..ప్రక్షాళనకు నడుం బిగించింది. రేషన్ సరుకుల అక్రమ మాఫియాను అరికట్టాలంటే…పాత పద్ధతిలో రేషన్ డీలర్ల షాపుల వద్దే సరుకుల పంపిణీ సరైనదని కూటమి సర్కారు నిర్ణయానికి వచ్చింది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో చంద్రబాబు ఇదే అంశం మంత్రి వర్గ సహచరుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. దీంతో జూన్ 1 నుంచి డీలర్ షాపుల ద్వారానే రేషన్ సరుకుల పంపిణీని ప్రారంభించింది ఏపీ సర్కార్. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూటమి పార్టీల నేతలు తమ పరిధిలోని రేషన్ షాపుల ప్రారంభోత్సవాల్లో ఆదివారం బిజీబిజీగా గడిపారు. జనం కూడా రేషన్ షాపులకు సంతోషంగా వెళ్లి సరుకులు అందుకున్నారు.
ఇకపై ప్రతి నెల ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ షాపుల్లో సరుకులు అందుబాటులో ఉంటాయి. లబ్ధిదారులు వీలు పడిన సమయంలో వెళ్లి సరుకులు తెచ్చుకోవచ్చు. ఇక లబ్ధిదారుల కోరిక మేరకు బియ్యం బదులు రాగులు,సజ్జలు ఇతర చిరుధాన్యాలు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇక అసలు సరుకులు వద్దు అనేవారికి నగదు ఇచ్చేందుకు ఆలోచన చేస్తోంది.











