ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గత 2014 వరకు 23 జిల్లాలు ఉన్నాయి. 2014 జూన్ 2న తెలంగాణ ప్రాంతంలోని 10 జిల్లాలతో కలిసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ తరువాత తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన పౌలభ్యం కోసమని 10 జిల్లాలను కాస్త 33 జిల్లాలుగా ఏర్పాటు చేశారు. దీంతో 2019లో ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏపీలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించారు. అయితే అప్పటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేపట్టిన జిల్లాల విభజన సక్రమంగా లేదని ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. జిల్లాల విభజన సరైన ప్రాతిపదికన చేపట్టలేదు కాబట్టి ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో .. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం మరోసారి జిల్లాల విభజన చేపట్టాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి రాష్ట్రంలో 30 జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఉన్న 26 జిల్లాల్లో రెండు, మూడు జిల్లాలను తొలగించి వాటిస్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయాలని.. మొత్తంగా రాష్ట్రంలో 30 జిల్లాలను ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడి సర్కార్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.
గత వైసిపిప్రభుత్వం సరైన రీతిలో జిల్లాల విభజన చేపట్టలేదని, వాటి కారణంగా ఇప్పటికీ అనేక సమస్యలు తలెత్తుతున్నాయని ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అందుకే జిల్లాల పునర్విజన చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది. మొత్తం 30 జిల్లాలుగా పునర్వభజన చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో .. ఇందుకోసం ఇప్పటికే డ్రాఫ్ట్ కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో 26 జిల్లాలు ఉన్నాయి. గత వైసిపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ జిల్లాలకు సరైన ప్రాతిపదిక లేకపోవడం, కొన్ని జిల్లాలకు .. జిల్లా కేంద్రాలు దూరంగా ఉండడంతో .. ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాల విభజన చేపట్టి తప్పులను సరిచేయాలని నిర్ణయించుకున్నారు.
ఎన్నికలకి ముందు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తాము అధికారంలోకి వస్తే జిల్లాల విభజన విషయంలో జరిగిన తప్పును సరి చేస్తామని ప్రకటించారు. ఆ మేరకు కసరత్తు పూర్తయినట్లుగా తెలుస్తోంది. తాజాగా పలాస, నాగావళి, నూజివీడు, తెనాలి, అమరావతి కేంద్రంగా అమరరామ , మార్కాపురం, మదనపల్లి, హిందూపురం, ఆదోని గా కొత్త జిల్లాలను ప్రతిపాదించినట్లుగా డ్రాఫ్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మాజీ సీఎం జగన్ జిల్లాలను మార్చారు కానీ… ఇప్పటికీ ఉమ్మడి జిల్లాల కేంద్రంగానే ఎక్కువ పనులు జరుగుతున్నాయి. దీనికి కారణం మౌలిక సదుపాయాలు కల్పించలేకపోవడమే కాకుండా.. జిల్లాల విభజన చేసి తన పని అయిపోయిందనిపించారు జగన్. కానీ ఉద్యోగులు, ప్రజలకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. ఇప్పుడు మొత్తాన్ని సంస్కరించి.. మౌలిక సదుపాయాలను వేగంగా ఏర్పాటు చేయాలని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది. అన్ని సమస్యలకు చెక్ పెట్టే విధంగా, సరైన రీతిలో జిల్లాల పునర్విభజన చేపట్టాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో కొత్త జిల్లాల డిమాండ్లు తెరపైకి వచ్చాయి. ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. అయితే తాజాగా రాష్ట్రంలో 26 జిల్లాలు కాస్త 30 జిల్లాలుగా ఏర్పాటు కాబోతున్నాయని.. కొన్ని మార్పులు, చేర్పులు జరగబోతున్నట్లు సోషల్ మీడియాలో ఓ డాక్యుమెంట్ వైరల్ అవుతోంది. కొత్తగా మరికొన్ని జిల్లాలను ఏర్పాటు చేయడంతో పాటుగా ప్రస్తుతం ఉన్న జిల్లాల్లో కూడా మార్పులు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకటి, రెండు జిల్లాలను రద్దు చేయబోతున్నట్లు జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 13 జిల్లాలు 26 జిల్లాలుగా పెరిగాయి. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో మరికొన్ని జిల్లాలను ఏర్పాటు చేయాలనే డిమాండ్ వినిపించింది. ఉమ్మడి కడప, ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి అనంతపురం, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో పలు డిమాండ్లు తెరపైకి వచ్చాయి. ఇటీవల ఎన్నికల సమయంలో కూటమి ఈ డిమాండ్లపై హామీలు కూడా ఇచ్చింది. వాటిలో ప్రధానంగా మార్కాపురం కేంద్రంగా ఒక జిల్లా.. హిందూపురం కేంద్రంగా మరో జిల్లాను ఏర్పాటు చేయాలనే డిమాండ్లు వచ్చాయి. అలాగే రాజంపేటకు సంబంధించి కూడా కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. త్వరలోనే కొత్త జిల్లాల ఏర్పాటుపై చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.