ఏపీ ఫైబర్ నెట్..ఇటీవల ఛైర్మన్ పదవికి GV రెడ్డి రాజీనామా చేయడంతో ఈ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రాజీనామాకు ముందు అప్పటి ఎండీ దినేష్‌కుమార్‌పై సంచలన ఆరోపణలు చేశారు GV రెడ్డి. తర్వాత ఎండీ పదవి నుంచి దినేష్ కుమార్‌ను తప్పించింది కూటమి ప్రభుత్వం. ఐతే GV రెడ్డి ఆరోపణలపై తాజాదా స్పందించారు అప్పటి ఎండీ దినేష్ కుమార్. GV రెడ్డి చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని మంత్రి జనార్ధన్ రెడ్డికి నివేదిక సమర్పించారు. రికార్డుల్లో ఉన్న వివరాలను తేదీలవారీగా ప్రస్తావించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 20న ప్రెస్‌మీట్ నిర్వహించిన GV రెడ్డి…ఎండీ దినేష్‌కుమార్ రాజద్రోహానికి పాల్పడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
దినేష్ కుమార్ నివేదికలోని అంశాలు –
గత కొన్నేళ్లుగా కస్టమర్ ప్రెమిసెస్ ఎక్విప్మెట్ – CPE బాక్సులను సంస్థ ఇవ్వలేదన్నారు దినేష్ కుమార్. ప్రస్తుతం ఉన్న బాక్సుల జీవితకాలం ముగియడంతో వాటికి మరమ్మతులు వస్తే పూర్తిచేయలేని పరిస్థితి నెలకొందన్నారు. ఏపీ ఫైబర్‌నెట్ నుంచి పెట్టుబడి లేకుండా కొత్త బాక్సులను అందించడంపై అంతర్గత కమిటీ వేశామన్నారు దినేష్ కుమార్. ఆ కమిటీ గుజరాత్ విధానాన్ని పరిశీలించిందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ గడిచిన 5 నెలల్లో 9 వేల 758 కొత్త కనెక్షన్లను అందించామని వివరించారు. గత జనవరి నాటికి ఉన్న 4 లక్షల 84 వేల 510 కనెక్షన్లకు ఇవి అదనమని చెప్పారు. పాలనాపరంగా, ఆర్థికంగా సవాళ్లున్నప్పటికీ…నెట్‌వర్క్‌ను విస్తరించే చర్యలను తీసుకున్నామన్నారు. నెట్వర్క్ బ్యాండ్‌విడ్త్‌ను సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా ఏటా రూ.5 కోట్లు ఆదా చేశామని స్పష్టం చేశారు.
ఇక ఎలాంటి నియామక పత్రాలు లేకుండా సంస్థలో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో 417 మందిని తొలగించామన్నారు దినేష్ కుమార్. సంస్థకు అవసరం లేకుండా మరో 200 మంది పనిచేస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. వారిని తొలగించే ప్రక్రియ చేపట్టామన్నారు. ప్రస్తుతం ఏపీ ఫైబర్ నెట్లో 925 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారని చెప్పారు.
ఏపీ ఫైబర్ నెట్ సంస్థ వార్షిక టర్నోవర్ తగ్గించి..రూ.142.46 కోట్లు తక్కువ GST చెల్లించినట్లు GST ఇంటెలిజెన్స్ విభాగం నోటీసు ఇచ్చిందన్నారు. దీనిపై విచారణ జరిపేందుకు రికార్డులను అందించాలని 2024 జులై 31న కోరిందని చెప్పారు. ఈ నోటీసుపై ఎలా స్పందించాలనే దానిపైనా చర్చించామన్నారు. సంస్థ ఖాతాల పర్యవేక్షణలో నిర్లక్ష్యం చూపిన ఆడిట్ సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో ఉంచాలని ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శికి లేఖ రాశాం. ఆ సంస్థకు బదులు DHK అండ్ అసోసియేట్స్‌కు సంస్థ ఎకౌంటింగ్ బాధ్యతలను అప్పగించామన్నారు.
ఇక 2017-18 నుంచి జీఎస్టీ చెల్లింపులో వ్యత్యాసం, 18% వడ్డీ, జరిమానా కలిపి రూ.377.14 కోట్లు చెల్లించాలంటూ 2025 జనవరి 23న జీఎస్టీ నుంచి మరో నోటీసు అందించిందని..దీనిపై మూడునెలల్లోగా వివరణ ఇవ్వచ్చన్నారు. దీంతో పాటు GV రెడ్డి చేసిన మరికొన్ని ఆరోపణలపై తీసుకున్న చర్యలను నివేదికలో వివరించారు దినేష్ కుమార్. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై విచారణకు విజిలెన్స్ విభాగం నుంచి లేఖ అందగానే సిబ్బందికి ఆదేశాలిచ్చామన్నారు. భారత్‌నెట్ రెండోదశ, APSFL మొదటిదశ పనులు నిర్వహించిన గుత్తేదారులకు బిల్లుల చెల్లింపు నిలిపేయాలని విజిలెన్స్ విభాగం లేఖ రాసిందని..2018-19 మధ్య సీసీటీవీల నిర్వహణ కాంట్రాక్టు సంస్థకు రూ.60 కోట్లు చెల్లించామన్నారు.వ్యూహం సినిమా దర్శకుడు రాంగోపాల్‌వర్మపై సీఐడీలో నమోదైన కేసు విచారణ జరుగుతోందని..ఇటీవల సీఐడీ అధికారులు వచ్చి రికార్డులు పరిశీలించారని చెప్పారు. కాగ్ ఆడిట్‌కు ముందు ఇంటర్నల్ ఆడిట్ పూర్తిచేయాలని..ప్రస్తుతం ఇంటర్నల్ ఆడిట్ జరుగుతోందని..అది పూర్తయిన తర్వాత కాగ్ ఆడిట్ నిర్వహించాలనుకున్నామని వివరించారు.