( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
ఏపీలోని మూడు యూనివర్సిటీలకు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని వీసీలుగా నియమించడం చర్చానీయాంశమయ్యింది. ఆంధ్రా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్‌గా పి వి జి డి ప్రసాద్ రెడ్డిని నియమిస్తూ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏయూలో కంప్యూటర్ సైన్స్, సిస్టమ్ ఇంజనీరింగ్ డిపార్టెమెంట్‌లో సీనియర్ ప్రొఫెసర్‌గా ప్రసాద్ రెడ్డి సేవలందిస్తున్నారు. ఏడాదిన్నర కాలంగా ఆయన ఇన్‌చార్జ్ బాధ్యతల్లో కొనసాగారు. కంప్యూటర్ సైన్స్ విభాగం ఆచార్యునిగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన విభాగాధిపతిగా, రిజిస్ట్రార్‌గా కూడా పని చేశారు. గత ఏడాది వీసీగా నాగేశ్వరరావు పదవీ విరమణ చేయడంతో అప్పటి రిజిస్ట్రార్ కాని, ఉన్నత విద్యాశాఖలోని ఉన్నతాధికారులకు గాని, ఇతర విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్‌లకు గాని ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తారని అంతా భావించారు. ఊహించని విధంగా ప్రసాద్ రెడ్డికి ఆ బాధ్యతలు దక్కడంతో ఎందరో సీనియర్లు సైతం విస్తుపోయారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రొఫెసర్‌ను వీసీగా నియమిస్తారని ఇటీవల కాలంలో ప్రచారం జరిగినప్పటికీ వాటన్నిటికీ తెరదించుతూ ప్రసాద్ రెడ్డికి ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.
Must Read: దళితులపై ప్రేమా? తోట త్రిమూర్తులుపై కక్షా ?
అంత అత్యవసరంగా ఎందుకో?
ప్రస్తుత వీసిపై పలు అవినీతి ఆరోపణలతో కోర్టులో కేసులు నడుస్తున్నాయని, ఆ వ్యవహారం కారణంగానే కొద్ది రోజుల క్రితం గవర్నర్ ఆంధ్ర యూనివర్సిటీ విసి ఫైలును వెనక్కు పంపారని , మరి అటువంటి వ్యక్తికి పూర్తి బాధ్యతలు ఎలా అప్పగిస్తానని యూనివర్సిటీలోని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎటువంటి లాబీయింగ్‌లు జరిగాయో తెలియదు గానీ… ఆదేశాలు వచ్చేశాయి. అదే విధంగా విశ్వవిద్యాలయాల చట్ట సవరణపై న్యాయస్థానంలో పిల్ కూడా కొనసాగుతోంది. అయితే తాజాగా ఇచ్చిన ఆదేశాల్లో కోర్టు తీర్పునకు లోబడే నియామకాలు ఉంటాయని నోటిఫికేషన్లు పేర్కొనడం గమనార్హం.
ఆ సామాజిక వర్గానికి అగ్రస్థానం..
గత ప్రభుత్వ హయాంలో ఒక సామాజిక వర్గానికి చెందిన వారికే గుర్తింపు దక్కిందని వైఎస్సార్సీపి నాయకులు ఆరోపణలు చేయని రోజు లేదని, మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్నది ఏంటని సీనియర్ ప్రొఫెసర్‌లు, విశ్లేషకులు సైతం ప్రశ్నిస్తున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వీసీ ప్రసాద్ రెడ్డి, శ్రీ వెంకటేశ్వర వర్సిటీ వీసీ కే రాజా రెడ్డి, శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ వీసీగా నియమితులైన ఎం. రామకృష్ణారెడ్డిలు ఏ సామాజిక వర్గానికి చెందిన వారని వారు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఒకసారి విడుదల చేసిన జాబితాలో కూడా ఐదుగురు వీసీలు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారని గుర్తు చేస్తున్నారు. ఉన్నత విద్యకు నిలయమైన వర్సిటీల్లోను రాజకీయ ప్రాధాన్యం పెరగడం మంచి సంకేతం కాదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
Also Read: విశాఖ విమానాశ్రయానికి ఎసరు!