(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
రాష్ట్ర రాజకీయాలకు కొద్ది రోజులుగా హాట్‌స్పాట్‌గా మారిన విజయనగరం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం రామతీర్థం .. తాజాగా మరో వివాదానికి కేంద్ర బిందువైంది. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఈ వివాదానికి తెర తీసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో జగన్ సర్కార్‌పై రాజకీయ విమర్శలను సంధించడానికి తెలుగుదేశం పార్టీకి మరో అవకాశం కల్పించినట్టయిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తాజా వివాదాన్ని ఆధారంగా చేసుకుని టీడీపీ నేతలు జగన్ సర్కార్‌పై ఎదురుదాడికి దిగుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వ అహంకార ధోరణికి ఈ సంఘటన అద్దం పడుతోందని తెలుగుదేశం శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
విరాళం వెనక్కు పంపడమే..
పూసపాటి వంశీయుడు, ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతి రాజు పంపిన విరాళాన్ని రామతీర్థం ఆలయ అధికారులు వెనక్కి పంపడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. రామతీర్థంలోని కోదండరాముని మూల విరాట్టు విధ్వంసానికి గురైన అనంతరం ప్రభుత్వం పునర్నిర్మిస్తోంది. విగ్రహం తయారీ బాధ్యతలను తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుంది. సొంత నిధులతో టీటీడీ అధికారులు రాములవారి విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. తిరుపతిలో టీటీడీకి చెందిన శిల్ప కళాశాలలో విగ్రహం రూపుదిద్దుకుంటోంది. ఈ నేపథ్యంలో ఉదార స్వభావంతో అశోక్ గజపతి రాజు తన సొంత నిధులు 1,01,116/- విరాళంగా అందజేశారు. దీన్ని అంతే గౌరవంగా స్వీకరించాల్సిన దేవాదాయ శాఖ అధికారులు వెనక్కు పంపడం వల్ల రాజకీయ దుమారం రేపుతోంది.
వెనక్కి పంపడానికి కారణం ..
ఈ విగ్రహం రూపకల్పన కోసం అశోక్ గజపతి రాజు 1,01,116 రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు చెక్కును ఆయన ఈ నెల 10వ తేదీన రామతీర్థం ఆలయ కార్యనిర్వహణాధికారి పేరు మీద పంపించారు. విగ్రహం నిర్మాణానికి తాను ఈ మొత్తాన్ని విరాళంగా అందజేస్తున్నట్లు ఓ లేఖను దానికి జత చేశారు. తాజాగా ఈ చెక్ వెనక్కి వచ్చింది. ఆలయ ఈఓ ఈ చెక్కును అశోక్ గజపతిరాజుకు తిప్పి పంపించారు. విరాళాన్ని స్వీకరించట్లేదని తెలిపారు. దీనికి గల కారణాలను ఆయన వివరిస్తూ ఓ లేఖను రాశారు.
అశోక్‌ను అవమానించేలా..
రామతీర్థం ఆలయంలో పునఃప్రతిష్ఠింపజేయడానికి ఉద్దేశించిన శ్రీ సీతారామ లక్ష్మణ స్వాముల విగ్రహాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తన సొంత ఖర్చులతో తయారు చేస్తోందని, అందుకే దాతలు ఎవరి నుంచీ విరాళాలను స్వీకరించట్లేదని ఆ లేఖలో దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. దీనిపట్ల అశోక్ గజపతి రాజు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. రామతీర్థం దేవస్థానానికి అనువంశిక ఛైర్మన్‌గా ఉంటూ వస్తున్న తనను ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తొలగించారని, ఇప్పుడు మళ్లీ తనను అవమానించేలా విరాళాన్ని తిప్పి పంపించారని విమర్శిస్తున్నారు. ఈ విషయంలో ఉత్తరాంధ్రకు చెందిన పలువురు టీడీపీ నేతలు అశోక్‌కు అండగా నిలుస్తున్నారు.
ఉద్దేశపూర్వకంగానే..
అశోక్ గజపతి రాజు కుటుంబంపై ఉద్దేశపూర్వకంగా సర్కారు కక్షసాధింపు చర్యలకు దిగుతోందని టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు. ఇదివరకు సింహాచలం దేవస్థానం, దానితోపాటు మన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ హోదా నుంచి తొలగించిన జగన్ సర్కార్.. రామతీర్థం ఛైర్మన్ పదవి నుంచి రాజకీయ కారణాలతో ఆయనను తొలగించిందని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఆయన పంపించిన విరాళాన్ని తిప్పి పంపడం కూడా రాజకీయ దురుద్దేశమే కారణమని అంటున్నారు. ఒక పథకం ప్రకారం.. ప్రభుత్వం అశోక్ గజపతి రాజు కుటుంబంపై దాడి చేస్తోందని, దాన్ని తాము అడ్డుకుంటామని చెబుతున్నారు.
రామతీర్థంలో కోదండరాముని విగ్రహం ధ్వంసం, అనంతరం విజయనగరం జిల్లా ఇన్‌ఛార్జి, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వ్యాఖ్యల రగడ కొనసాగుతుండగానే .. సర్కారు సరికొత్త వివాదానికి తెరతీయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.