ఏపీ రాజధాని అమరావతి రెండో దశ ప్రాజెక్టు కోసం మరో 40 -45 వేల ఎకరాలు భూ సమీకరణ చేయబోతున్నట్లు చెప్పారు మంత్రి నారాయణ. మొదటి దశలో 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో భూసమీకరణకు అనుసరించిన నిబంధనలే రెండో దశకూ వర్తిస్తాయన్నారు. 5,000 ఎకరాల్లో విమానాశ్రయం, 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్, మరో 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు కొత్తగా సమీకరించబోయే భూమిని ఉపయోగిస్తామన్నారు. ఆ భూమిని భూసమీకరణలో తీసుకోవాలా? భూసేకరణ చేయాలా? అనే అంశంపై స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయసేకరణ చేపట్టామన్నారు. పెదకూరపాడు నియోజకవర్గం పరిధిలో 26,000 ఎకరాలు, తాడికొండ నియోజకవర్గంలోని మూడు గ్రామాల పరిధిలో 12,000 ఎకరాలు కలిపి..38,000 ఎకరాలు భూసమీకరణలో ఇచ్చేందుకు రైతులు ఇప్పటికే స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని చెప్పారు నారాయణ. రెండో విడతలో భూములిచ్చే రైతులకు అభివృద్ధి చేసిన స్థలాలు మూడేళ్లలో అందజేస్తామని ఆయన తెలిపారు. రాజధానిలో ఏర్పాటయ్యే విద్య, వైద్య సంస్థలకు భూముల రిజిస్ట్రేషన్ ఫీజులో మినహాయింపు ఇచేందుకు CRDA ఆమోదం తెలిపిందన్నారు.
భూసమీకరణలో తీసుకున్న భూమిలో రైతులకు స్థలాలు కేటాయించగా CRDAకు మిగిలేది కేవలం 25 శాతమేనన్నారు నారాయణ. విమానాశ్రయం, స్మార్ట్ ఇండస్ట్రీస్, స్పోర్ట్స్ సిటీలకు 10,000 ఎకరాలు కావాలంటే..40,000 ఎకరాలు సమీకరించాలన్నారు. మౌలిక వసతుల అభివృద్ధికి మరో 3 నుంచి 5 వేల ఎకరాలు అవసరమవుతాయని చెప్పారు. మొత్తం మీద సుమారు 45,000 ఎకరాలు కావాలన్నారు. భూసేకరణ చేస్తే.. ఆ ప్రాజెక్టులకు అవసరమైన 10,000 ఎకరాలు తీసుకుంటే సరిపోతుందన్నారు. కానీ అలా చేస్తే రైతులు నష్టపోతారని….అందుకే భూసమీకరణకే మొగ్గు చూపుతున్నామన్నారు. పెట్టుబడులు రావాలంటే అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాలు ఉండాలన్నారు. చంద్రబాబు దూరదృష్టితో హైదరాబాద్‌లో శంషాబాద్ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.
ఇక రాజధాని నిర్మాణానికి తొలి దశలో రైతుల నుంచి తీసుకున్న 34,000 ఎకరాలకు విలువ పెరగాలన్నా, అది నిలబడాలన్నా స్మార్ట్ ఇండస్ట్రీస్ అవసరమని, వాటికి 2,500 ఎకరాలు కేటాయిస్తామన్నారు నారాయణ. అంతర్జాతీయ స్థాయిలో స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తే సంవత్సరానికి రెండు మూడు పెద్ద ఈవెంట్లు జరిగినా దేశ విదేశాల నుంచి క్రీడాకారులు, క్రీడాభిమానులు వస్తారని..హోటళ్లు ఏర్పాటవుతాయన్నారు. ప్రభుత్వానికి జీఎస్టీ పెరుగుతుందన్నారు. సేవారంగం అభివృద్ధి చెందితే…ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. అమరావతి మాస్టర్ ప్లాన్‌లో స్పోర్ట్స్ సిటీ కోసం 120 ఎకరాలు కేటాయించామని, కానీ ఒలింపిక్స్ నిర్వహణకు పోటీపడే స్థాయిలో రాజధానిలో అంతర్జాతీయ క్రీడా సదుపాయాలు కల్పించాలని సీఎం ఆదేశించడంతో.. 2,500 ఎకరాల్లో వాటిని అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. స్పోర్ట్స్ సిటీ కోసం కృష్ణానదికి అటుపక్క కొన్ని లంక గ్రామాల్ని పరిశీలించామని, కానీ అవి నీటిలో మునిగే అవకాశం ఉండటంతో ప్రత్యామ్నాయం చూస్తున్నామని తెలిపారు. మచిలీపట్నం-హైదరాబాద్ హైవే పక్కన కొంత భూమి ఉందని, దాన్ని కూడా పరిశీలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
2014-19 మధ్య భూసమీకరణ విధానానికి రూపకల్పన చేసి, భూములు తీసుకోవడానికి కొంత సమయం పట్టిందన్నారు నారాయణ. మాస్టర్‌ప్లాన్ రూపకల్పనకు ఆరు నెలలు, లేఅవుట్‌ల ప్లానింగ్‌కు మరో ఆరు నెలలు పట్టిందని చెప్పారు. పరిపాలన నగరం ప్లాన్, ఐకానిక్ భవనాల ఆకృతుల్ని మొదట జపాన్‌కు చెందిన మాకీ సంస్థ రూపొందించిందన్నారు. ఐతే అవి బాగా లేకపోవడంతో మళ్లీ టెండర్లు పిలిచామని చెప్పారు. అక్కడే ఎనిమిది నెలల సమయం పోయిందన్నారు. ఎక్కువశాతం టెండర్లన్నీ 2018-19 మధ్య ఎన్నికలకు ఒక ఏడాది ముందే పిలిచామని చెప్పారు. కానీ ఇప్పుడు..న్యాయపరమైన చిక్కులన్నీ తొలగిపోయాయని చెప్పారు. దాదాపు అన్ని పనులకు టెండర్లు పిలిచేశామన్నారు. మరో నాలుగేళ్ల సమయం ఉందని, కచ్చితంగా మూడేళ్లలో అన్ని పనులూ పూర్తవుతాయని చెప్పారు.
సెక్రటేరియెట్,విభాగాధిపతుల ఆఫీసు టవర్ల నిర్మాణానికి రూ.3,673.44 కోట్లతో ఖరారు చేసిన టెండర్లకు అథారిటీ ఆమోదముద్ర వేశామన్నారు నారాయణ. ముఖ్యమంత్రి ఆఫీసు ఉండే జీఏడీ టవర్‌కు రూ.882 కోట్లు (ఎన్‌సీసీ), 1, 2 టవర్లకు రూ.1,487 కోట్లు (షాపూర్‌జీ పల్లోంజీ), 3, 4 టవర్లకు రూ.1,303 కోట్లు (ఎల్ అండ్ టీ) టెండర్లు ఖరారు చేసినట్టు తెలిపారు.