ఆంధ్రప్రదేశ్‌లో సొంతిల్లు లేని నిరుపేదలకు కూటమి ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెప్పనుంది. అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ పరంగా ఉచితంగా ఇళ్లస్థలాలు అందించేందుకు రెవెన్యూ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున స్థలాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బృహత్తర కార్యక్రమం కోసం నవంబరు నుంచి అధికారికంగా భూసేకరణ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు స్పష్టంచేసింది.
ఇళ్లస్థలాల కోసం ప్రభుత్వం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించగా, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 4,59,051 మంది దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు క్షుణ్ణంగా విచారణ చేపట్టి ఇప్పటివరకు 1,43,496 మందిని అర్హులుగా గుర్తించారు. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 1,88,861 దరఖాస్తులను అనర్హులుగా తేల్చి తిరస్కరించారు. ఇంకా మిగిలిన దరఖాస్తులపై కూడా విచారణ కొనసాగుతోంది. మొత్తం మీద రాష్ట్రవ్యాప్తంగా గూడులేని పేదలు దాదాపు 2.50 లక్షల మంది వరకు ఉంటారని అంచనా వేస్తున్నారు.
గత వైసీపీ హయాంలో ఇచ్చిన ఇళ్లస్థలాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గతంలో లోతట్టు ప్రాంతాల్లో సేకరించిన భూములకు మెరక తోసేందుకు భారీగా ఖర్చు కానుండటంతో, అంతకంటే కొత్తగా అనువైన భూములు సేకరించడమే మేలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో అనర్హులకు ఇచ్చిన 43,498 ఇళ్ల పట్టాలను ఇప్పటికే రద్దు చేశారు. కొత్తగా అర్హులైన 1,24,873 మందికి స్థలాలు కేటాయించేందుకు సుమారు 4,800 ఎకరాల భూమి అవసరమని, దీనికోసం రూ.1,800 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.
అక్టోబరు నాటికి అర్హుల తుది జాబితాను పూర్తి చేసి, నవంబరు నుంచి వేగంగా భూసేకరణ చేపట్టి అర్హులైన ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన రీతిలో ఇళ్లస్థలాలు పంపిణీ చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తోంది. ఈ నిర్ణయంతో ఏపీలోని వేలాది పేదల సొంతింటి కల త్వరలోనే సాకారం కానుంది











