విజయవాడలో శాప్ ఆఫీసు ముట్టడి పేరుతో వైసీపీ శ్రేణులు సృష్టించిన అరాచకం, విధ్వంసంపై కూటమి ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించడంతో పాటు ప్రభుత్వ అధికారులను విధులకు ఆటంకం కలిగించిన ఘటనపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. టీచర్లపై వైసీపీ మూక దాడులు, అక్రమ నిరసనలకు సంబంధించి విజయవాడలోని సూర్యారావుపేట, మాచవరం, కృష్ణలంక పోలీస్ స్టేషన్లలో గూండాయిజం, అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా వీటిలో పలు సెక్షన్లు నాన్-బెయిలబుల్ కావడంతో వైసీపీ నేతల చుట్టూ చట్టపరమైన ఉచ్చు బిగుసుకుంటోంది.
మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోనే వైసీపీ నేతలపై తీవ్రమైన సెక్షన్లతో రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. శాప్ డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు BNS సెక్షన్లు 221, 223, 127, 132, 189, 109(1) కింద కేసు నమోదు చేశారు. అలాగే మరోవైపు DSC అభ్యర్థి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా BNS 221, 223, 285, 127(2), 132, 189(3) తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని సెక్షన్ 3(1)(s) కింద కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్లలో చాలా వరకు నాన్-బెయిలబుల్.
మరోవైపు, సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 250 మందితో భారీ నిరసన ర్యాలీ నిర్వహించినందుకు గాను సూర్యారావుపేట ఎస్సై ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. అలాగే కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఎదుట కూడా నిబంధనలను ఉల్లంఘించి ఆందోళన చేపట్టడంపై 170 BNSS సెక్షన్‌తో పాటు, BNS 189(2), 189(3), 221, 132, 223, 126(2), 191(2) , పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 కింద మరో కేసు నమోదు చేశారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన సాగుతుంటే, వైసీపీ నేతలు మాత్రం తమ పాత పద్ధతుల ప్రకారం దాడులు, విధ్వంసాలకు పాల్పడటాన్ని కూటమి ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. శాంతిభద్రతలను కాపాడటంలో రాజీ పడే ప్రసక్తే లేదని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని ఈ కేసుల నమోదు ద్వారా కూటమి ప్రభుత్వం స్పష్టంచేసింది. నాన్-బెయిలబుల్ కేసులు నమోదవడంతో త్వరలోనే ఈ అల్లర్లకు కారకులైన ప్రధాన నేతలపై అరెస్ట్‌ల పర్వం ప్రారంభమయ్యే అవకాశం ఉంది.











