మార్గదర్శి చిట్ ఫండ్ కేసు వ్యవహారంలో రామోజీరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై గాదిరెడ్డి యూరిరెడ్డి అనే వ్యక్తి దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ని సుప్రీంకోర్టు కొట్టేసింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ సహ వ్యవస్థాపకుడు జీజే రెడ్డి కుమారుడే ఈ యూరి రెడ్డి. మార్గదర్శి కేసులో ఏపీ సీఐడీ విచారణపై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేను ఛాలెంజ్ చేస్తూ యూరి రెడ్డి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. మార్గదర్శిలో తన షేర్లను బలవంతంగా బదలాయింపు చేశారని యూరి రెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రామోజీరావు తనను తుపాకీతో బెదిరించి సంతకాలు పెట్టించుకున్నారని యూరి రెడ్డి తన ఫిర్యాదులో ఆరోపించారు.
యూరి రెడ్డి దాఖలు చేసిన ఎస్ఎల్పీ సోమవారం జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ సంజయ్ కరోల్ తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు వచ్చింది. విచారణ ప్రారంభమైన వెంటనే యూరిరెడ్డి తరఫు న్యాయవాది శివరామిరెడ్డి వాదనలు ప్రారంభించి తమ వాదనలు వినకుండానే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. కేసుపై సీఐడీ దర్యాప్తును నిలిపివేయడానికి హైకోర్టు సరైన కారణాలు చెప్పలేదని ఆయన అన్నారు. ఈ సమయంలో జస్టిస్ హృషికేష్ రాయ్ జోక్యం చేసుకుని ఎన్ని రోజులు స్టే విధించారని పిటిషనర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. ఎనిమిది వారాలు అని చెప్పగా.. ఈ కేసు ఇంకా హైకోర్టు పరిధిలో ఉందా అని న్యాయమూర్తి అడిగారు. పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదనలు వినకుండానే ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని, తదుపరి విచారణ ఎప్పుడు చేపడతారని పిటిషనర్‌ను న్యాయమూర్తి హృషికేష్ రాయ్ అడిగారు. డిసెంబరు 6వ తేదీ అని పిటిషనర్ తరపు న్యాయవాది సమాధానం చెప్పారు. అప్పుడు న్యాయమూర్తి మాట్లాడుతూ.. ఈ పిటిషన్‌ను విత్ డ్రా చేసుకోవాలని.. లేదా తాము డిస్మిస్ చేస్తామని చెప్పారు.
మార్గదర్శి కేసు కోర్టు పరిధిలో ఉండగా, ఆ కేసుకు మరింత బలం చేకూర్చేందుకు యూరి రెడ్డిని జగన్ ప్రభుత్వమే మధ్యలోకి తీసుకొచ్చిందనే ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. కేసుకు బలం చేకూర్చేందుకు ఆయనతో కేసులు పెట్టించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అందులో భాగంగానే ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ధర్మాసనం ఆయన పిటిషన్ ను డిస్మిస్ చేసింది. దీంతో జగన్ కు బిగ్ షాక్ తగిలినట్లయింది.
గతంలో మార్గదర్శి కేసు విచారణ సందర్భంగా ఏపీ సీఐడీ తీరుపై ఏపీ హైకోర్టు సూటి ప్రశ్నలు వేసింది. ఆ కేసు హైదరాబాద్‌లో జరిగిందని హైకోర్టుకు చెప్పగా, ఈ అంశంపై కేసు నమోదు చేసే హక్కు ఏపీ సీఐడీకి ఉందా అని కోర్టు ప్రశ్నించింది. విచారణ చేసే అధికారం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? అని కోర్టు ప్రశ్నించింది. షేర్ల బదిలీకి సంతకం చేసినట్లు యూరి రెడ్డి స్వయంగా సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారని హైకోర్టు గుర్తు చేసింది. అలాంటప్పుడు బెదిరింపులతో సంతకం చేసే ప్రశ్నే తలెత్తదని హైకోర్టు చెప్పింది. మార్గదర్శిపై కేసు నమోదు విషయంలో సీఐడీ అధికార పరిధిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని నమోదైన కేసులో తదుపరి చర్యలన్నింటినీ 8 వారాల పాటు నిలిపివేస్తున్నట్లు హైకోర్టు అప్పట్లో ప్రకటించింది.