రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారం సలహాదారులను నియమించడంపై హైకోర్టు అనేక సార్లు చివాట్లు పెడుతున్నాఈ సిగ్గులేని జగన్ ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవడం లేదు. వివిధ శాఖలకు సలహాదారుల నియామకంలో రాజ్యాంగబద్ధతను తేలుస్తామని, రాజ్యాంగంలో సలహాదారుల నియామకానికి సంబంధించి నిబంధనలు ఉన్నాయో లేదో తేలుస్తామని హైకోర్టు చివాట్లు పెట్టింది.
వివిధ శాఖలకు నేతృత్వం వహించే సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉండగా బయటి నుంచి వచ్చినవారు మెరుగైన సలహాలు ఇస్తారా అని హైకోర్టు నిలదీసింది. శాఖలతో ప్రారంభమైన సలహాదారుల నియామక ప్రక్రియ రేపు పోలీసు అధికారులు, తహశీల్దార్ల వరకు విస్తరించే ప్రమాదం ఉందని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఒక ప్రభుత్వ శాఖకు సలహాదారులను నియమించేందుకు ప్రభుత్వానికి ఉన్న అధికారాలు ఏమిటో. సలహాదారులను నియమించేందుకు నిర్దిష్ట విధానం ఏమిటో,వారి ఎంపికకు అర్హతలు నిర్ణయిం చారా? దరఖాస్తులు ఆహ్వానించారా? లేదంటే ఎవరినైనా సలహాదారులుగా నియమించవచ్చా అని హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఒకరిని, ఇద్దరిని కాదు ఏకంగా 45 మందికి పైగా సలహాదారులను నియమించుకొన్నది. వీరుగాక లెక్కలోకి రాని వారి సంఖ్య ఇంక ఎంత ఉందొ తెలియదు. వీరందరిలో ఒకరిద్దరు తప్ప మిగిలిన వారు ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. కానీ వీరందరిని కూర్చోబెట్టి లక్షల్లో వేతనాలు, సకల సదుపాయాలు, రాజభోగాలు కల్పిస్తున్నారు.
గత మూడున్నరేళ్లలో ఆ 45 మందికి జగన్ ప్రభుత్వం దోచిపెట్టిన పెట్టిన ఖర్చు దాదాపు రూ 100 కోట్లు. మరో ఏడాదిన్నరలో ఇంకో రూ 60 కోట్లు వ్యయం చేయనుంది. అంటే 160 కోట్లు జీతాలు,అలవెన్సులు, గ్రాంట్లు, సకల మర్యాదల రూపంలో ప్రజాధనం సలహాదారుల ఖాతాల్లోకి చేరిపోతుంది.రహదారులు నరక ప్రాయంగా మారి ప్రజల ప్రాణాలు హరిస్తున్న రోడ్ల పై గుంతల రోడ్లపై తట్టెడు మట్టివేయడానికి డబ్బులు ఉండవు. కానీ సలహాదారుల నియామకాలకు, వారికిచ్చే రాచ మర్యాదలకు అడ్డూ అదుపూ లేకుండా ప్రజాధనం దోచిపెడుతున్నారు. ఎక్కడో ఏదో రూపంలో ఉపయోగపడ్డారని కొందరిని ఏరికోరి సలహాదారులుగా నియమించుకొని ప్రజల సొమ్మును దోచిపెడుతున్న ప్రభుత్వం వారి వల్ల కలుగుతున్న ఉపయోగం ఏమిటి ? రాష్ట్రానికి, వారి వల్ల ప్రజలకు ఒనగూరే ప్రయోజనం ఏమిటో జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పగలదా? రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మంత్రులు ఉన్నారు. రాజ్యాంగబద్ధంగా పనిచేసే పరిపాలనా వ్యవస్థ ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులున్నారు. వీరంతా ప్రజలకు జవాబుదారీ.
మరి సలహాదారులు ఎవరికి జవాబు దారి ? అసలు వారి అవసరం ఏముంది? వారికి వున్న చట్టబద్ధత ఏమిటి. పాలనాపరంగా సముచిత నిర్ణయాలు తీసుకునేందుకు ఆయా రంగాల్లో నిపుణులు, నిష్ణాతులు, అనుభవజ్ఞులను సలహాదారులుగా నియమించుకునేవారు. వారు నిత్యం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ అధికారులతో సమన్వయం చేసుకునేవారు. ముఖ్యమంత్రి స్థాయిలో జరిగే సమావేశాల్లో వారు పాల్గొనడమే కాదు.వారి సలహాలకు విలువ కూడా ఉండేది. కానీ ఇప్పుడు అర్హత, అనుభవం లేకపోయినా రాజకీయ ప్రాధాన్యం ప్రాతిపదికనే సలహాదారులను నియమిచుకొంటున్నారు. ప్రజామోదంతో చట్టసభల్లోకి రాలేకపోతున్న వారు ఇలా సలహాదారుల రూపంలో వచ్చి తిష్ఠ వేస్తున్నారు. పైగా వీరికి గవర్నర్, ముఖ్యమంత్రితో సరితూగే వేతనాలు, అలవెన్సులు, హోదాలు, సకల గౌరవ మర్యాదలూ పొందుతున్నారు.
ప్రతి శాఖకు మంత్రి, ముఖ్య కార్యదర్శి, విభాగాధిపతి, అధికార యంత్రాంగం ఉంది. అయినా జగన్ ప్రభుత్వం ప్రతి శాఖకూ సగటున ఇద్దరు సలహాదారులను నియమించింది. కొన్ని శాఖలకు నలుగురు కూడా ఉన్నట్లు సమాచారం. వీరు చేస్తున్నపనులు, ఇస్తున్న సలహాలేమిటి? వారు ఇస్తున్న సలహాలు ఆధారంగా ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలేంటి? ఈ ప్రశ్నలకు జవాబుల్లేవు. 45 మంది సలహాదారుల్లో తాడేపల్లి సీఎం సమక్షంలో జరిగే సమావేశాలకు ముఖ్య సలహాదారు,సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే హాజరవుతుంటారు. మిగిలిన వారు ఎప్పుడైనా ఆ సమావేశాలకు హాజరయిన పరిస్థితి ఉందా ? కనీసం వారికి పిలుపు కూడా ఉండదు. ఒకవేళ వెళ్లినా వారిని రానివ్వరు. ప్రభుత్వ స్థాయిలో జరిగే సమావేశాలకు రానివ్వరు. స్వయంగాసలహాదారులే సమావేశం పెట్టె అవకాశమే లేదు. మరి వీరు చేస్తున్నది ఏమిటి ? సలహాదారులు సలహాలిచ్చే అవకాశమే లేనప్పుడు వీరికి కోట్లాది రూపాయల ప్రజాధనం రూపాయలు దోచి పెట్టడం అవసరమా?
కొందరు సలహాదారులు చేయడానికి తమకు ఏ పనిలేదని భావించి ఆ పోస్టుల్లో ఉండలేక రాజీనామాలు చేసారు. సలహాదారుల్లో అత్యధికులు వారి సొంత జిల్లాల్లోనే ఉంటున్నారు. కొందరు హైదరాబాద్‌లో ఉంటున్నారు. విజయవాడ, గుంటూరులో ఉంటోంది కొద్ది మంది మాత్రమే. ఇక వారు ఏం చేయాలో నిర్దేశించే జాబ్‌చార్ట్ కూడా లేదు. పని ఎలాగూ లేదు కాబట్టి అనేక మంది జిల్లాల్లో వైసీపీ రాజకీయాల్లో మునిగితేలుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే కారు, వ్యక్తిగత సిబ్బంది, ప్రొటోకాల్‌తో రాచమర్యాదలు పొందుతూ వెలిగిపోతున్నారు. సలహాదారుల సూచనలతో ప్రభుత్వం చేసిన మంచి పనేమిటో ఒక్కటైనా చూపగలదా ? ఇప్పటి వరకు సీఎం వద్ద జరిగిన సమావేశాలకు ఏ సలహాదారు హాజరయ్యారు? ఎన్ని సలహాలు ఇచ్చారు? ప్రభుత్వంలో వారి పాత్ర ఏమిటో శ్వేతపత్రం విడుదల చేయగలదా జగన్ ప్రభుత్వం.
45 మందికిపైగా ఉన్న ప్రభుత్వ సలహాదారుల్లో 8 మందికి కేబినెట్ ర్యాంకు కల్పించారు. వీరితోపాటు మరో 12 మందికి కేటగిరీ-1 కింద నెలకు సగటున రూ.3.82 లక్షల వేతనం చెల్లిస్తున్నారు. ఇది కాకుండా అధికారిక నివాసం, ప్రభుత్వ కారు, డ్రైవరు, వ్యక్తిగత సహాయకుడు(పీఏ), వ్యక్తిగత కార్యదర్శి(పీఎస్), ఆఫీసు సిబ్బంది కలిపి అర డజనుకు తగ్గకుండా సిబ్బంది ఉన్నారు. వీరందరికీ వేతనాలు, అలవెన్సులు, ప్రొటోకాల్, వాహనాలు, వనరుల పేరిట ప్రతి సలహాదారు పేరిట మరో రూ.2 లక్షలు ఖర్చుపెడుతున్నారు. అంటే మొదటి కేటగిరీలోని సలహాదారులపై ఒక్కొక్కరికీ సగటున నెలకు రూ.5.82 లక్షలు ఖర్చుచేస్తున్నారు.ఈ 20 మందిపై మూడున్నరేళ్ళ కాలంలో రూ 50 కోట్లు వ్యయం చేశారు. రెండో కేటగిరీ సలహాదారులు 14 మంది ఉన్నారు. వీరికి కేబినెట్ ర్యాంకు ఉండదు. వీరికి సగటున నెలకు రూ.2,79,000 వేతనం అందిస్తున్నారు. మౌలిక సదుపాయాలు, వాహనాలు, సిబ్బంది జీతభత్యాల పేరిట మరో రూ.2 లక్షలు. వీరిపై ఒక్కొక్కరికీ నెలకు 4.79 లక్షలవుతోంది. మూడో కేటగిరీలో ఆయా శాఖలు, విభాగాల్లో పనిచేసే సలహాదారులు ఉన్నారు. వీరికి ఒక్కొక్కరికీ నెలకు రూ.2 లక్షల వేతనం.. వనరులు, సదుపాయాల పేరిట మరో 2 లక్షలు కలిపి నెలకు 4 లక్షలు వ్యయం చేస్తున్నారు.
ఈ కేటగిరీలోని 11 మందిపై మూడేళ్లలో రూ.15.84 కోట్లు ఖర్చుచేశారు. వీరుగాక ఓ ప్రత్యేక సలహాదారు కూడా ఉన్నారు. ఆయన వేతనం నెలకు రూ.2.50 లక్షలు. సిబ్బంది వేతనాలు, అలవెన్సులు మరో 2 లక్షలు. వెరసి నెలకు 4.50 లక్షల ఖర్చు. ఈయనపై గత మూడేళ్లలో 1.62 కోట్లు ఖర్చుచేశారు. కొందరు సలహాదారులకు అదనపు అవకాశాలు కూడా కల్పించారు. కారు కొనుగోలుకు రూ.10 లక్షలు, కంప్యూటర్, ల్యాప్‌టాప్ కొనుగోలుకు రుణం, గ్రాంటులు, ఫర్నిచర్, ఇంట్లో సామాను అంటే టీకప్పుల నుంచి సకలం కొనుగోలు చేయడానికీ ప్రత్యేకంగా అలవెన్సులు ఇస్తున్నారు. ఇవన్నీ వారి నియామక ఉత్తర్వుల్లోనే పొందుపరచడం మరో విశేషం. సలహాదారుల నియామకం సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు, అందులో వారికి ఇస్తున్న వేతనం, ఇతర అలవెన్సులు. సిబ్బంది జీతభత్యాలను పరిగణనలోకి తీసుకుంటే గడచిన మూడున్నరేళ్ళలో రూ160 కోట్లు జీతాలు,అలవెన్సులు, గ్రాంట్లు, సకల మర్యాదల రూపంలో ప్రజాధనం సలహాదారుల ఖాతాల్లోకి చేరిపోతుంది.మరో ఏడాదిన్నరలో ఇంకెంత ఖర్చు పెడతారో చూడాలి. అంతే కాకుండా లెక్కలోకి రాని సలహాదారులపై ఇంకెంత ఖర్చుపెట్టి ప్రజాధనం దోపిడీ చేస్తారో ఏ ఆర్ధిక గణాoకుడు లెక్క తేల్చగలరు.