ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వైసీపీ హయాంలోని వేల కోట్ల లిక్కర్ స్కామ్ ఇప్పుడు కీలక మలుపు తీసుకుంది. ఈ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డేనని..అప్పటి APSBCL స్పెషల్ ఆఫీసర్ డి. సత్యప్రసాద్ విజయవాడ ACB కోర్టు ఎదుట స్పష్టం చేశారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన సత్యప్రసాద్ ఇచ్చిన వాంగ్మూలం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలకు దారి తీసింది.
తాడేపల్లిలోని జగన్ నివాసంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలోనే మద్యం డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి నెలకు రూ.50-60 కోట్లు వసూలు చేయవచ్చని ప్రణాళిక రచించినట్లు సత్యప్రసాద్ వెల్లడించారు. ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించే బాధ్యతలను ఎంపీ మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డిలకు అప్పగించగా, అమలు చేసే బాధ్యతలను తాను, ఎండీ వాసుదేవరెడ్డి చూసుకున్నట్లు తెలిపారు. డిస్టిలరీల నుంచి వసూలు చేసిన రూ.3,200 కోట్లకు పైగా లంచాల సొమ్మును రాజ్ కెసిరెడ్డి ద్వారా వైఎస్ అనిల్‌రెడ్డి, గోవిందప్ప బాలాజీ, కె.ధనుంజయరెడ్డి, పి.కృష్ణమోహన్‌రెడ్డి తదితరులకు చేరవేయగా, వారంతా తమ వాటా మినహాయించుకుని సింహభాగాన్ని జగన్‌కు అందించేవారని స్పష్టం చేశారు.
ఏయే బ్రాండ్లకు సరఫరా ఆర్డర్లు ఇవ్వాలనేది రాజ్ కెసిరెడ్డి, వాసుదేవరెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి నిర్ణయించేవారని చెప్పారు సత్యప్రసాద్. జారీ చేసిన ఆర్డర్ల ఆధారంగా డిస్టిలరీల నుంచి బేసిక్ ప్రైస్ ఆధారంగా ఒక్కో కేసుపై రూ.150 నుంచి రూ.600 వరకు లంచాలు వసూలు చేసేవారని, లంచాలు ఇవ్వడానికి అంగీకరించిన సంస్థలకే అత్యధికంగా సరఫరా ఆర్డర్లు కేటాయించేవారని, వ్యతిరేకించిన వారిని పక్కనబెట్టేవారని వాంగ్మూలంలో సత్యప్రసాద్ పేర్కొన్నారు.
ఈ కుంభకోణానికి సంబంధించిన ఆధారాలను మాయం చేయడానికి నిందితులు పకడ్బందీగా వ్యవహరించారు. సరఫరా ఆర్డర్ల జారీకి సంబంధించిన నోట్‌ఫైళ్లను ధ్వంసం చేయడం కోసం హైదరాబాద్, విజయవాడలలో పలుమార్లు రహస్య సమావేశాలు నిర్వహించారు. ఈ ప్రక్రియలో నాటి CMO కీలక అధికారులు, నిఘా విభాగాధిపతులు కూడా భాగస్వామ్యం అయినట్లు తేలింది. కేవలం మద్యం విక్రయాలే కాకుండా, ఫీల్డ్ మానిటర్ల నియామకం, రవాణా కాంట్రాక్టులు, షాపుల సిబ్బంది నియామకాల పేరుతో అనేక కుంభకోణాలకు పాల్పడి వందల కోట్లు దోచుకున్నట్లు సత్యప్రసాద్ పూసగుచ్చినట్లు వివరించారు.
మద్యం కుంభకోణానికి సంబంధించి పూర్తి వివరాలను ఆధారాలతో సహా బయటపెట్టేందుకు డి. సత్యప్రసాద్ అప్రూవర్‌గా మారుతుండటం దర్యాప్తు సంస్థలకు అత్యంత కీలకంగా మారింది. ఈ సంచలన వాంగ్మూలం ఆధారంగా రాబోయే రోజుల్లో ఈ కేసులో సంచలనాలు నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.











