సరిగ్గా ఏడాది క్రితం ఏపీలో జగనాసుర పాలనకు తెరపడింది. వై నాట్ 175 అంటూ విర్రవీగిన వైసీపీ కేవలం 11 స్థానాలకు పరిమితమై కూటమి చేతిలో మట్టి కరిచింది. ఇది భారత ప్రజాస్వామ్యానికి నిదర్శనం. ఎన్నికలు జరిగిన ప్రతి సారి గెలిచేది ప్రజలు మాత్రమే. ప్రజలు గెలవాలనుకున్న పార్టీ మాత్రమే గెలుస్తుంది. ఇక ఓటమిని శాసించేది ప్రజలే. కానీ కొన్ని ప్రజా తీర్పులు చరిత్రను మలుపుతిప్పుతాయి. అలాంటి తీర్పే ఏపీలో సరిగ్గా ఏడాది కిందట వచ్చింది.2024 జూన్ 4న కూటమి విజయ ఢంకా మోగించింది. దీంతో ఏపీలో ఇవాళ కూటమి పార్టీలు పండుగ చేసుకోవాలని నిర్ణయించాయి.
2024, జూన్ 3 వరకు వైసీపీ నేతలు రెచ్చిపోయారు. మరోసారి అధికారం మాదేనన్న గర్వంతో కన్నుమిన్నూ కానకుండా ప్రవర్తించారు. బటన్ నొక్కాం..అకౌంట్లలో డబ్బులు వేశాం. ప్రజలంతా మా బానిసలు, మాకు తప్ప మరెవరికీ ఓటేయరని ఫిక్స్ అయిపోయారు. ఎదురుతిరిగితే దాడులు చేశారు. దౌర్జన్యాలు చేశారు. బెదిరించారు. తప్పుడు సర్వేలతో ప్రజలను తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేశారు. పార్టీ క్యాడర్‌ను బెట్టింగ్‌ల వైపు మళ్లించి వాళ్లను నిండా ముంచారు. ఐతే ప్రజలు మాత్రం వైసీపీకి, ఆ పార్టీ అధినేతకు తగిన విధంగా బుద్ధి చెప్పారు. అర్ధరాత్రి వరకు క్యూలైన్లలో వేచి ఉండి ఓట్లేశఆరు. దీంతో జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా కూడా గల్లంతయింది. 2019 ఎన్నికల్లో 151 స్థానాలు గెలిచిన జగన్..11 సీట్లతో పాతాళానికి పడిపోయారు. ప్రాంతం, జిల్లా తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది. అధికార కూటమి పార్టీకి మెజార్టీలు ఏకంగా 50 వేలకు పైనే. జగన్‌పై ప్రజాగ్రహం ఎంతగా ఉందో కౌంటింగ్ మొదలైన గంట సేపటికే తెలిసిపోయింది.
ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు. మేమే తోపులం అని ఎవరైనా నేతలు అనుకుంటే అది వారి భ్రమ మాత్రమే. గెలుపును, ఓటమిని డిసైడ్ చేసేది ప్రజలు మాత్రమే. అందుకే అంతిమంగా గెలిచేది ప్రజలు మాత్రమే. దాన్ని పట్టించుకోకుండా.. ప్రజాస్వామ్యాన్ని తక్కువ అంచనా వేస్తే.. పాతాళానికి పడిపోతారు. ప్రజా అభిప్రాయాన్ని తెలుసుకుని రాజకీయాలు చేస్తే ప్రాధాన్యం ఉంటుంది. కూటమి పార్టీలు అదే చేశాయి. కూటమికి పథకాల కోసం ప్రజలు ఓట్లు వేయలేదు. జగన్ అరాచక పాలన నుంచి కాపాడమని వేశారు.
2024 ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పు రాజకీయ పార్టీలకు గుణపాఠం. అధికారం వచ్చింది కదా అని రెచ్చిపోతే తిరిగి ఐదేళ్లలో ఎక్కడ నుంచి వచ్చావో అక్కడికే ప్రజలు పంపిస్తారు. ప్రజల్ని గౌరవించాలి. నమ్మి అధికారం ఇచ్చిన ప్రజల్ని వంచించకూడదు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో మరోసారి ఏపీ కింగ్ మేకర్ అయింది. ఏపీ ప్రయోజనాలు ఇప్పుడు నెరవేరుతున్నాయి. కూటమి ప్రజా ఆకాంక్షలను నెరవేర్చే పనిలో బిజీగా ఉంది. మళ్లీ ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలిపేందుకు అడుగులు పడుతున్నాయి.











