ఏపీలో జగన్ హాయాంలో జరిగిన ప్రధానమైన అవకతవకలు, అక్రమాల్లో ఇసుక, గనుల కుంభకోణం కూడా ఉన్న సంగతి తెలిసిందే. జగన్ రెడ్డి నియమించుకున్న గనుల శాఖ మాజీ ఎండీ కనుసన్నల్లోనే శాఖలోని అన్ని కుంభకోణాలు జరిగాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అక్రమార్కుల భరతం పడుతుండగా.. ఇసుక తవ్వకాలకు సంబంధించి పలువురిపై కేసులు కూడా నమోదు చేసింది. అయితే, ఏపీ గనుల శాఖ మాజీ ఎండీ వెంకట రెడ్డి మాత్రం దొరక్కుండా పారిపోయారు. ఇందుకోసం ఏసీబీ అధికారులు వెతుకుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలలో భాగంగా ఈ వెంకట్ రెడ్డిని ప్రభుత్వం పక్కన పెట్టిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత అక్రమాలు జరిగాయని ప్రాథమికంగా తేలడంతో గత రెండు నెలల క్రితమే వెంకట్ రెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి వెంకట్ రెడ్డి పరారీలో ఉన్నారు. అయితే, ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వానికి, కనీసం పైఅధికారులకు సమాచారం ఇవ్వకుండా ఇలా ఇన్ని రోజులు కనిపించకుండా పోవడం అనేది నేరమని ప్రభుత్వం చెబుతోంది. గత వైసీపీ ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు తల ఊపుతూ ప్రభుత్వ ఖజానాకు రూ.వేల కోట్లు నష్టం కలిగించిన వెంకట రెడ్డి అరెస్టు భయంతో ఎవరికీ కనిపించకుండా తప్పించుకుని తిరుగుతున్నారని ఏసీబీ అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే ఏసీబీ ఏపీ సీఎస్ అనుమతి తీసుకుని వెంకట రెడ్డి దందాలపై విచారణ చేస్తోంది. గత వైసీపీ హాయాంలో గనులు, ఖనిజం, ఇసుక దోపిడీకి వైసీపీ పెద్దలకి వెంకట రెడ్డి పూర్తిగా సహకరించారని ఏసీబీ అధికారుల ప్రాథమిక విచారణలో గుర్తించారు. అందులో భాగంగా హైదరాబాద్ లోని వెంకటరెడ్డి ఇంటికి ఏసీబీ అధికారులు నోటీసులు కూడా అంటించారు. అయినా వెంకట రెడ్డి ఏపీ ప్రభుత్వానికి గానీ, ఏసీబీకి గానీ ఎలాంటి వివరణ ఇవ్వడానికి ప్రయత్నించడం లేదు. కనీసం ప్రెస్ మీట్ పెట్టి లేదా వీడియో రిలీజ్ చేసి తనపై ఆరోపణలను ఖండించనూ లేదు.
తిరుపతి, హైదరాబాద్, చెన్నైలోని వెంకట్ రెడ్డికి ఉన్న ఇళ్లలో ఎక్కడ గాలించినా ఆయన ఆచూకీ చిక్కడం లేదని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఈయన కనుసన్నల్లోనే జేపీ పవర్ అనే సంస్థ గత వైసీపీ ప్రభుత్వంలో భారీ ఎత్తున ఇసుక టెండర్లను దక్కించుకుంది. ఈ సంస్థ సుమారు. 800 కోట్ల రూపాయలు జగన్ ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. అయినా జేపీ సంస్థ గత వైసీపీ ప్రభుత్వానికి ఎలాంటి బాకీ లేదంటూ ఆ సంస్థకు వెంకటరెడ్డి ఎన్ఓసీ ఇచ్చేశారు. ఇలా ఆ సంస్థకి రూ.800 కోట్లకు పైగా లబ్ది చేకూరడానికి గత వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలు, వెంకటరెడ్డి పూర్తిగా సహకరించారని ఏసీబీ అధికారుల విచారణలో వెలుగు చూసింది. అయితే, వెంకట్ రెడ్డి ఇదే నెల 31వ తేదీ రిటైర్ కావాల్సి ఉంది. అప్పటిదాకా పరారీలోనే ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.