చేపలు పట్టాలంటే ఊరి చివరన ఏ చెరువు దగ్గరికో.. కాల్వల దగ్గరికో వెళ్తాం. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఆర్ అండ్ బీ రోడ్డు కనిపిస్తే చాలు.. ఈజీగా చేపలు పట్టుకోవచ్చు. రోడ్డు మీద ఏంటి? చేపలు పట్టడమేంటి? అనుకుంటున్నారా..? గత వారంరోజులుగా ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల వల్ల ప్రధాన రోడ్లు, రహదారులు, వీధులు.. గోతులు, గుంతలతో దర్శనమిస్తున్నాయి. కొన్ని రోడ్లు పూర్తిగా జలమయమై చెరువులను తలపించడంతో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
చేపలు పట్టి.. నిరసన తెలిపి
పాలకొల్లులోని ఓ ఆర్ అండ్ బీ రోడ్డు పూర్తిగా జలమయమైంది. మోకాలు లోతు నీళ్లు నిండుకోవడంతో పాటు చేపలు వచ్చి చేరాయి. రోడ్ల దుస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేపలు పట్టి వినూత్నంగా నిరసన తెలిపారు. ఏపీలో రోడ్లు అస్తవ్యస్తంగా మారాయని, నేటికీ టీడీపీ హయాంలో వేసిన రోడ్లే కనిపిస్తున్నాయని అన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వం వల్ల జనాలు రోడ్ల మీద చేపలే పట్టే పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. రెండేళ్లుగా రోడ్లకు మరమ్మత్తులు చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదా..? అంటూ ఎమ్మెల్యే నిమ్మల ప్రశ్నించారు.
అవినీతికి ప్రతిరూపాలుగా
జగనన్న గుంతల పథకం’తో రోడ్డెక్కాలంటేనే ప్రజలు వణుకుతున్నారని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. రాష్ట్రంలోని రోడ్లు.. అవినీతికి ప్రతిరూపాలుగా మారాయని, అవినీతి మత్తులో తేలుతూ.. ప్రజలను రోడ్లపైనే పడవల్లో తిరిగే పరిస్థితికి తీసుకొచ్చిందని మండిపడ్డారు. రాష్ట్రంలో రోడ్ల మరమ్మత్తులకు వెంటనే బడ్జెట్ విడుదల చేయాలని, రోడ్లపై ఖర్చు చేసిన సొమ్ముకు సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
Must Read ;- జగన్ గారు.. ఈ ‘చెత్త’ మీద పన్నులేంటి..?