ఏపీలో పంచాయతీ ఎన్నికల తొలి దశ నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రెండో దశ నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైన నేపథ్యంలో, ఎన్నికల కమిషన్ జమా, ఖర్చుల విషయంలో ఒక స్పష్టతనిచ్చింది. వాటి ప్రకారమే ఖర్చు ఉండాలని హుకుం జారీ చేసింది. ఒకవేళ గట్టు దాటితే చర్యలు తప్పవంటుంది. అసలే పట్టుబట్టి.. కోర్టులకెక్కి మరీ ఎన్నికల అధికారాల్ని సాధించుకున్న నిమ్మగడ్డ కాస్త గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నట్లు కనిపిస్తుంది.
లెక్క మీరకండి..
2011 జనాభా లెక్కల ప్రకారం ఎన్నికల జరుపుతున్నట్టు నిమ్మగడ్డ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాబట్టి ఆ లెక్కల ప్రకారమే వ్యయ పరిమితిని కూడా విడుదల చేసింది ఎన్నికల కమిషన్.
- 10 వేల కంటే ఎక్కవ జనాభా ఉన్న గ్రామంలో.. సర్పంచ్ అభ్యర్థి 2.50 లక్షల వరకు వ్యయ పరిమితిని విధించింది. అదే వార్డు మెంబర్ 50 వేల వరకు ఎన్నికల ఖర్చు చేసుకోవచ్చు.
- ఇక 10 వేల కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో.. సర్పంచ్ అభ్యర్థి 1.5 లక్షల వరకు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక వార్డు మెంబర్ విషయానికొస్తే.. 30 వేలకు పరిమితి విధించింది.
పరిమితులు మించకూడదు..
ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యేక పరిశీలకుడిగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డిని ఎస్‌ఈసీ ఆహ్వానించింది. వ్యయ పరిశీలకులుగా ఐఎఫ్‌ఎస్ అధికారులు, సాధారణ పరిశీలకులుగా ఐఏఎస్ అధికారులను నియమించింది ఎస్‌ఈసీ. ఎన్నికల కమిషన్‌కు, ప్రతి జిల్లాకు సంబంధించిన వివరాలు తెలియపరచడానికి వెంటనే నోడల్ అధికారులను నియమించాల్సిందిగా రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ గిరిజాశంకర్‌ను ఎన్నికల కమిషన్ ఆదేశించింది.
Must Read ;- రేషన్ డెలివరీ వాహనం ఎక్కిన నిమ్మగడ్డ.. నిర్ణయం ఏం తీసుకుంటారో..?