ఏపీలో కూటమి ప్రభుత్వం మహిళల కోసం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో మహిళలకు ప్రజా రవాణాను సులభతరం చేస్తూ, వారి ప్రయాణ ఖర్చుల భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రారంభమైన ఈ పథకంలో ఇప్పటివరకు ఉచితంగా జారీ చేసిన ప్రయాణ టికెట్ల సంఖ్య ఏకంగా 100 కోట్ల మార్కును దాటేసింది.
ఈ ఘనతపై సీఎం చంద్రబాబు నాయుడు, ఆర్టీసీ యాజమాన్యం హర్షం వ్యక్తం చేశాయి. రోజుకి సగటున 24 లక్షల మంది మహిళలు, విద్యార్థినులు, ఉద్యోగినులు ఈ పథకం ద్వారా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని అధికారులు వెల్లడించారు. ఉచిత టికెట్ల జారీ ద్వారా రాష్ట్రంలోని మహిళలకు ఇప్పటివరకు సుమారు రూ. 3,500 కోట్ల మేర ప్రయాణ వ్యయం ఆదా అయిందని ఆర్టీసీ లెక్కలు చెబుతున్నాయి.
ఈ నిధులను ప్రభుత్వం ఆర్టీసీకి సకాలంలో రీయింబర్స్ చేస్తూ సంస్థకు ఎటువంటి ఆర్థిక లోటు రాకుండా అండగా నిలుస్తోంది. స్త్రీ శక్తి పథకం రాకముందు బస్సుల్లో మహిళా ప్రయాణికుల వాటా 40 శాతంగా ఉంటే, ప్రస్తుతం అది 62 శాతానికి పైగా పెరిగింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ సర్వీసులను విస్తరించడంతో పాటు కొత్త బస్సులను కూడా అందుబాటులోకి తెస్తున్నారు.
కేవలం రవాణా సౌకర్యమే కాకుండా మహిళల ఆర్థిక సాధికారత, ఆత్మగౌరవానికి స్త్రీ శక్తి పథకం ఒక నిదర్శనంగా నిలిచింది. ఒకప్పుడు ప్రయాణం అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా భావించిన మహిళలకు ఇప్పుడు ఈ పథకం కొండంత అభయాన్ని ఇస్తోంది.











