కలియుగ దైవం తిరుమల శ్రీవారి లడ్డూ తయారీ నెయ్యి కల్తీ విషయంలో ఏం జరిగిందో మొత్తం ప్రజల ముందుకు రానుంది. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యిని ఏఆర్ డెయిరీ సప్లయి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే శ్రీవారి లడ్డూ తయారీకి అవసరమయ్యే నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం ఏఆర్ సంస్థకి లేదనేది ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. ఇందుకు సంబంధించి గతంలో టెండర్లు ఖరారు చేసే సమయంలోనే టీటీడీ టెక్నికల్ కమిటీ నిర్దారించిన డాక్యుమెంట్స్ వెలుగులోకి వస్తున్నాయి. ఏఆర్ డెయిరీకి ఉత్పత్తి సామర్థ్యమే కాదు కదా నిల్వ చేసే ఫెసిలిటీస్ కూడా ఏఆర్ డెయిరీకి లేవని తెలుస్తోంది. పేరుకు ఏఆర్ డెయిరీ నుంచి నెయ్యితో బయలుదేరే లారీలు మధ్యలో ఎక్కడికో పోయి నెయ్యి నింపుకుని వారం పది రోజుల తర్వాత తిరుమలకు వస్తున్నాయి. ఆ నెయ్యి ఎక్కడ నింపుకుంటున్నారన్నదానిపై కీలక విషయాలు త్వరలోనే బయటికి రానున్నాయి.
కల్తీనెయ్యి వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఏఆర్ డెయిరీకి నోటీసులు జారీ చేసింది. సోదాలు చేసి కనీస ఆహార భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని తేల్చి లైసెన్స్ రద్దు చేయాలని నోటీసులు జారీ చేసింది. అలా జారీ చేసిన నోటీసులపై మధురై హైకోర్టు బెంచ్ ను ఆశ్రయించారు ఏఆర్ సంస్థ ఎండీ. ఆ సంస్థ ఎండీ బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇంత జరిగిన నేపథ్యంలో ఇప్పుడు అసలు ఏఆర్ డైరీ వెనుక ఎవరు ఉన్నారో మొత్తం బయటకు రానుంది. కల్తీ నెయ్యి కాంట్రాక్టు కోసం అడ్డగోలు టెండర్లను కూడా మార్చినట్టుగా సిట్ ప్రాథమిక విచారణలో తేలినట్టు తెలుస్తోంది. త్వరలోనే కోర్టులో ఇవన్నీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్టు తెలిసింది. సిట్ దర్యాప్తులో ఇప్పటికే కీలకమైన విషయాలను రాబట్టిన నేపథ్యంలో.. సుప్రీంకోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పు మేరకు ప్రత్యేక విచారణ కమిటీ గతంలో సిట్ సేకరించిన విషయాలతోపాటు మరికొన్ని అంశాలను బహిర్గతం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
లడ్డూ ప్రసాదం తయారీ కోసం ఐదు లక్షల కిలోల ఆవునెయ్యి కొనుగోలుకు 2023 అక్టోబరులో టీటీడీ టెండర్ పిలిస్తే.. చిత్తూరు జిల్లాలోని వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్ రివర్స్ టెండరింగ్‌లో కిలో రూ. 428.04కి కోట్ చేసి ఎల్1గా నిలిచింది. అదే టెండర్‌లో ఏఆర్ డెయిరీ ఫుడ్స్ కిలోకు రూ. 432.96 కోట్ చేసి ఎల్3గా నిలిచింది. నిబంధనల ప్రకారం ఎల్1గా ఉన్న.. వైష్ణవి డెయిరీ కోట్ చేసిన ధరకు నెయ్యి సరఫరా చేస్తే 35 శాతం ఆర్డర్ ఇస్తామని టీటీడీ ఏఆర్ డెయిరీ సంస్థకి చెప్పినప్పటికీ.. ఆ సంస్థ నెయ్యి సరఫరాకి ముందుకు రాలేదు.
ఆ ధరకు తాము సరఫరా చేయలేమని 2023 నవంబరు 25న ఏఆర్ డెయిరీ సంస్థ స్పష్టం చేసింది. ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో.. అదే ఏఆర్ సంస్థ నాలుగు నెలలు తిరక్కుండానే 2024 మార్చిలో టీటీడీ పిలిచిన టెండర్లలో పాల్గొని.. నెయ్యి ధరను కిలో రూ. 320 చొప్పున కోట్ చేసి.. 10 లక్షల కిలోల నెయ్యి సరఫరాకు కాంట్రాక్ట్ దక్కించుకుంది. నాలుగు నెలల ముందు కిలో రూ. 428కి కూడా ఇవ్వలేమన్న సంస్థ.. ఆ తరువాత నాలుగు నెలలకే రూ. 320కే స్వచ్ఛమైన నెయ్యిని ఎలా సరఫరా చేయగలదనేది అందరిని తొలుస్తున్న సందేహం.
కల్తీనెయ్యి వ్యవహారంపై వివరాలను సేకరించిన టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి నెల్లూరులో ఇందుకు సంబంధించిన కొన్ని విషయాలను బయటపట్టారు. 2023 ఫిబ్రవరిలో వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా ఉండగా.. అహ్మద్‌నగర్‌కు చెందిన మాల్గంగా మిల్క్ అండ్ ఆగ్రో ప్రొడక్ట్స్ సంస్థకు కిలోకి రూ. 496.90 చొప్పున పది లక్షల కిలోల ఆవు నెయ్యి సరఫరాకు టీటీడీ ఆర్డర్ ఇచ్చిందని తెలిపారు. ఆ తరువాత 2024 మార్చిలో భూమన కరుణాకరరెడ్డి హయాంలో ఏఆర్ డెయిరీకి కిలో రూ. 320 చొప్పున పది లక్షల కిలోల నెయ్యి సరఫరాకు కాంట్రాక్ట్ ఇచ్చారు.
ఏడాది కాలంలో నెయ్యి ధర రూ. 496 నుంచి రూ. 320కి పడిపోతుందా? కిలో రూ. 496కి కాంట్రాక్ట్ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి తప్పు చేశారా? లేకపోతే రేటు తగ్గించి భూమన తప్పు చేశారా? ఇద్దరిలో దొంగ ఎవరు? అవన్నీ బయటకు రావాలనే సిట్ వేశామని ఆనం మాట్లాడారు. వైష్టవి డెయిరీ నుంచి ఈ ఏడాది జులై 2న ‘ఏపీ 26 టీసీ 4779’ నంబరు గల ట్రక్కు 151889406707 వేబిల్లు నంబరుతో బయల్దేరిందని.. ఆ ట్రక్కులోనే తిరుమలకు చేర్చాల్సిన నెయ్యి ఉందని.. అయితే 50 కి.మీ. దూరంలోని తిరుమలకు వెళ్లాల్సిన ఆ ట్రక్కు డ్రైవర్‌కు గూగుల్ మ్యాప్‌లో దారి తప్పుగా చూపించినట్టుందని చెబుతూ.. అదికాస్త కృష్ణగిరి, సేలం మీదుగా 508 కి.మీ. ప్రయాణించి దిండిగల్‌లోని ఏఆర్ ఫుడ్స్‌కు చేరిన తరువాత.. అదే ట్రక్కు కొత్త వేబిల్లు నంబరు 511673446306తో జులై 4న 3.27 గంటలకు ఏఆర్ ఫుడ్స్ నుంచి బయల్దేరి తిరుమలకు చేరుకుందన్నారు.
ఏఆర్ ఫుడ్స్ సంస్థ వైష్ణవి ఫుడ్స్ వంటి డెయిరీల నుంచి నెయ్యి కొని.. కొత్త వేబిల్లులతో టీటీడీకి పంపిస్తోందని కాదా అని ఆనం ప్రశ్నించారు. ఇటువంటి పలు విషయాలు.. ఏఆర్ డెయిరీ గుట్టు మొత్తం త్వరలోనే బహిర్గతం కానుంది.











