‘బాహుబలి’ తర్వాత రానా దగ్గుబాటి ఇమేజ్ ఎంతో పెరిగింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రానా సినిమాలు చేస్తున్నరు. తాజాగా రానా హీరోగా ప్రభు సాల్మన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘అరణ్య’. మూడు భాషల్లో విడుదలైన ఈ సినిమాలో మరో లీడ్ పాత్రను విష్ణు విశాల్ పోషించారు. పోస్టర్లు చూడగానే అడవి మనిషిగా రానా వైవిధ్యమైన పాత్ర పోషించారని అర్థమైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు తదతర అంశాలు తెలుసుకుందాం.
కథలోకి వెళితే..
ఈ భూమినీ, ఈ భూమ్మీద పర్యావరణాన్నీ అడవులు, జంతువులు ఎలా పరిరక్షిస్తున్నాయో తెలియజెప్పడమే ఈ చిత్ర కథాంశం. అడవుల నరికి వేత వల్ల పర్యావరణానికి ఎంత హాని జరుగుతుందనే ప్రయత్నాన్ని కొంత కమర్షియల్ కోణాన్ని జోడించి దర్శకుడు చెప్పారు. విశాఖ సమీపంలోని చిలకల కోన అడవిలో కథ జరుగుతుంది. అక్కడ ఏనుగుల్ని రక్షించే కుటుంబంలో పుట్టిన నరేంద్ర భూపతి (రానా) అడవులు, ఏనుగుల రక్షణ కోసం కృషి చేసినందుకు అతనికి రాష్త్రపతి పురస్కారం కూడా దక్కుతుంది.
అతను అరణ్యగా అడవుల్లోనే జంతువులతో మమేకమవుతూ జీవితం గడుపుతుంటాడు. కేంద్ర అటవీ శాఖ మంత్రి కనకమేడల రాజగోపాలం (అనంత్ మహదేవ్) కన్ను ఈ అడవిపై పడుతుంది. ఈ ప్రాంతంలో టౌన్ షిప్ కట్టడానికి ప్లాన్ చేస్తాడు. అతని ప్రయత్నాలను అరణ్య అడ్డుకుంటాడు. ఆ టౌన్ షిప్ కోసం ఏనుగులు నీటి కోసం వెళ్లే ప్రాంతానికి అడ్డుగా గోడ కట్టిస్తాడు. మంత్రి చర్యలను అడ్డుకోడానికి అరణ్య ఏంచేశాడు? ఈ పోరాటంలో చివరికి ఎవరిది విజయం అన్నదే ఈ సినిమా.
ఎలా తీశారు? ఎలా చేశారు?
అరణ్యగా రానా నటన, ఫొటోగ్రఫీ, ఏనుగుల విన్యాసం వెరసి ఈ అరణ్య సినిమా. అరణ్య పాత్రలో రానా ఒదిగిపోయాడు. ఒడ్డూ పొడుగూ, నడక తీరు అడవి మనిషిలానే ప్రవర్తించాడు. ఓ మనిషికి ఏనుగులతో ఇలాంటి అనుబంధం కూడా ఉంటుందా అనేలా దర్శకుడి చిత్రీకరణ సాగింది. దర్శకుడు ప్రభుసాల్మన్ ‘కుంకి’ కూడా ఏనుగుల నేపథ్యంతో కూడిన కథాంశమే. ఏనుగుల మీద ఈ దర్శకుడికి ఎందుకు ఇలాంటి అనుబంధం ఉందో తెలియదు. చక్కటి సందేశాన్ని దర్శకుడు ఈ సినిమా ద్వారా ఇచ్చాడు.
గోడ కట్టడానికి మంత్రి కుమ్కీ ఏనుగు శింగన్న (విష్ణు విశాల్) సాయం తీసుకుంటాడు. అతను నక్సలైట్ మల్లి (జోయా)తో ప్రేమలో పడతాడు. వీరి ప్రేమ కథ అసంపూర్తిగా ముగిసినట్టు ఉంటుంది. సినిమా ప్రథమార్థం ఆసక్తికరంగా సాగుతుంది. మెట్రో మార్గంలో ఫైట్, ఫారెస్ట్ ఆఫీసులో ఫైట్ తో సినిమా గ్రిప్పింగ్ గా సాగింది. ఇంటర్వెల్ తర్వాత కథనంలో వేగం తగ్గింది. శింగన్న పాత్ర, మల్లి పాత్ర ఏమయ్యాయో అర్థమ కాదు. ఈ పాత్రల నిడివిని కావాలనే తగ్గించారన్న భావన కలుగుతుంది. పాటల రచయిత వనమాలి ఈ సినిమా ద్వారా మాటల రచయితగా కూడా మారారు. సందర్భోచితంగా డైలాగులు పండాయి.
ఏనుగులుంటేనే మనిషికి మనుగడ అనేలా డైలాగులు ఉంటాయి. చెట్లు ఈ భూమిని ఎంతలా కాపాడుతున్నాయో మాటల ద్వారానే చెప్పారు. అశోక్ కుమార్ కెమెరా పనితానన్ని కూడా మెచ్చుకోవాలి. అడవి అందాలను చక్కడా ఒడిసి పట్టారు. పాటలకు ఈ సినిమాలో అంతగా ప్రాధాన్యం లేదు. చిటికేసే ఆ చిరుగాలి పాట చిత్రీకరణ ఆకట్టుకుంటుంది. శంతను మొయిత్రా నేపథ్య సంగీతం బాగుంది. జంతువులకూ, మనిషికీ మధ్య ఉండే భావోద్వేగాలను దర్శకుడు చక్కగా పండించగలిగారు.
నటీనటులు: రానా, విష్ణు విశాల్, జోయా హుస్సేన్, రఘుబాబు, పులకిత్ సామ్రాట్, అనంత్ మహదేవ్ తదితరులు.
సాంకేతికవర్గం: సంగీతం: శంతన్ మొయిత్రా; సినిమాటోగ్రఫీ: ఎ. ఆర్. అశోక్‌కుమార్, ఎడిటింగ్: భువన్ శ్రీనివాసన్,
మాటలు, పాటలు: వనమాలి
రచన – దర్శకత్వం: ప్రభు సాల్మన్;
నిర్మాణం: ఏరోస్ ఇంటర్నేషనల్
విడుదల తేదీ : 26-03-2021
ఒక్కమాటలో: సందేశాత్మక ప్రయత్నం
రేటింగ్: 2.75/5