రానా రానా అంటూ ఊరిస్తున్న ‘అరణ్య’ రానే వచ్చేస్తున్నాడు. దగ్గుబాటి రానాకు చాలా కాలం తర్వాత మళ్లీ ఓ వైవిధ్యమైన పోషించే అవకాశం ‘అరణ్య’లో వచ్చింది. బాహుబలిలో ప్రభాస్ ను ఢీకొన్న రానా ‘అరణ్య’లో ఓ వ్యవస్థపైనే పోరాటడబోతున్నాడట. ప్రభు సాల్మన్ దర్శకత్వంలో ‘అరణ్య’ తెరకెక్కింది. ఈ సినిమా ట్రైలర్ ను ఈరోజు విడుదల చేశారు. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో ఇంకా విష్ణువిశాల్, జోయాహుస్సేన్ కూడా ప్రధాన పాత్రల్ని పోషించారు.
లాక్డౌన్ కారణంగా వాయిదాపడిన ఈ సినిమాను మార్చి 26న విడుదల చేయబోతున్నారు. అరణ్య ట్రైలర్ చూస్తుంటే ఓ కొత్త తరహా కథాంశంతో తెరకెక్కినట్టు స్పష్టమవుతోంది. రానా గెడ్డంతో ఆటవికుడి మాదిరిగా కనిపిస్తున్నాడు. 25 ఏళ్లుగా అరణ్యంలో జీవించే వ్యక్తిగా రానా నటించాడట. కార్పొరేట్ సంస్థల కుట్రలపై పోరాడే వ్యక్తి కథతో ఈ సినిమా తెరకెక్కింది. అడవుల నరికివేత, పర్యావరణంపై దాని ప్రభావం లాంటి కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.
మాస్ మసాలా కథకు అంతర్లీనంగా సందేశం ఉండేలా రూపొందించారు. దీనికి శంతను మొయిత్రా సంగీతం సమకూర్చారు. ఈ సినిమాలో రానా పాత్ర ఎలా ఉండబోతుందో ఇంతకుముందు టీజర్ లోనే చెప్పేశారు. అడవులు, ఏనుగులు, పులులు ఈ సినిమాలో ఉండటంతో పాటు మానవ మృగాలను వేటాడే అరణ్య పాత్రను రానా పోషించాడు. అడవులకూ అతనికీ ఏమిటి సంబంధం అనేది మాత్రం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.