అప్పటివరకు ఎక్కడ ఉంటారో తెలీదు. ఒక్కసారిగా వెలుగులోకి వస్తారు. ఎంత టాలెంట్ ఉన్నా.. మరెంత ఫైర్ ఉన్నా.. కొన్నిసార్లు సరైన ఎలివేషన్ రాదు. అలాంటి వారికి ఒక్కోసారి వారి టైం వచ్చేస్తుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితే నెలకొంది. ఇప్పటివరకు తెలంగాణ బీజేపీ అంటే.. బండారు దత్తాత్రేయ.. లక్ష్మణ్.. కాదంటే కిషన్ రెడ్డి. వీరి ఓఎస్ కు భిన్నంగా బండి సంజయ్ తీరు ఉంటుంది. వారంతా సాఫ్ట్ వేర్ అయితే.. ఈయన అసలుసిసలు హార్డ్ వేరు లెక్కన కనిపిస్తారు.
తాజాగా.. సాఫ్ట్ వేర్.. హార్డ్ వేర్ రెండింటి కాంబినేషన్ లో మహా టిపికల్ ఫార్మాట్ తో కొత్త ఫైర్ బ్రాండ్ ప్రజలకు పరిచయమైంది. ఆయనే.. నిజామాబాద్ ఎంపీ అర్వింద్. కల్వకుంట్ల ఫ్యామిలీకి దిమ్మ తిరిగే షాకిచ్చిన అతి కొద్దిమందిలో ఆయన ఒకడిగా చెబుతారు. ఏడాదిన్నర క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితను దారుణంగా ఓడించి.. అందరి చూపు తన మీద పడేలా చేసుకున్నారు.
అంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికి ఆయనకు దక్కాల్సిన పేరు ప్రఖ్యాతులు పెద్దగా రాలేదు. తన పనేమిటో తాను అన్నట్లుగా ఉండేవారు. అలాంటి ఆయన దుబ్బాక ఉప ఎన్నిక పుణ్యమా అని.. ఫేమ్ లోకి వచ్చారు. కణకణలాడే నిప్పు కణికల్లాంటి మాటలు.. కేసీఆర్.. కేటీఆర్.. హరీశ్.. ఇలా ఎవరిని డోంట్ కేర్ అన్నట్లుగా మాట్లాడుడే కాదు.. అటు ఇంగ్లిషులో.. ఇటు తెలుగులో.. అవసరానికి తగ్గట్లు హిందీలో దంచి పడేస్తూ.. కేసీఆర్ ఫ్యామిలీ మీద తీవ్ర వ్యాఖ్యల్ని సింఫుల్ గా చేసే తీరు.. సరికొత్తగా ఉండటమే కాదు.. ఆయన మాట్లాడిన చిట్టి వీడియోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.
వేదిక ఏదైనా కానీ.. ఏదో ఒక సందర్భంలో కేసీఆర్ ఫ్యామిలీ మొత్తాన్ని తెర మీదకు తీసుకురావటం.. దుమ్మ దులిపినట్లుగా విమర్శలు.. ఆరోపణలతో విరుచుకుపడే ఆయన తీరు తెలంగాణలో తాజా సంచలనంగా చెప్పాలి. ఇంత దూకుడుగా మాట్లాడిన నేతగా అరవింద్ మారారు. కేసీఆర్ ఫ్యామిలీ పైన పదునైన విమర్శలు చేయాలంటే అరవింద్ తర్వాతే ఎవరైనా అన్నట్లుగా పరిస్థితి మారింది. దుబ్బాక ఉప ఎన్నికల వేళ.. తన ఇంటికి వచ్చిన పోలీసులతో.. సీఎం కేసీఆర్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు విన్న వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు.
జంకు బొంకు లేకుండా.. మాట్లాడిన మాటలు చూస్తే.. తెలంగాణ రాజకీయాల్లోకి కొత్త నీరు వచ్చిందన్న అభిప్రాయం కలుగక మానదు. అరవింద్ లోని విలక్షణత ఏమంటే.. కేసీఆర్ మాటల్లో కనిపించే ఎటకారం.. అంతకు మించిన దర్పం.. కేటీఆర్ లో కనిపించే ఇంగ్లిష్ ఫ్లూయెన్సీ.. హరీశ్ లో కనిపించే దూకుడు.. కలగలిపినట్లుగా అరవింద్ ఉండటంతో ఆయన మాటలు తెలంగాణ ప్రజలకు సరికొత్తగా మారాయి.
దీనికి తోడు.. కేసీఆర్ ఫ్యామిలీ అంటూ కేసీఆర్.. కేటీఆర్.. హరీశ్.. కవిత.. సంతోష్ ఇలా ఎవరిని వదలకుండా.. విమర్శలు చేసే విషయంలో.. జాలి అన్న మాటే లేదన్నట్లుగా ఆయన మాటల్లో కఠినత్వం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి.. ఘాటుగా వ్యాఖ్యలు చేయాలంటే చాలానే హోం వర్కు చేయాలి. అలాంటిది అరవింద్ మాత్రం అలాంటిదేమీ లేదన్నట్లు.. చాలా సింఫుల్ గా అనాల్సిన మాటను అనేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
సాధారణంగా గులాబీ అధినేతలు.. వారి కుటుంబ సభ్యులకు ఒక అలవాటు ఉంది. తమను టార్గెట్ చేసిన వారికి.. తమదైన శైలిలో చుక్కలు చూపిస్తుంటారు. కానీ.. అరవింద్ విషయంలో అలాంటి పప్పులు ఉడకవని అంటున్నారు. దీనికి తగ్గట్లే.. ఇన్నిసార్లు అరవింద్ తమపై విరుచుకుపడినా.. తమకు సంబంధించిన పలు అంశాల్ని ప్రస్తావించినా.. ఆయన ఊసు ప్రస్తావించటానికి సైతం ఇష్టపడని తీరు కనిపిస్తుంది. అరవింద్‌ను ఉద్దేశించి.. ఏ చిన్న మాట అన్నా.. దానికి సమాధానం చెప్పేందుకు చేసే ప్రయత్నం.. తమను మరింత డ్యామేజ్ చేస్తుందన్న ఉద్దేశమే అన్న మాట అరవింద్ వర్గీయులు చెబుతుంటారు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. దుబ్బాక ఉప ఎన్నిక.. బీజేపీకి ఇచ్చిన సరికొత్త ఆయుధం అరవింద్ అని చెప్పక తప్పదు.