ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ … వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ అంటేనే అదో క్రేజీ ప్రాజెక్ట్. త్వరలోనే వీరి కాంబినేషన్ లో మూవీ పట్టాలెక్కబోతోంది. ఇది అధికారిక వార్తే. మూడేళ్ల క్రితం ‘అల వైకుంఠపురములో’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అంతకుముందు జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చేశారు. తాజాగా నాలుగో ప్రాజెక్ట్ ను ప్రకటించారు. గీతా ఆర్ట్స్, హారిక హాసిన్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈరోజు ఉదయం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు.
పుష్ప తర్వాత అల్లు అర్జున్ పుష్ప 2 చేస్తున్న సంగతి తెలిసిందే. అర్జున్ ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్ కాబట్టి ఈ సినిమా కూడా ఆ స్థాయిలోనే తెరకెక్కబోతోందని సమాచారం. ఇందులో కూడా పూజా హెగ్డే హీరోయిన్ అని తెలుస్తోంది. నటీనటులు ఎవరన్నది త్వరలో ప్రకటిస్తామని నిర్మాణ సంస్థలు వివరించాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ – మహేష్ మూవీ షూటింగ్ దశలో ఉంది. కారణం ఏదైనాగానీ పూజ గుంటూరు కారంలో ఛాన్స్ మిస్సయ్యింది. ఆమెకు న్యాయం చేద్దామనే ఆలోచనలో గురూజీ ఉండి ఇందులో మళ్లీ అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం.
‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేష్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో గుంటూరు కారం రూపొందుతోంది. ప్రస్తుతం శంకరపల్లిలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అక్టోబరు నెలాఖరుకల్లా ఈ సినిమా షూటింగ్ ను పూర్తిచేసే పనిలో ఉన్నారు. సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయాలన్నది ప్లాన్. అల్లు అర్జున్ పుష్ప-ది రూల్ కూడా షూటింగ్ దశలోనే ఉంది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో కూడా అల్లు అర్జున్ సినిమా చేయాల్సి ఉంది.
ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా ప్రకటన వచ్చింది కాబట్టి వచ్చే ఏడాది సందీప్ రెడ్డి సినిమా ప్రారంభయ్యే అవకాశం ఉంది. త్రివిక్రమ్ చేయబోయే సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అన్న సందేహం ఉంది. అల వైకుంఠపురములో మ్యూజికల్ గా బ్లాక్ బస్టర్ హిట్ కాబట్టి మళ్లీ థమన్ కే ఛాన్స్ దక్కవచ్చు. పైగా గుంటూరు కారం నుంచి థమన్ ను తప్పించినట్టు వార్తలొచ్చాయి. తనను నమ్ముకున్నవాళ్లకు గురూజీ న్యాయం చేస్తారు కాబట్టి థమన్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది.