అతని సినిమా టైటిల్స్ అన్నీ కొత్తగానే ఉంటాయి. కథలు కూడా అంతే.. ఇలాంటి ప్రయోగాలతో ముందుకు వెళుతున్న హీరో శ్రీవిష్ణు ఈసారి ‘అర్జున ఫల్గుణ’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తేజ మర్ని దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథలోకి వెళితే..
పేరు చూడగానే వాహ్వా అనిపిస్తోంది. ఉరుములు పిడుగులు పడితే ధైర్యం కోసం పలికే పదాలే అర్జున, ఫల్గుణ. అసలీ అర్జున ఎవరో చూద్దాం. ఇది గోదావరి జిల్లాలోని ములకలలంక అనే గ్రామంలో జరిగే కథ. ఆ ఊళ్లో ఉండే అర్జున్ (శ్రీవిష్ణు), శ్రావణి (అమృతా అయ్యర్), రాంబాబు (రాజ్‌కుమార్), తడ్డోడు (రంగస్థలం మహేష్), అస్కర్ (చైతన్య గరికిపాటి) ఈ కథకు హీరోలు. డిగ్రీ చదివి జీరోలుగా ఊళ్లో తిరుగుతుంటారు. తాము ఏంచేసినా ఊళ్లోనే ఉండి చేయాలనుకుంటారు. చివరికి ఓ సోడా కంపెనీ పెట్టాలనే దగ్గర వారి ఆలోచనలు ఆగిపోతాయి.
దాని కోసం నాలుగు లక్షలు కావాలి. అంత డబ్బులేదు.. మరి ఏంచేయాలి? ఇంకో పక్క వీరిలో ఒకరికి అప్పుల బాధ. ఆఖరికి అతని ఇల్లు జప్తు చేసేదాకా పరిస్థితి వెళుతుంది. వీటి నుంచి బయటపడాలంటే సులభంగా డబ్బు సంపాదించడం తప్ప మరో మార్గం లేదు. అందుకే గంజాయి స్మగ్గింగ్ చేయాలనుకుంటారు. ఆ ప్రయత్నాల్లో అందరూ చిక్కుల్లో పడతారు. ఒక్క సారిగా జీవితం తిరగబడుతుంది. ఓ పక్క పోలీసులు, ఇంకో పక్క గూండాలు తరుముతుంటే పారిపోక తప్పని పరిస్థితి. దీన్నుంచి వారు ఎలా బయటపడ్డారు అన్నది తెర మీద చూడాల్సిందే.
ఎలా తీశారు? ఎలా చేశారు?
ఎలాంటి కథ అయినా కథనం బాగుంటేనే జనం చూస్తారు.. లేకుంటే చస్తారు. కథ, కథనం విషయంలోనే దర్శకుడు తేజ మర్ని తడబడ్డాడు. ఒక్క అవకాశం వస్తే చాలనేలా ఎంతో మంది తపిస్తున్నారు. అలాంటి వచ్చిన అవకాశాన్ని దర్శకుడు ఎందుకు సద్వినియోగం చేసుకోలేకపోయాడా అని అనిపిస్తుంది. ముఖ్యంగా లాజిల్ లేకుండా నడిచే సన్నివేశాలే అధికంగా కనిపిస్తాయి. ఒక్క విషయంలో మాత్రం దర్శకుడిని అభినందించాలి. ఇలాంటి కథతో హీరోని ఎలా కన్విన్స్ చేశాడా అనిపిస్తుంది.
ఆయన కన్విన్స్ చేసినా కథల ఎంపికలో జాగ్రత్తగా ఉండే శ్రీవిష్ణు ఎలా అంగీకరించాడు అని కూడా అనిపిస్తుంది. పల్లె టూళ్లో ఉండే వాలంటీర్, కోడి కత్తి లాంటి కరెంట్ టాపిక్స్ ను దృష్టిలో ఉంచుకుని కథనను తయారుచేశారేమో. పేక్షకుల ఊహకు అందకుండా కథ సాగితేనే గ్రిప్పింగ్ గా ఉంటుంది. ఇందులో అవేమీ కనిపించవు. అర్జున్ గా శ్రీవిష్ణు మాత్రం తన పాత్రకు న్యాయం చేశాడని చెప్పాలి.
హీరోయిన్ కు కూడా అంత ప్రాధాన్యం లేదు. డైలాగ్స్ పరంగానూ జాగ్రత్తలు తీసుకోలేదు. ఇతర టీమ్ ఎలా ఉన్నా హీరో శ్రీవిష్ణ అభిరుచి ఉన్న నటుడిగా ఈ సినిమా విషయంలో ఎందుకు ఇన్వాల్వ్ కాలేదో అర్థం కాదు. నటుడిగా మంచి హిట్లు అతని ఖాతాలో ఉన్నాయి. ఈ సినిమా వాటి సరసన చేరుతుందేమో అని అందరూ ఆశించారు. కానీ ఇందులో చెప్పుకోతగ్గ అంశాలేమీ లేవు. క్లైమాక్స్ కూడా పేలవంగా ముగిసింది.
నటీనటులు: శ్రీవిష్ణు, అమృతా అయ్యర్, నరేష్, శివాజి రాజా, దేవి ప్రసాద్, సుబ్బరాజు, రాజ్ కుమార్, చైతన్య తదితరులు.
సాంకేతికవర్గం: సంగీతం: ప్రియదర్శన్, కెమెరా: జగదీష్, ఎడిటింగ్: విప్లవ్ నైషధం
నిర్మాణం: మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్
నిర్మాతలు: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
దర్శకత్వం: తేజ మర్ని
విడుదల తేదీ: 31-12-21
ఒక్క మాటలో: ఉరుములు మెరుపులు లేవు
రేటింగ్: 2/5