గ్లోబల్ మీడియా ప్రాజెక్టు కింద ప్రతి రాష్ట్రంలోని స్థానిక భాషల్లో త్వరలో రిపబ్లిక్ టీవీ ఛానల్స్ ప్రారంభించనున్నట్టు రిపబ్లిక్ మీడియా చీఫ్ ఎడిటర్ అర్ణాబ్ గోస్వామి ప్రకటించారు. ముంబాయిలో ఓ ఇంటీరియర్ డిజైనర్ కుటుంబం ఆత్మహత్య కేసులో అరెస్టైన అర్ణాబ్ గోస్వామికి 8 రోజుల తరవాత ఎట్టకేలకు బెయిల్ లభించింది. బుధవారం అర్థరాత్రి మహారాష్ట్రలోని తలోజా జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చిన గోస్వామికి జనం ఘన స్వాగతం పలికారు. రిపబ్లిక్ టీవీ ఉద్యోగుల సహకారంతో మరింత ఉత్సాహంతో పనిచేస్తానని బెయిల్ పై మొదటిసారిగా స్టూడియోకు వచ్చిన గోస్వామి స్పష్టం చేశారు.
ఆట ఇప్పుడే మొదలైంది
బెయిల్ పై విడుదలైన అర్ణాబ్ గోస్వామి రిపబ్లిక్ స్టూడియోలో ఉద్యోగులనుద్దేశించి ప్రసంగించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో, స్థానిక భాషల్లో ఛానల్స్ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ఆట ఇప్పుడే మొదలైందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు గమనిస్తుంటే అర్ణాబ్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశాన్ని కూడా తోసిపుచ్చలేం. రాబోయే సంవత్సరకాలంలోనే ప్రతి రాష్ట్రంలో రిపబ్లిక్ ఛానల్స్ ప్రారంభిస్తానని ఆయన వెల్లడించారు. జైలు నుంచి కూడా ఛానల్స్ ప్రారంభించగలను, మీరు నన్ను ఏమీ చేయలేరని పరోక్షంగా శివసేన నాయకులను ఉద్దేశించి అర్ణాబ్ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే 16 నెలల్లో రిపబ్లిక్ ఇంటర్నేషనల్ మీడియా ప్రాజెక్టును కూడా పట్టాలెక్కించనున్నట్టు ఆయన ప్రకటించారు. (ఇదీ చదవండి : అర్ణబ్ అరెస్టు ఎఫెక్టు తెలుసా)
ఇది ప్రజల విజయం
సుప్రీంకోర్టు ఆదేశాలతో తాను జైలు నుంచి విడుదల కావడం ప్రజా విజయమని అర్ణాబ్‌కు ఘనస్వాగతం పలికిన ప్రజలనుద్దేశించి ఆయన సమాధానం ఇచ్చారు. అర్ణాబ్ గోస్వామికి మధ్యంతర బెయిల్ మంజూరును తిరస్కరించి బొంబాయి హైకోర్టు తప్పుచేసినట్టు సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ఎట్టకేలకు 8 రోజుల తరవాత బెయిల్ రావడంతో, కోర్టు ఆదేశాల మేరకు రూ.50 వేల పూచీకత్తుతో బుధవారం అర్థరాత్రి అర్ణాబ్ తలోజీ జైలు నుంచి విడుదలయ్యారు.