‘ఊహలు గుసగుసలాడే, లక్ష్మీరావే మా ఇంటికి, కళ్యాణ వైభోగమే, జ్యో అత్యుతానంద’ లాంటి ఫ్యామిలీ డ్రామాస్ తో చాక్లెట్ బాయ్ గానే రివీల్ అయ్యాడు యంగ్ హీరో నాగశౌర్య. అయితే ‘ఛలో’ సినిమాతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించాడు ఈ కుర్రోడు. ఓన్ ప్రొడక్షన్ హౌస్ ఉన్నప్పుడు ఇటు లవర్ బాయ్ గా నటిస్తూనే.. అటు యాక్షన్ హీరోగానూ ట్రై చేయలేమా అనుకున్నాడో ఏమోగానీ.. సొంత నిర్మాణంలో ‘అశ్వథ్థామ’ సినిమా తీసి.. తనలోని యాక్షన్ యాంగిల్ ను బైటికి తీశాడు శౌర్య. సినిమా కాన్సెప్ట్ ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అవడంతో .. కుర్రోడికి కాస్తంత కాన్ఫిడెన్స్ వచ్చింది. దాంతో అతడు మరోసారి యాక్షన్ హీరోగా రాబోతున్నాడు. అయితే ఈ సారి మనోడు నటించేది బైట సంస్థ లో కావడం విశేషం.
శ్రీవెంకటేశ్వరా సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్త నిర్మాణంలో నారాయణ దాస్ కె నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు శరత్ మరార్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. టైటిల్ ఇంకా ఖాయం చేయని ఈ సినిమాకి దర్శకుడు సంతోష్ జాగర్లపూడి. ఈ మూవీలో నాగశౌర్య విలుకాడిగా కనించబోతున్నాడు. ఆర్చరీ నేపథ్యంలో సాగే ఓ యాక్షన్ కథతో సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం నాగశౌర్య ప్రత్యేకంగా ఆర్చరీలో శిక్షణ తీసుకుంటున్నాడు. నాగశౌర్య 20వ సినిమాగా రూపొందుతోన్న ఈ మూవీ లోని మేకోవర్ కోసం శౌర్య అహర్నిశలు కష్టపడుతున్నాడు.
ఆరుపలకల దేహంతో సినిమాలో కనిపించాలి కాబట్టి.. జిమ్ లో తెగ కష్టపడిపోతున్నాడు. సినిమా ఫస్ట్ లుక్ కోసం సిక్స్ ప్యాక్ బాడీతో షాకిచ్చిన నాగశౌర్య.. ఇటీవల మరోసారి స్టన్నింగ్ లుక్ తో కట్టిపడేశాడు. రీసెంట్ గా తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేసిన ఫోటో లో నాగశౌర్య లాంగ్ బియర్డ్ తో నెత్తిన కౌబాయ్ హ్యాట్ తో సిక్స్ ప్యాక్ బాడీతో ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో నాగశౌర్య ఏ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంటాడో చూడాలి.











