వైసీపీ జెండా పీకేసే సమయం వచ్చిందా..అంటే అవుననే అంటున్నారు మంత్రి అచ్చెన్నాయుడు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ కనీసం ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని, పరదాల చాటున యాత్రలు చేశారని సెటైర్లు వేశారు. ఇప్పుడు పార్టీ జెండా పీకేసే పరిస్థితి రావడంతోనే జగన్ పరామర్శల యాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
చిత్తూరు జిల్లా మామిడి రైతుల సమస్యను తాము రెండు నెలల క్రితమే గ్రహించి కిలో రూ.12 చొప్పున తోతాపురి మామిడి కొనుగోలుకు ఉత్తర్వులు జారీ చేశామన్నారు. ఇప్పటికే రైతుల నుంచి 80% కొని డబ్బులు కూడా చెల్లించామని, ఇప్పుడు జగన్ పరామర్శలంటూ శాంతిభద్రతల సమస్యలు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో మామిడి గత ఏడాది 2.5 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రాగా, ఈ ఏడాది 6.5 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగిందన్నారు. అంత ఉత్పత్తిని పల్ప్ కంపెనీలు కొనే పరిస్థితి ఉండదని గ్రహించి ముఖ్యమంత్రి రెండు నెలల ముందే కిలో మామిడిని రూ.12 చొప్పున కొనాలని ఆయా సంస్థలను ఆదేశించారని, రూ.4 రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడానికి సిద్ధమైందని వివరించారు. కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు అక్కడి మామిడి రైతులను గాలికొదిలేసినా, అక్కడ రూ.16కి కిలోకు కొంటున్నట్లుగా వైసీపీ తప్పుడు ప్రచారం చేసిందని మండిపడ్డారు.
అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా సంపాదించిన అవినీతి సొమ్మును వెదజల్లి జన సమీకరణ చేసి జగన్ యాత్రలు చేస్తున్నారని మండిపడ్డారు అచ్చెన్న. 7 జిల్లాల నుంచి జనాన్ని సమీకరించి 800 బస్సులు, 2,000 కార్లతో దండయాత్ర చేయడానికి సమాయత్తమవుతున్నారని..రైతులను పలకరించడానికి 25 వేల మంది అవసరమా.? అని ప్రశ్నించారు. కరేడు భూసేకరణ విషయంలో ప్రభుత్వం మూర్ఖంగా ముందుకెళ్లదని, రైతులతో మాట్లాడి శాంతియుతంగా సమస్య పరిష్కరించడానికే ప్రయత్నిస్తామన్నారు అచ్చెన్నాయుడు.











