అమరావతి రాజధాని ఉద్యమం కొత్త మలుపులు తిరుగుతోంది. మొగుణ్ని కొట్టి మొగసాల కెక్కినట్టు.. వాళ్లే మహిళా రైతులపై రాళ్లు వేసి, దూషించి .. మూడు రాజధానుల శిబిరంపై రాజధాని రైతులు రాళ్లు రువ్వారని, ఎంపీ నందిగం సురేష్‌ను దళితుడంటూ దూషించారంటూ తుళ్లూరు స్టేషన్లో కొందరు దళితులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు 20 మంది రాజధాని రైతులపై అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. రాజధాని మహిళా రైతులపై ఉద్దండరాయునిపాలెంలో రాళ్లు రువ్విన వారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించి అరెస్టు చేయాలని అమరావతి రైతులు తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైతుల ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు ఎట్టకేలకు, లేటుగా కేసు నమోదు చేశారు. తాజాగా రైతులపై కూడా దళితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
17వ తేదీన భారీ బహిరంగ సభ
రాజధాని ఉద్యమం ప్రారంభించి డిసెంబరు 17 తేదీ నాటికి 365 రోజులు పూర్తి కానుంది. ఈ సందర్భంగా అమరావతి రాజధానికి పునాది వేసిన ఉద్దండరాయునిడిపాలెంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని అమరావతి జేఏసీ నిర్ణయించింది. వామపక్షాలు, టీడీపీ జేఏసీకి మద్దతు పలికాయి. ఈ నెల 17న పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని అమరావతి రైతులు సిద్దమవుతున్నారు. అమరావతి రాజధాని ఉద్యమానికి ఏడాది అవుతున్న సందర్భంగా ఈ నెల 15న విజయవాడలో అమరావతి జేఏసీ భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి పోలీసులు అనుమతిస్తారా లేదా అనేది సందేహంగా మారింది.
Must Read ;- రైతులపై ప్రేమా.. ఎన్నికల డ్రామానా? : వీర్రాజు నోట అమరావతి మాట
రాళ్లు రువ్వి .. మాపైనే కేసులు పెడతారా?
అమరావతి ఉద్యమం డిసెంబరు 17 నాటికి సంవత్సరం కానున్న సందర్భంగా మహిళా రైతులు ఉద్దండరాయునిపాలెంలో పర్యటిస్తుండగా వారిపై కొందరు చీకట్లో రాళ్లు రువ్వారు. ఈ దాడిలో కొందరు రాజధాని మహిళా రైతులు గాయపడ్డారు. 24 గంటల పాటు రోడ్డుపైనే భైటాయించి నిరసన తెలిపారు. తుళ్లూరు, అమరావతి రోడ్డును బ్లాక్ చేశారు. మాజీ మంత్రులు పుల్లారావు, నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, టీడీపీ నేత శ్రావణ్ కుమార్ మహిళా రైతులకు మద్దతుగా ఉద్యమంలో పాల్గొనడంతో పోలీసులు దిగి వచ్చారు. ఎట్టకేలకు మహిళలపై రాళ్లు రువ్విన వారిపై కేసు నమోదు చేశారు. కానీ ఇంత వరకు ఒక్కరిని కూడా అరెస్టు చూపకపోవడంపై రైతులు ఆందోళనకు సిద్ధం అవుతున్నారు. ఈ తరుణంలో అమరావతి రైతులు తమను దూషించారంటూ 20 మంది రైతులపై అట్రాసిటీ కేసులు నమోదు చేయించారు. దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు అమరావతి మహిళా రైతులపై రాళ్లు రువ్విన విషయంలో ఇంత వరకు ఎవరినీ అరెస్టు చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
ఢిల్లీ తరహాలో అమరావతి ఉద్యమం
అమరావతి ఉద్యమ్యాన్ని కూడా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమం తరహాలో చేయాలని రాజధాని రైతులు భావిస్తున్నారు. 365 రోజుల కార్యక్రమాలు పూర్తయిన తరువాత ఢిల్లీ స్థాయిలో అమరావతి ఉద్యమం నిర్వహించేలా ఫ్రణాళికపై అమరావతి రైతు జేఏసీ చర్చించనుందని తెలుస్తోంది. ఆ తర్వాత ఉద్యమ కార్యాచరణ ప్రకటించన్నారు.
Also Read ;- అమరావతి పోరాటానికి ‘ఎండ్ కార్డ్’ వేసే కుట్ర!