ఏపీలో వైసీపీ వింత పోకడలు విస్తుగొల్పుతున్నాయి.మూడేళ్ళ కిందట ప్రారంభించిన ఓ ఆసుపత్రిన తిరిగి ప్రారంభించడం పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.తమ గొప్పల కోసం గతంలో ఎన్నడూ లేని సంస్కృతిని తెరపైకి తెచ్చి మళ్ళీ విద్వంశాల పరంపరను కొనసాగిస్తోంది వైసీపీ.
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 24 కోట్ల రూపాయలు వెచ్చించి 200 పడకల ఆసుపత్రిని నిర్మించింది. అప్పట్లోనే అది జిల్లా కేంద్ర ఆసుపత్రిగా కూడా అప్ గ్రేడ్ అయ్యింది. 2019లో అప్పటి మంత్రి , స్థానిక ఎమ్మెల్యే అయిన కింజరాపు అచ్చెన్నాయుడు దానిని ప్రారంభించారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆసుపత్రిని పునఃప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది.
నిజానికి 2019 నాటికే ఆసుపత్రికి సంభంధించిన భవనాల నిర్మాణం పూర్తి అవ్వడంతో పాటు అన్ని రకాల వసతులు అందుబాటులోకి వచ్చాయి. అయితే దీనిని వినియోగించుకుని వైద్య సేవలు అందించడంలో వైద్య విధాన పరిషత్ అధికారులు మాత్రం పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. దీంతో అప్పటి నుంచి ఆసుపత్రి నిరుపయోగంగానే ఉండిపోయింది. వాడకం లేకపోవడంతో ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన పరికరాలు కూడా పాడైపోయే స్థితికి వచ్చాయి. దీంతో ప్రజా ధనం దుర్వినియోగం అవుతోందనే వాదన ప్రజల నుంచి బలంగా వినిపించింది.
ఇదిలా ఉంటే తాజాగా ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేతుల మీదుగా ఆసుపత్రిని మళ్ళీ ప్రారంభించడానికి అధికారులు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మరో అడుగు ముందుకు వేసి ప్రభుత్వ హయాంలో ప్రారంభోత్సవం చేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు.అయితే ఇదంతా రాజకీయ ఒత్తిడి మేరకే జరిగిందనే అభిప్రాయాలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి. కేవలం టిడిపి హయంలో ఏర్పాటుచేశారనే అక్కసుతో ఎమ్మెల్సీ దువ్వాడ ఇటువంటి చర్యలకు అధికారులను ప్రేరేపించారనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే అధికారులు కూడా మెప్పు కోసం ఇటువంటి చర్యలకు పాల్పడ్డారని కొందరు చర్చించుకుంటున్నారు.
అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక ప్రభుత్వం హయంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మరొక ప్రభుత్వం ద్వంశం చేయడం అనేది ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.
Must Read:-రేషన్ పంపిణీ ఆపరేటర్ లను బురిడీ కొట్టించిన వైసిపి ప్రభుత్వం..