యావత్ ప్రపంచాన్ని కరోనా వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ మహమ్మారి ఎప్పుడు తగ్గుతుందో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. అలాంటి సమయంలో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న చిత్రం కరోనా తగ్గుతుంది అనే దానికి సూచికగా ఉందంటూ నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకీ ఆ చిత్రంలో ఏముందంటే..?
దుబాయికి చెందిన గైనకాలజిస్ట్ సమీర్ చియాబ్ ఓ చిత్రాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ చిత్రంలో అప్పుడే పుట్టిన పాపనుతను ఎత్తుకోగా ఆ చిన్నారి తన చేతితో నా ముఖానికి ఉన్న మాస్క్ ను లాగుతుంది. ఆ సందర్భం ‘రానున్న రోజుల్లో వీటి అవసరం ఇక ఉండదు డాక్టర్ అంకుల్ ’ అన్నట్లు ఉందంటూ ఆయన ఈ చిత్రాన్ని తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు.
ప్రస్తుతం కరోనా వణికిస్తున్న తరుణంలో ఈ చిత్రం నాలో కొత్త ఉత్సాహన్ని ఇస్తుందంటూ డాక్టర్ అన్నారు. ఈ చిత్రాన్ని ఆయన పంచుకున్న కొద్ది సేపటిలోనే వేల లైకులను పొందింది.
ఈ ఏడాది ప్రారంభం నుంచి కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టుకుని పీడిస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి తరుణంలో ఈ చిత్రం నిజంగా ఆశాజనకంగా ఉందంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు.
‘ఈ చిన్నారి నిజంగా మనందరిలో కొత్త ఉత్సాహన్ని నింపడానికే వచ్చింది. రావడంతోనే మాస్క్ ల అవసరం ఇక ఉండదంటూ మనందరికి సందేశాన్ని తీసుకుని వచ్చిందంటూ’ ఓ నెటిజన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘2020 సంవత్సరానికే ఉత్తమ చిత్రం ఇది అంటూ ’ మరో నెటిజన్ పేర్కొన్నారు. ‘అంతా మంచే జరుగుతుందని ఈ చిన్నారి తెలియజేస్తుందంటూ’ మరొకరు తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ‘తను ఏడుస్తున్నప్పటికీ మనందరికీ సంతోషాన్ని కలిగించే విషయం తీసుకొచ్చిందంటూ మరి కొందరు సంతోషాన్ని వెల్లిబుచ్చారు’.
కరోనా విజృభించకుండా ప్రజలు ముఖానికి మాస్క్ , చేతులకు శానిటైజర్ లు రాసుకుంటూ ఒకరికొకరు భౌతిక దూరాన్ని పాటిస్తున్నారు. దీని వలన ఇప్పటికే కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఇంకా పూర్తి స్థాయిలో తగ్గలేదనే చెప్పవచ్చు.