కాలం కలిసిరాకపోతే తాడే పామై కరుస్తుందనే సామెత మనకు కొత్త కాదు. ఆమెకు సినిమా రంగంలో ఉప్పెనలా అవకాశాలు వెల్లువెత్తాయి. కానీ ఏం లాభం… కరోనా ఆమె కెరీర్ కు అర్ధాంతరంగా బ్రేక్ వేసింది. ఆమె మరెవరో కాదు కృతిశెట్టి. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఉప్పెన’ సినిమా ద్వారా కృతి శెట్టి తెలుగు తెరకు పరిచయం కావాలి. ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కావలసి ఉంది. ఇందులోని ‘నీ నీలి కన్నుల్లో సముద్రం.. ’పాట కృతి శెట్టికి ఎంతగా పేరు తీసుకొచ్చిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.. 16ఏళ్ల ఈ టీనేజర్ తొలి సినిమా విడుదలకు ముందే తెలుగు తెరపై సంచలనంగా మారింది. ఏటా చాలామంది హీరోయిన్లు పరిచయమవుతుంటారు కానీ వారిలో కొందరే సక్సెస్ అవుతుంటారు.
ఈ ఒక్క పాటతో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. కొత్త అవకాశాల మాట ఎలా ఉన్నా… తొలి సినిమానే విడుదల కాలేదు. కృతి అసలు పేరు అద్వైత. ఆ పేరు పలకడం కష్టం ఉందని 2013లోనే తన పేరును కృతిశెట్టిగా మార్చుకుంది. కన్నడంలో బాలనటిగా కొన్ని సినిమాలు చేసింది. ఆమె భరతనాట్యం కళాకారిణి. చాలా చోట్ల నాట్య ప్రదర్శనలు కూడా ఇచ్చింది. చిన్న వయసు నుంచే నటించడం వల్లనేమో ఆమె పలికించే హావభావాలకు జనం ఫిదా అయిపోతున్నారు.